ఇటీవల చర్చనీయాంశమైన అంశం స్వేరోస్ వేదికపై జరిగిన ప్రతిజ్ఞ. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివిన పూర్వ విద్యార్థుల సంఘం(స్వేరో) ప్రతీ సంవత్సరం భీమ్ దీక్ష పేరుతో కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటుంది. కాన్షీరాం జయంతి నుంచి అంబేద్కర్ జయంతి వరకు దాదాపు నెల రోజులపాటు ఈ కార్యక్రమం సాగుతుంది. ఈ సారి తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ధూళికట్ల వద్ద 2వేల ఏళ్లనాటి ప్రాచీన బౌద్ధ స్తూపం దగ్గర ఈ వేడుక నిర్వహించారు.
Also Read: మళ్లీ లాక్ డౌన్..?
ఈ వేడుకపై ఓ కుటుంబం ప్రతిజ్ఞ చేసింది. ఈ ప్రతిజ్ఞలో ఏముందంటే.. ‘నేను హిందూ దేవుళ్లను నమ్మను. నాకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మీద నమ్మకం లేదు. నేను వాళ్లను పూజించను. దేవుడి అవతారాలను నమ్మను…’ అంటూ ఇలా సాగుతుంది ఆ ప్రతిజ్ఞ. అయితే.. సాధారణంగా ఈ ప్రతిజ్ఞ జరిగితే వివాదం ఉండేది కాదేమోగానీ.. ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ వేదికపై ఉండడంతో వివాదాస్పదం అయ్యింది. ప్రవీణ్ కుమార్ పై పలువురు కేసు కూడాపెట్టారు. రాజకీయ విమర్శలు చేశారు.
అయితే.. దీనిపై స్పందించిన ప్రవీణ్ కుమార్ స్పష్టత కూడా ఇచ్చారు. ‘‘ఆ కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులూ వచ్చారు. ఆ సమంలోనే ఓ బౌద్ధ కుటుంబం అక్కడికి వచ్చి బుద్ధవనం చదవడం ప్రారంభించారు. అదే సమయంలో1956లో అంబేద్కర్ చేసిన ప్రతిజ్ఞ కూడా చదివారు. దాంతో మాకేమీ సంబంధం లేదు. నేను కానీ, మా స్వేరో సహచరులు కానీ.. వారితో ఏకీభవించట్లేదు. అయినా..ఈ ఘటన ఎవరిమనోభావాలనైనా దెబ్బతిసి ఉంటే తీవ్రంగా చింతిస్తున్నాం. అదే వేదికమీద మా సంస్థ ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించారు.’’ చెప్పారు ప్రవీణ్ కుమార్.
అంతేకాకుండా.. స్వేరో ప్రతినిధులకు కూడా ఓ సందేశం ఇచ్చారు. ‘‘మనం ఏ మతానికీ వ్యతిరేకం కాదు. ఎవరి మీదా కోపం లేదు. మీరే హిందూ, క్రైస్తవ, జైన, ముస్లిం.. ఏ దేవుడికైనా మొక్కండి. కానీ.. మనం తినే ప్రతీ మెతుకు మీదా రమాబాయి (అంబేద్కర్ భార్య) ముద్ర ఉంది. మనకు తిండిపెట్టిన మహనీయులను మరిచిపోకండి స్వేరోయిజం అంటే కృతజ్ఞతా భావంతో బతకడం. కొందరు స్వేరోయిజంపై దుష్ప్రచారం చేస్తున్నారు’’ అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
స్వేరో ఉపాధ్యాయ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పులి కవిత కూడా క్లారిటీ ఇచ్చారు. ‘‘మేం ప్రతీ సంవత్సరం భీమ్ దీక్ష చేపడతాం. స్వేరో బౌద్ధం సహా ఏ మతాన్నీ సమర్థించదు.. వ్యతిరేకించదు. ఈ విషయంలో ప్రవీణ్ కుమార్ కూడా చాలా నిక్కచ్చిగా ఉంటారు. ఏ మతాన్నీ కించపరచొద్దని, సమర్థించొద్దని ఆయన స్పష్టంగా చెబుతారు. ఆ వేదికపైకి వరుసగా వస్తున్నవారంతా తాము చెప్పాలనకున్నది చెప్పి వెళ్లారు. ఆ సమయంలో ఓ కుటుంబం వచ్చి, ప్రతిజ్ఞ అనగానే.. అందరితోపాటు ప్రవీణ్ కుమార్ కూడా నిలబడ్డారు. కానీ.. అది చదవడం మొదలైన తర్వాతే అసలు విషయం తెలిసింది. తప్పని పరిస్థితుల్లో అలా ఉండిపోయారు.’’అని వెల్లడించారు.
Also Read: దేశం మొత్తం చూడాలంటున్న జగన్ ప్లాన్ ఇదీ
ఈ విషయంపై రాజకీయంగా ఎలాంటి విమర్శలు వచ్చాయో అందరికీ తెలిసిందే. బీజేపీ నేత బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదంతా కేసీఆర్ చేయిస్తున్నాడని కూడా అన్నారు ఆయన. ప్రవీణ్ కుమార్ హిందూమతంపై దాడికి పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. వీటికి పై విధంగా ప్రవీణ్ కుమార్ తోపాటు స్వేరో ప్రతినిధులు సమాధానం చెప్పారు.
అయితే.. ఈ ఘటనపై రిటైర్డ్ ఐఏఎస్ఆకునూరి మురళి, ఐపీఎస్ అరవిందరావు స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య మతపరమైన విషయాల్లో ఏం మాట్లాడినా దేశద్రోహి అంటున్నారని, ఇది చాలా దారుణం అని అన్నారు. హిందూ దేవతలపై నమ్మకం లేదని చెప్పడం తప్పుకాదని, అది తిట్టినట్టు కాదని అన్నారు. అసలు ఈ ప్రతిజ్ఞ బాబాసాహెబ్ అంబేద్కర్ చేశారు. ఆయనపై కేసు పెట్టనప్పుడు.. వీరిపై ఎలా పెడతారు? అని ప్రశ్నించారు. అదే సమయంలో.. ఎవరినీ కించపరచకుండా, ఎవరికి నచ్చిన పద్ధతుల్లో వాళ్లు ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్