
దేశంలో థర్డ్ వేవ్ భయం గుప్పిట్లో జనం అల్లాడుతున్నారు. సెకండ్ వేవ్ ప్రభావంతో ప్రాణాలు కోల్పోయిన వారు ప్రస్తుతం థర్డ్ వేవ్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా అందుకు తగిన రీతిలో ఏర్పాట్లు చేయడం లేదు. మూడోవేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందన్న అంచనాతో తగిన ఏర్పాట్లు చేయాలని సూచించినా తెలంగాణ సర్కారు మాత్రం నిమ్మకు నీరె త్తనట్లుగా వ్యవహరిస్తుందని హైకోర్టు సైతం అక్షింతలు వేసింది.
దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. వైరస్ బారిన పడి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారి ప్రభావం అన్ని రాష్ర్టాలపై పడింది. తెలుగు రాష్ర్టాల ప్రజల్ని సైతం వణికిస్తోంది. ఏపీతో పోల్చితే తెలంగాణలో కరోనా కేసులు తక్కువగానే ఉన్నాయి. అయినా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అటు హైకోర్టు కూడా కరోనా పరిస్థితులపై విచారణ చేపట్టి పలుసార్లు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. టెస్టులతో పాటు వ్యాక్సిన్ విషయంలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.
సెకండ్ వేవ్ తగ్గిందనుకుంటే ఇప్పుడు థర్డ్ వేవ్ జనాన్ని బెంబేలెత్తిస్తోంది. ఇది పిల్లలపై ప్రభావం చూపిస్తుందని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో అన్ని రాష్ర్టాల్లో పిల్లల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించాలి. చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఆక్సిజన్ ఐసీయూ బెడ్లు సిద్ధం చేస్తున్నారు. అన్ని రాష్ర్ట ప్రభుత్వాలు తెలంగాణ రాష్ర్టంలో మాత్రం దీనికి సంబంధించిన కార్యాచరణ జరగడం లేదని విమర్శలు వస్తున్నాయి.
ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సల ధరలు ఒకే విధంగా ఉండాలన్న ఆదేశాలు అమలు చేశారా? అని ప్రశ్నించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలకు గరిష్ట ధరలు సవరిస్తూ కొత్త జీవో ఇచ్చారా అని అడిగింది. 14 కొత్త ఆర్ టీపీసీఆర్ ల్యాబ్ లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయని నిలదీసింది. మూడో దశ సన్నద్దతపై వివరాలు సమగ్రంగా లేవని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని సూచించింది