Jubilee Hills By Election CM Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్ జోరు పెంచింది. అధికారంలో ఉన్నాం కాబటి తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. హస్తం పార్టీకి ఇది సామాన్య పోరు కాదు, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్టకు సంబంధించిన యుద్ధరేఖగా రూపుదిద్దుకుంది. పార్టీ అంతర్గత విభేధాలు, అసంతృప్తిని కట్టడి చేసిన రేవంత్ ఈ ఎన్నికను నాయకత్వ సమర్థతకు నిదర్శనంగా చూపించాలని భావిస్తున్నారు.
కాంగ్రెస్ ధీమా.. అయినా ఒత్తిడి
రేవంత్‌రెడ్డి ‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుస్తాం’’ అన్న ధీమాలో ఉన్నా, పార్టీ లోపల కొంత అనిశ్చితి స్పష్టంగా ఉంది. ఆయన రాజకీయ చాణక్యంతో తాత్కాలికంగా విభేదాలను అణగదొక్కారు. కానీ ఓటమి సంభవిస్తే, ఆ అసంతృప్తులు మళ్లీ తలెత్తే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఫలితం ప్రతికూలంగా వస్తే, దానిని ఆధారంగా చేసుకుని అంతర్గత వర్గాలు రేవంత్ నాయకత్వంపై ప్రశ్నలు లేపే సూచనలు ఉన్నాయి.
స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్..
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి రేవంత్‌రెడ్డికి ధైర్యం రాలేదని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. జూబ్లీహిల్స్‌లో విజయం సాధించగలిగితే మాత్రమే ఆయన రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు మార్గం సుగమమవుతుందని భావిస్తున్నారు. వీటిలో రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ పరికరంగా ఉపయోగించే వ్యూహం కూడా దృష్టిలో పెట్టుకున్నారు.
అధికారం, ఎంఐఎం మద్దతు, బీసీ కార్డు..
ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ బీసీ వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దింపింది. అదే సమయంలో ఎంఐఎం పార్టీ పూర్తి సహకారం ఇవ్వడం కాంగ్రెస్ లెక్కల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ‘‘బీసీ ప్లస్ ముస్లిం మైనారిటీ కాంబినేషన్ ప్లస్ అధికారం’’ అనే రేవంత్ వ్యూహం జూబ్లీహిల్స్‌లో ఎన్నికా సమీకరణాన్ని మార్చగలదని ఆయన విశ్వసిస్తున్నారు. ఈ రెండు వర్గాలు చురుకుగా మద్దతిస్తే వైపు కాంగ్రెస్‌కే లాభమని పార్టీ అంచనా.
ప్రతిపక్షాల పరిస్థితి…
బీఆర్‌ఎస్ ఇప్పటికే తన అభ్యర్థిని ప్రకటించినా, ఆ అభ్యర్థికి పెద్దగా ప్రజా స్పందన లభించకపోవడంతో ఆ పార్టీ యంత్రాంగం నిశ్శబ్దంగా ఉంది. భాజపా మరింత ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడం వల్ల, తమ వద్ద బలమైన నాయకత్వం లేకపోవడానికే సంకేతమని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఈ రెండు పార్టీలు మౌనంగా ఉండటమే కాంగ్రెస్‌కు దూకుడు పెంచే అంశంగా మారింది.
జూబ్లీహిల్స్‌లో విజయం సాధిస్తే రేవంత్‌రెడ్డి నాయకత్వం మరింత బలపడుతుంది. అదే ఓటమి వస్తే అంతర్గత వ్యతిరేక శక్తులు తిరిగి మేల్కొని, ఆయన అధికార కుర్చీని సవాలు చేసే అవకాశం ఉంది. అందుకే ఈ ఉపఎన్నిక ఫలితం కేవలం నియోజకవర్గ స్థాయి వ్యవహారం కాదు రాష్ట్ర కాంగ్రెస్ భవిష్యత్తును నిర్ణయించే మలుపు. జూబ్లీహిల్స్ ఓటు రేవంత్‌రెడ్డి వ్యక్తిగత నాయకత్వంపై ప్రజా తీర్పుగా మారబోతోంది. గెలిస్తే ఆయనకు కొత్త ఆరంభం, ఓడితే పార్టీ దిశను సవాలు చేసే మలుపు.