Lord Balaji Miracles: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని భక్తులు పరితపిస్తుంటారు. కలియుగ దైవంగా భావించే ఏడుకొండల స్వామి తిరుమల లో కొలువై ఉన్నాడు. దీంతో దేశంలోనే కాకుండా విదేశాల నుంచి శ్రీవారి దర్శనానికి ఇక్కడికి తరలి వస్తుంటారు. అయితే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులు కేవలం ఆధ్యాత్మిక వాతావరణం లోనే గడపడం కాకుండా ఇక్కడ అనేక విశేషాలను చూడగలుగుతారు. ఏడుకొండల్లో కొలువైన ఈ స్వామి వద్దకు వచ్చే సమయంలో ఎంతో ఉల్లాసమైన వాతావరణాన్ని పొందుతారు. అంతేకాకుండా ఇక్కడ అద్భుతమైన విశేషాలను తెలుసుకొనగలుగుతారు. గరుడ స్వామి గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
తిరుమల కొండకు ఎక్కే ముందు అలిపిరి వద్ద గరుత్మంతుడి విగ్రహం కనిపిస్తుంది. ఆధ్యాత్మిక చింతన ఉన్నవారికి గరుత్మంతుడి గురించి తెలిసే ఉంటుంది. కానీ కొత్తవారికి ఈ విగ్రహం ఏంటో తెలియదు. అయితే వెంకటేశ్వర స్వామికి గరుత్మంతుడికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. అందుకే ఏడుకొండలు ఎక్కే ముందు గరుత్మంతుడి దర్శనం అవుతుంది. అయితే గరుత్మంతుడు ఇలా విగ్రహం రూపంలోనే కాకుండా తిరుమల కొండ లో కొలువై ఉన్నట్లు దర్శనమిస్తున్నాడు. తిరుమల పైకి వెళ్లడానికి కిందికి రావడానికి రెండు ఘాట్ రోడ్లు ఉంటాయి. వీటిలో కిందికి వచ్చే ఘాట్ రోడ్డు లో మాల్వాడి గుండానికి ముందు ఒక ఆకారం కనిపిస్తుంది. ఆ ఆకారం గరుత్మంతుడిలా కనిపిస్తుంది. ఈ విషయం తెలిసిన చాలా మంది కొండ దిగేటప్పుడు ఇక్కడ కాసేపు ఆగి గరుత్మంతుడి ఆకారాన్ని చూసి తన్మయత్వాన్ని పొందుతూ ఉంటారు. మరికొంతమంది ఈ దృశ్యాన్ని మొబైల్స్ లో చిత్రీకరించుకుంటారు.
హిందూ పురాణాల ప్రకారం గరుత్మంతుడు పక్షిరాజు. ఋషి కశ్యపుడు, వినతల కుమారుడు అయిన గరుత్మంతుడు అమృతాన్ని తీసుకురావడం వల్ల ఆయనకు అజరామరం లభిస్తుంది. అంతేకాకుండా బలం, అత్యంత వేగం, ధైర్యానికి ప్రతీకగా గరుత్మంతుడిని పేర్కొంటారు. ప్రాణ శక్తి, విజయం, రక్షణ కలిగించేందుకు గరుత్మంతుడిని పూజిస్తారు. గరుత్మంతుడు వెంకటేశ్వర స్వామికి వాహనంగా ఉంటాడు. తిరుమల కొండ మొత్తం గరుత్మంతుడు తన శరీరంపై మోస్తున్నట్లు ఆకారం ఉంటుందని అంటూ ఉంటారు. ఆ శరీర భాగాల్లో తలభాగం ఈ ఘాట్ రోడ్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రాయినే గరుడ ముఖం అని అంటారు.
బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ ప్రత్యేకంగా ఆకర్షణగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామికి గరుడుడు వాహనంగా ఉంటాడు. అందువల్ల బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవను ప్రత్యేకంగా కీర్తిస్తారు. మిగతా రోజుల్లో కంటే గరుడ సేవలో భక్తులు ఎక్కువగా పాల్గొంటారు. ఇలా వెంకటేశ్వర స్వామి సేవలో గరుడుడు ప్రత్యేకంగా కనిపిస్తాడు. తిరుమల కొండ లో భాగంగా గరుడుడు మాత్రమే కాకుండా అనేక విశేషాలు ఉన్నాయి కొండ మొత్తం శ్రీవారి మొహం కలిగిన ఆకారం ఉన్నట్లు గుర్తించారు.