Jubilee Hills By Election Result: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతోంది.. ఇప్పటికే మూడు రౌండ్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దాదాపు 1300 ఓట్ల లీడ్ తో ఉన్నారు. భారత రాష్ట్ర సమితి అభ్యర్థి సునీత కూడా గట్టి పోటీ ఇస్తున్నారు.. ఇప్పటివరకు బోరబండ డివిజన్ వరకు ఓట్ల లెక్కింపు పూర్తయింది. తదుపరి సోమాజిగూడ, రహమత్ నగర్, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్.. ఇతర ప్రాంతాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది.
వాస్తవానికి ఉప ఎన్నికల్లో పోలింగ్ మూడు రోజుల వరకు భారత రాష్ట్ర సమితి విజయం మీద సంపూర్ణ విశ్వాసంతో ఉంది. పోలింగ్ మరో మూడు రోజులు ఉందనగా అధికార పార్టీ తన సత్తా చూపించింది. మంత్రుల దగ్గర నుంచి మొదలు పెడితే కార్పొరేషన్ చైర్మన్ ల వరకు అందరు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో తిష్ట వేశారు. ఎప్పటికప్పుడు పోల్ మేనేజ్మెంట్ ను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లారు.. తద్వారా ఒక్కసారిగా గులాబీ పార్టీ డిఫెన్స్ లో పడిపోయింది.. దీంతో ఊహించని విధంగా అధికార పార్టీ లైన్లోకి వచ్చింది. తద్వారా జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో పొలిటికల్ ముఖచిత్రం మారిపోయింది.
ప్రస్తుతం ఓట్ల లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్, గులాబీ పార్టీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది.. రౌండ్ రౌండ్ కు లీడ్ మారిపోతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఊహించిన విధంగా పరాభవం ఎదురవుతోంది.. డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి లేకుండా పోతుంది. ఇప్పటివరకు మూడు రౌండ్ల లెక్కింపు పూర్తయిన తర్వాత భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దిలీప్ రెడ్డికి కేవలం 300 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇకపై వచ్చే రౌండ్లలో మెజారిటీ ముస్లిం ఓటర్లు ఉన్నారు. సహజంగానే ముస్లిం ఓటర్లు బిజెపికి ఓటు వేయరు. అలాంటప్పుడు బిజెపి అభ్యర్థికి డిపాజిట్ దక్కడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో 48% ఓటింగ్ నమోదయింది. వాస్తవానికి ఇక్కడ నాలుగు లక్షల పైగా ఓటర్లు ఉన్నారు. వారిలో 52 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఇక పార్లమెంటు ఎన్నికల్లో ఇక్కడ బిజెపి స్పష్టమైన లీడ్ ప్రదర్శించింది. కానీ ఉప ఎన్నికల విషయానికొచ్చేసరికి ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.. బండి సంజయ్ నుంచి మొదలు పెడితే కిషన్ రెడ్డి వరకు ప్రచారం చేసినప్పటికీ ఓటర్లు బిజెపిని నమ్మలేదు. కనీసం డిపాజిట్ కూడా ఇవ్వలేదు. మరి దీనిపై బీజేపీ అధిష్టానం ఏ విధంగా ఆలోచన చేస్తుందో చూడాల్సి ఉంది.