Telangana: రేవంత్ ది బోగస్ అయితే.. కేటీఆర్ దీ తప్పే.. ఇదిగో ఆయన పెట్టించిన లేని కంపెనీల కథ!

15 రోజుల ముందు ఏర్పాటు చేసిన కంపెనీతో ఎంవోయూ ఎలా కుదుర్చుకుంటారు అని ప్రశ్నిస్తున్న భారత రాష్ట్ర సమితి నాయకులు.. అసలు లేని కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని పక్కన పెడుతున్నారు. అంటే మీడియా మొత్తం వాళ్లకు బాకాలు ఊదుతుందని.. భజంత్రీలు వాయిస్తుందని అనుకుంటున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : August 9, 2024 4:26 pm
Follow us on

Telangana : నిజం గడప దాటేలోపు.. అబద్ధం ఊరు మొత్తం తిరిగి వస్తుందట.. ఈ సామెతను భారత రాష్ట్ర సమితి నాయకులు నిజం చేసి చూపించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడులకు సంబంధించి అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆయన వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, పరిశ్రమల కార్యదర్శి జయేష్ రంజన్ వంటి వారు ఉన్నారు. ఈ క్రమంలో స్వచ్ఛ్ బయో అనే కంపెనీ తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అలా సోషల్ మీడియా ద్వారా బయట పెట్టిందో లేదో.. వెంటనే భారత రాష్ట్ర సమితి రంగంలోకి దిగింది. ఆ పార్టీ నాయకుడు మన్నె క్రిశాంక్ విలేకరుల సమావేశంలో సంచలన విషయాలు వెల్లడించారు. ” స్వచ్ఛ్ బయో అనేది 15 రోజుల క్రితం ఏర్పడిన కంపెనీ. ఈ కంపెనీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు డైరెక్టర్గా ఉన్నాడు. అందువల్లే ఆ కంపెనీకి ఆ స్థాయిలో ప్రయారిటీ ఇస్తున్నారు. దేనికోసం ఒప్పందం కుదుర్చుకున్నారు? భూముల కోసమా? రాయితీల కోసమా” అని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఆయన ట్విట్టర్ ఎక్స్ లో ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రీ ట్వీట్ చేశారు..”భవిష్యత్తులో ఇలాంటివి చాలా చూడాల్సి వస్తుంది..సునిశిత పరిశీలన అంటూ” కామెంట్స్ చేశారు.. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడే అసలు విషయాన్ని భారత రాష్ట్ర సమితి మర్చిపోయింది.

లేని కంపెనీలకు..

15 రోజుల ముందు ఏర్పాటు చేసిన కంపెనీతో ఎంవోయూ ఎలా కుదుర్చుకుంటారు అని ప్రశ్నిస్తున్న భారత రాష్ట్ర సమితి నాయకులు.. అసలు లేని కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని పక్కన పెడుతున్నారు. అంటే మీడియా మొత్తం వాళ్లకు బాకాలు ఊదుతుందని.. భజంత్రీలు వాయిస్తుందని అనుకుంటున్నారు. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు 2022 జూలై 10న భువి బయో కెమికల్స్, ధాత్రి బయోసిలికేట్స్ అనే కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. 1200 కోట్ల పెట్టుబడులు పెడదామని ఆ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఇందులో భువి కంపెనీ 1,040 కోట్లు, ధాత్రి కంపెనీ 160 కోట్లు పెట్టుబడులు పెడతామని ప్రకటించాయి. ఈ కంపెనీల ద్వారా 2,300 మందికి ఉద్యోగాలు వస్తాయని నాడు కేటీఆర్ ప్రకటించారు. ఈ కంపెనీల కోసం జగిత్యాల జిల్లాలోని మెట్ల చిట్టాపూర్ శివారులో 95 ఎకరాలు భూమి కేటాయించారు. ఇందులో భువి కంపెనీ కోసం 80 ఎకరాలు, ధాత్రి కంపెనీ కోసం 15 ఎకరాలు కేటాయించారు. ఒప్పందం జరగకముందే జూలై 1న నమస్తే తెలంగాణలో “విశ్వ విపణి లోకి మెట్ల చిట్టాపూర్” అనే శీర్షికన ఓ కథనం ప్రచురితమైంది. తెలంగాణ టుడే లో “తెలంగాణకు 1200 కోట్ల పెట్టుబడులు, 2,300 మందికి ఉద్యోగాలు” అనే శీర్షికన మరో కథనం ప్రచురితమైంది. అయితే ఇక్కడే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జూలై 10న భువి, ధాత్రి కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న నాటి ప్రభుత్వం.. అసలు విషయాన్నీ పూర్తిగా మర్చిపోయింది. ఎందుకంటే ఈ కంపెనీలు జూలై 14, జూలై 19న ఏర్పడ్డాయి. ఇదే విషయం రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ వెబ్ సైట్ లో కనిపిస్తోంది. ఈ కంపెనీల ఆదాయ వ్యవహారాలు సున్నా అని ఉన్నాయి. పైగా ఈ కంపెనీలకు సొంత వెబ్ సైట్ లు కూడా లేవు. ఆదాయం, ఖర్చు సున్నా ఉన్న కంపెనీలు 1200 కోట్లు పెట్టుబడులు పెడతాయి అంటే నాటి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఎలా నమ్మారు? అడ్డగోలుగా భూములు ఎలా కేటాయించారు? అన్ని ఎకరాల భూములు కేటాయించినప్పటికీ ఇంతవరకు అక్కడ తట్టెడు మట్టి తీయలేదు. కనీసం పరిశ్రమ ఏర్పాటు చేయలేదు.. ఈ కంపెనీలు ఇథనాల్ తయారు చేస్తాయని.. రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని అప్పట్లో కేటీఆర్ చెప్పారు. కానీ ఇదే భారత రాష్ట్ర సమితి ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతుండడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

