Joint Commissioner Ranganath : అప్పటిదాకా ఒక లెక్క.. ఆయన వచ్చాక ఒక లెక్కా.. హైదరాబాద్ ట్రాఫిక్ ను సెట్ రైట్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్ గా రంగనాథ్ నిలిచారు. సివిల్ పోలీసు వ్యవస్థ రక్షణ చర్యలు చేపడితే.. ట్రాఫిక్ పోలీసులు అంతకుమించి క్లిష్టమైన ట్రాఫిక్ ను నియంత్రిస్తారు. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ట్రాఫిక్ అంటే కత్తిమీద సాము. వందల కాలనీలు.. వేల రోడ్లు..అన్నింటిని నియంత్రించాలంటే ఎవరికీ సాధ్యం కాదు.. కానీ హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా రంగనాథ్ వచ్చాక ట్రాఫిక్ కష్టాలు తీరాయి. సరికొత్త వ్యూహాలతో అటు ప్రజలకు ఇబ్బందులు కాకుండా.. ఇటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా చేశారు.

హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా రంగనాథ్ నియామకం అయిన తర్వాత నగరంలో సంస్కరణలకు ఆజ్యం పోశారు. ఇన్నాళ్లు పోలీసులు హైదరాబాద్ లోని రోడ్ల పక్కన.. చిన్న చిన్న కాలనీల్లో ట్రాఫిక్ పోలీసులు దాక్కొని హెల్మెట్ ధరించని.. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిని ఫొటోలు తీసి జరిమానాలు విధించేవారు. ఇన్నాళ్లు ట్రాఫిక్ పోలీసులు కలెక్షన్ల మీదే దృష్టిపెట్టారు. అలాంటి పోలీసుల మైండ్ సెట్ మార్చిన ఘనత రంగనాథ్ దే..
రంగనాథ్ హైదరాబాద్ నగర ట్రాఫిక్ జేసీగా బాధ్యతలు చేపట్టాక ప్రమాదాలు బాగా తగ్గించారని పేరు తెచ్చుకున్నారు. ఎక్కడైతే యాక్సిడెంట్లు జరుగుతున్నాయో అక్కడే దృష్టి సారించారు. గల్లీలు వదిలి ప్రమాదభరిత ప్రాంతాలకు పోలీసులను మళ్లించారు. అవి జరగకుండా చేసి ప్రజల ప్రాణాలు కాపాడారు. పోలీసులు ఉండేది ప్రజల కోసమేనని నిరూపించారు.
ఇక ఇటీవల వీవీఐపీల పేరుతో వాహనాలకు స్టిక్కర్లు వేసుకొని హైదరాబాద్ లో యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఇటీవల బోధన్ ఎమ్మెల్యే స్టిక్కర్ తో ఓ వాహనం వీధి వ్యాపారులపై ఎక్కించి ఒక బాలుడి ప్రాణాలు కూడా తీసింది. ఇలాంటి వాటిని జేసీ రంగనాథ్ ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. నకిలీ స్టిక్కర్లతో తిరుగుతున్న వాహనాలను సీజ్ చేసి పారేస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీలంటూ వేసుకొని రోడ్డెక్కుతున్న వారిని వెంటాడుతున్నారు. తద్వారా వీఐపీ ట్రీట్ మెంట్ కు చరమగీతం పాడుతున్నారు.
హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఒక మంచి అబ్జర్వేషన్ తో.. అవగాహనతో పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టిస్తూ ఇప్పుడు ట్రాఫిక్ ను క్రమబద్దీకరించి సెట్ రైట్ చేసిన ఘనత ఖచ్చితంగా రంగనాథ్ కే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక ఇంతకుముందు నల్గొండ ఎస్పీగా రంగనాథ్ విశేష ప్రతిభ చాటారు. ఆ జిల్లాను శాంతిభద్రతల్లో నంబర్ 1 గా నిలిచారు. అనంతరం ఐజీగా ప్రమోట్ అయ్యి ఇప్పుడు హైదరాబాద్ నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన కాలంలోనే నగరంలో తన మార్కును చూపించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.
ఇక ఇటీవల మార్చి 31లోపు ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు క్లియర్ చేస్తే రాయితీని కల్పించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో అత్యధికంగా రెండు రోజుల్లోనే 15 లక్షల చలానాలు కట్టేలా రంగనాథ్ కీలక పాత్ర పోషించారు. ఏకంగా 15 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వానికి సముపార్జింపచేశారు. ఆన్ లైన్ తోపాటు అసెంబ్లీ ఎదురుగా ట్రాఫిక్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి, ఈసేవా, మీసేవాల్లో కూడా పెండింగ్ చలాన్లు కట్టేలా ప్రజలందరికీ అవగాహన కల్పించి పెద్ద ఎత్తున చలాన్లు కట్టించారు. ప్రభుత్వానికి కోట్లరూపాయల ఆదాయాన్ని తెచ్చిపెట్టారు. ఇలా ట్రాఫిక్ ను క్రమబద్దీకరించడంతోపాటు ప్రజలు కష్టాలు తీర్చి వారికి చలాన్ల బాధల నుంచి విముక్తి కల్పించారు. అందుకే రంగనాథ్ ను ఇప్పుడు జంట నగరాల ప్రజలంతా కొనియాడుతున్నారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.