Jagan And KTR: దేశంలో కుటుంబ రాజకీయాలు కాంగ్రెస్ మినహా ఎక్కువగా ప్రాంతీయ పార్టీల్లో కనిపిస్తాయి. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీ, తెలంగాణలో బీఆర్‌ఎస్ ఇలా అనేక కుటుంబ పార్టీలు ఉన్నాయి. కీలక పదవులన్నీ కుటుంబ సభ్యులకే దక్కుతాయి. అయితే ఈ క్రమంలో పదవుల, ఆస్తుల విషయంలో గొడవలతో విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇదే విషయంలో ఇద్దరు కీలక నేతలు.. తమ ఎదుగుదలకు కృషి చేసిన చెల్లెళలను పక్కడ పెట్టేశారు.
షర్మిలను దూరం కొట్టిన జగన్..
2019లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. అంతకు ముందు జగన్ చేపట్టిన పాదయాత్ర, జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన చెల్లెలు వైఎస్.షర్మిల చేపట్టిన పాదయాత్ర ఎంతో ఉపయోగపడింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సీఎం అయ్యారు. అన్నయ్య తన కష్టానికి గుర్తింపు ఇస్తాడని షర్మిల ఆశించారు. కానీ, అధికారంలో ఉండగానే తల్లిని, చెల్లిని దూరం పెట్టారు. అధికారంలో జోక్యం చేసుకునే అవకాశం ఇవ్వలేదు. కనీసం ఏ పదవి కూడా అప్పగించలేదు. దీంతో అలిగిన షర్మిల ఆంధ్రాను వీడారు. తెలంగాణకు వచ్చి సొంత పార్టీ పెట్టారు. పార్టీను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కష్టపడ్డారు. పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో జగన్, షర్మిల మధ్య ఆస్తుల విషయంలో గొడవలు పెరిగాయి. దీంతో షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఏపీకి వెళ్లిపోయారు.
ఇప్పుడు కవిత..
ఇక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతలో కేసీఆర్‌తోపాటు అనేక మంది ఉన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఆయన కూతురు కవిత కూడా ఉద్యమానికి ఊపిరులూదారు. జాగృతి ద్వారా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తూ మహిళలను ఉద్యమంవైపు నడిపించారు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంలో ఆమె పాత్ర కూడా కాదనలేనిది. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్ అలియాస్ టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చింది. కవితకు కేసీఆర్ ఎంపీ టికెట్ ఇచ్చి నిజామాబాద్ నుంచిగెలిపించారు. అయితే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తే కవితను మంత్రిని చేయాలని కూడా భావించారు. కానీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అయినా కేసీఆర్ ఎన్డీఏలో చేరేందుకు యత్నించారు. కానీ ప్రధాని మోదీ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కవితను కేంద్ర మంత్రిని చేయాలన్న కోరిక నెరవేరలేదు.
రెండోసారి అధికారంలోకి..
ఇక 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్.. మరింత మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. దీంతో 2019 జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కవితను మరోసారి పార్లమెంటుకు పంపాలని ఈసారి కేంద్ర మంత్రి పదవి వస్తుందని భావించారు. కానీ, కవిత నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో ఓడిపోయారు. కూతురి బాధ చూడలేక కేసీఆర్ తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.
కవితకే అనే పోటీ..
ఇక బీఆర్‌ఎస్ పార్టీలో పవర్ పాలిటిక్స్ మొదలయ్యాయి. కవిత, అన్న కేసీఆర్, అల్లుడు హరీశ్‌రావు మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయిన తర్వాత ఈ పోరు మరింత ఎక్కువైంది. ఏప్రిల్‌లో నిర్వహించిన పార్టీ సిల్వర్‌జూబ్లీ వేడుకల్లో కేసీఆర్ తన వారసుడిగా కేటీఆర్‌ను ప్రమోట్ చేశాడు. ఇది కవితకు నచ్చలేదు. దీంతో తండ్రికి ఆరు పేజీల లేఖ రాసింది.
కవితను దూరం పెట్టిన కేటీఆర్..
కవిత కేసీఆర్‌కు లేఖరాయడంతోపాటు దానిని మీడియాకు లీక్ చేయడం, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు చేరాయని వ్యాఖ్యానించడం కేటీఆర్‌కు కోపం తెప్పించింది. దీంతో ఆయన కవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసంతృప్తి ఉంటే.. అంతర్గతంగా చర్చించాలిగానీ, బహిరంగ లేఖలు రాయడం, మీడియా ఎదుట మాట్లాడడం సరికాదని వార్నింగ్ ఇచ్చారు. దీంతో కేటీఆర్, కవిత మధ్య గ్యాప్ మరింత పెరిగిందన్న చర్చ జరుగుతోంది.
మొత్తంగా రాజకీయాల్లో దగ్గరగా ఉండే జగన్, కేటీఆర్.. తమ చెల్లెళ్లను మాత్రం రాజకీయాలకు దూరం చేయాలని చూస్తున్నారన్న చర్చ జరుగుతోంది.