 

నానా యాగీ చేస్తున్నారు

స్వచ్ఛ్ బయో విషయంలో గత మూడు రోజులుగా భారత రాష్ట్ర సమితి అనుకూల మీడియా, ఆ పార్టీ నాయకులు నానా యాగీ చేస్తున్నారు. ఇక యూట్యూబ్ జర్నలిస్టులకు, వెబ్ సైట్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 15 రోజుల క్రితం ఏర్పాటు చేసిన కంపెనీతో ఒప్పందం ఎలా కుదుర్చుకుంటున్నారు అని ప్రశ్నిస్తున్న భారత రాష్ట్ర సమితి నాయకులు.. అసలు లేని కంపెనీతో నాడు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఎలా ఒప్పందం కుదుర్చుకున్నారో బయటకి చెప్పడం లేదు. అసలు ఆదాయం లేదా వ్యయం లేని కంపెనీ 1200 కోట్లు పెట్టుబడులు పెడతామంటే నాటి ప్రభుత్వ పెద్దలు ఎలా నమ్మారో మరి. పైగా ఈ కంపెనీలకు సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ శ్యామలరావు.. నాడు కేటీఆర్ సమక్షంలో ఎంవోయూ కుదుర్చుకుంటున్న సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ పిలుపునిచ్చిన బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రధాన భూమిక కేటీఆర్ పోషిస్తున్నారని, ఆయనను నమ్మి తాము ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నామని పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో కంపెనీలు పెట్టాలని పంజాబ్, చత్తీస్ గడ్ ముఖ్యమంత్రులు ఒత్తిడి చేశారని, కానీ తాము కేటీఆర్ మీద ఉన్న నమ్మకంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చామని ప్రకటించారు. కానీ అవన్నీ గాలి మాటలని, పెట్టుబడులు పెట్టింది లేదు, ఉద్యోగాలు వచ్చింది లేదని తర్వాత గాని మెట్ల చిట్టాపూర్ వాసులకు అర్థం కాలేదు. స్వచ్చ్ బయో కంపెనీని షెల్ కంపెనీగా చెప్తున్న కేటీఆర్ అండ్ కో.. భువి, ధాత్రి కంపెనీలను ఏమని సంబోధిస్తాయి? అసలు లేని కంపెనీకి భూములు ఎలా కేటాయిస్తాయి? ఆదాయం, వ్యయం సున్నా ఉన్న కంపెనీలు 1200 కోట్లు పెట్టుబడులు పెడతాయి అంటే ఎలా నమ్మాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముమ్మాటికి నాటి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ దే అని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.