Kadiyam Kavya: ఎంతలో ఎంత మార్పు.. సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే సమయానికి ” సారు, కారు, 16″ అనే నినాదం వినిపించింది. ఢిల్లీలోనూ తెలంగాణ వాదం వినిపించాలని, కేసీఆర్ కేంద్రంలో చక్రం తిప్పాలని..అబ్బో మామూలు హడావిడి ఉండేది కాదు. కేటీఆర్ లాంటి వాళ్ళైతే దేశానికి కేసీఆర్ ఎందుకు ప్రధానమంత్రి కాకూడదని ప్రశ్నించారు కూడా.. మల్లారెడ్డి లాంటివాళ్లయితే ఒక అడుగు ముందుకేసి కేసీఆర్ కారణజన్ముడు అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేశారు.. కాలం గడిచిపోయింది.. అధికారాంతమున చూడాలి అయ్యవారి చిత్రాలు అన్నట్టుగా భారత రాష్ట్ర సమితి పరిస్థితి మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, కేసీఆర్ తొంటి ఎముక విరిగిపోవడం, లిక్కర్ స్కాంలో కవిత అరెస్టు కావడం, ఫోన్ ట్యాపింగ్ కేసు తెరపైకి రావడం.. ఇవే ఇబ్బంది పెడుతుంటే.. భారత రాష్ట్ర సమితిని వరుసగా నేతలు విడిపోతున్నారు. పార్లమెంటు ఎన్నికల ముందు ఇది భారత రాష్ట్ర సమితికి ఇబ్బందేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల ముందు..
వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎవరూ ముందుకు రావడంలేదని అప్పట్లో వ్యాఖ్యలు వినిపించాయి. అయితే స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్ది 17 స్థానాలకు పలు దఫాలుగా అభ్యర్థులను ప్రకటించారు. కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల్లో వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీలో ఉన్న కడియం కావ్య అనుకోని షాక్ ఇచ్చారు. ఆకస్మాత్తుగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. భూకబ్జా ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, లిక్కర్ స్కామ్ ఉదంతం వంటివి తనను ఇబ్బంది పెడుతున్నాయని, అందుకే రాజీనామా చేసినట్టు, పోటీలో ఉండకూడదని నిర్ణయించుకున్నట్టు ఆమె ప్రకటించారు. కావ్య కంటే ముందు గత పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ ఏరి కోరి టికెట్ ఇచ్చిన చేవెళ్ల స్థానం సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడు రంజిత్ రెడ్డి ఇటీవల కార్ దిగి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీలో చేరి చేవెళ్ల స్థానం నుంచి పోటీలో ఉన్నారు. రంజిత్ రెడ్డి తర్వాత వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీలో ఉన్న కడియం కావ్య కూడా కాంగ్రెస్ బాట పట్టడం గులాబీ శ్రేణులను కలవరానికి గురిచేస్తోంది. వీరు మాత్రమే కాదు భారత రాష్ట్ర సమితి నుంచి పార్లమెంట్ టికెట్ పొందిన అభ్యర్థుల్లో చాలామంది కాంగ్రెస్ నాయకులతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.
కావ్య రాజీనామాకు రకరకాల కారణాలను రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా వరంగల్ పార్లమెంటు స్థానం పరిధిలో భారత రాష్ట్ర సమితిలో నెలకొన్న పరిస్థితులే కావ్య రాజీనామాకు కారణమని తెలుస్తోంది. వాస్తవానికి వరంగల్ పార్లమెంట్ టికెట్ ను అప్పటి భారత రాష్ట్ర సమితి వరంగల్ అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆశించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడంతో.. పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని భావించారు. మరో సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి తన కుమార్తె కావ్యను రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఆలోచనను కేసీఆర్ ముందు బయట పెట్టారు. వరంగల్ ఎంపీ టికెట్ తన కూతురికి ఇవ్వాలని కేసీఆర్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ పరిణామాలు ముందే తెలుసుకున్న ఆరూరి రమేష్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ తర్వాత భారత రాష్ట్ర సమితిలో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో రమేష్ కి టికెట్ ఇస్తానని కెసిఆర్ ప్రకటించారు. అయితే ఆ ఆఫర్ ను రమేష్ తిరస్కరించారు.”మీరు టికెట్ ఇచ్చినా స్థానికంగా ఉన్న నాయకులు నాకు సహకరించరు. అలాంటప్పుడు నా రాజకీయ భవిష్యత్తును నేను నాశనం చేసుకోలేను” అంటూ రమేష్ బయటికి వచ్చారు. బిజెపిలో చేరి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
రమేష్ బయటకు వెళ్లిపోయిన తర్వాత మార్చి 13న కడియం కావ్యను వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కెసిఆర్ ప్రకటించారు. అనంతరం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులను కావ్య కలుస్తున్నారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. కావ్య కు కెసిఆర్ టికెట్ ఇవ్వడంతో వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ ఈనెల 16న తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన చేరిన వెంటనే ఆరూరి రమేష్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు. దీంతో భారత రాష్ట్ర సమితి నాయకుల్లో ఆందోళన నెలకొంది.
రాజీనామా లేఖలో కావ్య ఏం చెప్పారంటే..
“శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి..
పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా నాకు పోటీచేసే అవకాశాన్ని కల్పించినందుకు మీకు నా కృతజ్ఞతలు. కొద్దిరోజులుగా భారత రాష్ట్ర సమితి నాయకత్వంపై మీడియాలో పలు వార్తలు వస్తున్నాయి. అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ వంటి విషయాలు పార్టీని ప్రజల్లో చులకన చేశాయి. జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం లేదు. ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నట్టుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను పోటీ నుంచి తప్పుకోవాలని భావించాను. గౌరవనీయులైన కెసిఆర్ గారు, పార్టీ నాయకత్వం, భారత రాష్ట్రపతి కార్యకర్తలు నన్ను మన్నించాలని కోరుతున్నాను.” అంటూ కావ్య కేసీఆర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Kadiyam srihari and kavya will join congress
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com