Good Friday 2024: మూఢనమ్మకాలనుంచి చైతన్యపరిచిన వ్యక్తిగా, పాపాల నుంచి ప్రజలను కాపాడిన కాపరిగా, సత్యాన్ని పలకడం, ధర్మాన్ని ఆచరించడం, సన్మార్గంలో నడవడం వంటి వాటిని పాటించి చూపి ఏసుప్రభు దేవుడయ్యాడు. మానవాళి పాపాలకు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. సిలువపై సజీవ సమాధి అయ్యాడు.. అందుకే ఏసుక్రీస్తు జ్ఞాపకార్థం గుడ్ ఫ్రైడే నిర్వహిస్తారు. దీనిని పవిత్ర శుక్రవారం లేదా బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు.
సిలువ వేసిన మూడు రోజుల తర్వాత యేసు పునరుత్థానాన్ని ఆదివారం జరుపుకుంటారు. దీనిని ఈస్టర్ అని పిలుస్తారు.. ఈ పండుగ రోజు క్రైస్తవులు నూతన వస్త్రాలు ధరిస్తారు.. చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తారు.. అనంతరం పేదలకు అన్నదానం చేస్తారు. ఇంటిల్లిపాది పిండి వంటలు, ఇతర వంటలు వండుకొని ఆరగిస్తారు.. గుడ్ ఫ్రైడే రోజు క్రైస్తవులు ఉపవాస దీక్ష పాటిస్తారు. ఆరోజు ఎటువంటి ఘన, ద్రవ ఆహారాలను ముట్టుకోరు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏసుక్రీస్తు నామస్మరణ లోనే ఉంటారు. చర్చిలలో ఉపాసకులు ప్రవచనాలు చేస్తుంటారు. భక్తులు ప్రార్థనలు, ధ్యానం వంటి వాటిలో నిమగ్నమవుతారు. ఏసుక్రీస్తును సిలువ వేసిన ఘటనను స్మరించుకుంటూ కొంతమంది క్రైస్తవులు నల్లటి దుస్తులు ధరించి తమ ఆవేదనను వ్యక్తం చేస్తారు.
శుభ శుక్రవారం ఏసుక్రీస్తు మరణాన్ని ఉద్దేశించి జరుపుకుంటారు. క్రైస్తవులు దీనిని త్యాగానికి గుర్తుగా అభివర్ణిస్తారు. ఏసుక్రీస్తుకు సంతాపం తెలియజేయడానికి గుడ్ ఫ్రైడే నిర్వహిస్తారు. అందుకే గుడ్ ఫ్రైడే వస్తే మాత్రం ఏ ఒక్కరు హ్యాపీ గుడ్ ఫ్రైడే అని చెప్పుకోరు. మిగిలిన వారు కూడా అటువంటి సందేశాలు పంపుకోరు.. చర్చిలలో క్రిస్మస్ లాగా ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరగవు.. ఏసుక్రీస్తు ప్రజల పాపాల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడని, మానవాళికి శుభం కలిగించాడని, అందుకే శుక్రవారం కి ముందు గుడ్ అనే పదం వచ్చి చేరిందని క్రైస్తవులు విశ్వసిస్తారు.
గుడ్ ఫ్రైడే ను బ్లాక్ ఫ్రైడే లేదా, గ్రేట్ ఫ్రైడే అని కూడా క్రైస్తవులు పిలుస్తారు. శిలువ వేయడం అనేది ఏసుక్రీస్తు జీవితంలో చిట్టచివరి ఘట్టమని క్రైస్తవులు నమ్ముతుంటారు. అందుకే పలు చర్చిలలో ఏసుక్రీస్తు జీవితానికి సంబంధించిన ఘట్టాలను నాటికల రూపంలో ప్రదర్శిస్తారు.. పాశ్చాత్య దేశాలలో గుడ్ ఫ్రైడే కు 46 రోజుల ముందు లెంట్ డేస్ మొదలవుతాయి.. ఆరోజుల్లో క్రైస్తవులు ఉపవాస దీక్ష పాటిస్తారు. ఉదయం లేదా సాయంత్రం మాత్రమే కొంత మొత్తంలో ఆహారం తీసుకుంటారు. ఆ తర్వాత ప్రభువు నామస్మరణలో గడుపుతుంటారు.. చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు. తమ ఆర్థిక స్తోమత ఆధారంగా పేదలకు సహాయం చేస్తుంటారు.