
‘‘మహ్మద్ నసీబ్..’ మంచి చురుకైన వాడు. బలూచిస్థాన్ లోని జుల్‌ఫికర్ అలీలా యూనివర్సిటీలో LLB చదువుతున్నాడు. 2019 మే 14 సాయంత్రం తాను పెళ్లి చేసుకోబోయే హనీబుల్, ఆమె కజిన్ బయటకు వెళ్లి ఇంటికి వస్తుండగా.. హఠాత్తుగా ఎవరో వచ్చి ఇద్దరినీ కిడ్నాప్ చేశారు. హనీబుల్ ను మాత్రమే వదిలిపెట్టారు. అదే రోజు రాత్రి వాళ్లింటికి ఇచ్చి, హనీబుల్ ను కూడా అపహరించారు. ఆమెను మూడు నెలల పాటు టార్చర్ సెల్ లో ఉంచి, ఆ తర్వాత విడుదల చేశారు.’’
Also Read: మళ్లీ లాక్ డౌన్..?
మహ్మద్ నసీబ్, హనీబుల్ కజిన్ ఎక్కడ ఉన్నారో ఇప్పటికీ తెలియదు.. ఎప్పుడు వస్తారో తెలియదు.. ఎవరు ఎత్తుకెళ్లారో తెలియదు.. అసలు బతికే ఉన్నారా? లేదా? అనేది కూడా తెలియదు! ఇలా వీరిద్దరినే కిడ్నాప్ చేశారనుకుంటే పొరపాటు. వందల మందిని ఎత్తుకెళ్లారు. ఈ రోజుకు సైతం ఎత్తుకుపోతూనే ఉన్నారు! ఇదీ.. పాకిస్థాన్ లో జరుగుతున్న కిడ్నాప్ లకు ఒక ఉదాహరణ! ఈ పరిస్థితి కేవలం బలూచిస్థాన్ ప్రాంతంలోనే కాదు.. ఆ దేశం మొత్తం ఇలాంటి పరిస్థితే నెలకొంది!
బలూచిస్థాన్, అఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో తరచూ గుర్తు తెలియని మృతదేహాలు లభిస్తుంటాయి. కొన్ని గుర్తుపట్టలేని విధంగా ఉంటే.. మరికొన్ని ముక్కలు ముక్కలుగా దొరుకుతుంటాయి! ఇంత దారుణం జరుగుతుంటే.. అక్కడి ప్రభుత్వం, సైన్యం, పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నాయనే కదా.. మీ సందేహం? ఏం చేస్తాయి.. చూస్తూ కూర్చుంటాయి! ఎందుకంటే.. ఇదంతా చేస్తున్నది వాళ్లే కదా..! అవును.. ఈ కిడ్నాప్ లకు పాల్పడుతున్న పాకిస్థాన్ భద్రతా బలగాలే! ఆశ్చర్యంగా ఉన్నా.. ఇదే వాస్తవం!
ఇది ఎవరో చెబుతున్న మాటకాదు.. అపహరణకు గురైనవారి కుటుంబాలు చెబుతున్నమాట. ఈ దారుణాలు ఇకనైనా ఆపాలంటూ సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నవారి మాట. అక్కడి మానవహక్కుల కార్యకర్తల మాట! స్వేచ్ఛ అనే మాటకు అర్థం తెలియకుండా బతుకుతున్న బలూచిస్థాన్ ప్రాంతంలో.. ఇలాంటి కిడ్నాప్ లు సర్వసాధారణం. అలాంటి వారిలో వందల మందిని చంపేస్తుంటాయి. మరికొందరి ఆచూకీ ఎన్నటికీ తెలియదు. ఇప్పటి వరకూ వందలాది మృతదేహాలు బలూచిస్థాన్ ప్రాంతంలో లభించాయి.
ఈ దారుణాలకు అడ్డుకట్ట పడాలని కొన్ని సంఘాలు ఎంతోకాలంగా ఆందోళన చేస్తున్నాయి. కోర్టులను సైతం ఆశ్రయించాయి. ఈ క్రమంలో 2011లో సుప్రీం కోర్టు ఓ కమిషన్ కూడా వేసింది. కిడ్నాప్ కు గురైన వారిని గుర్తించాలని ఆదేశించింది. ఆ కమిషన్ ఏర్పడిన తర్వాత.. వారు విచారించి నివేదిక సిద్ధం చేశారు. దాని ప్రకారం.. కనిపించకుండా పోయిన వాళ్లలో చాలా మంది చనిపోయారు. కొందరు జైళ్లలో ఉన్నారు. మరికొందరు ఇళ్లకు తిరిగి వచ్చారు. తాము ఇప్పటి వరకూ 5వేల ఫిర్యాదులను పరిష్కరించామని ఆ కమిషన్ చెబుతోంది.
Also Read: దేశం మొత్తం చూడాలంటున్న జగన్ ప్లాన్ ఇదీ
అయితే.. కిడ్నాప్ చేసింది ఎవరని మాత్రం కమిషన్ చెప్పకపోవడం గమనార్హం. కిడ్నాప్ చెర నుంచి బయటపడిన వారు కూడా చెప్పట్లేదు. చెబితే.. ఇప్పటి వరకూ ఎంతోమంది శవాలై తేలినట్టుగా.. వాళ్లు కిడ్నాప్ అయినట్టుగా తమ కుటుంబ సభ్యులను చంపేసి, కిడ్నాప్ చేస్తారు కాబట్టి! ఇక్కడే మనకు ఇంకో సందేహం కూడా రావొచ్చు. ఒక దేశంలో ఇలా భద్రతాబలగాలే నేరాలకు పాల్పడుతుంటే ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ స్పందించవా.. అని! కానీ.. పాకిస్థాన్ చట్టం ప్రకారం భద్రతాదళాలు ఎవరినైనా ఎలాంటి కారణాలు లేకుండా తీసుకెళ్లొచ్చు! అది నేరం కాదు!
ఈ తీరుపై బాధితుల కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ‘మా వాళ్లు నేరం చేస్తే కోర్టులో ప్రవేశపెట్టండి.. వాళ్లు నిజంగా తప్పు చేస్తే నిరూపించి, శిక్ష విధించండి.. అంతేకానీ ఇలా బలవంతంగా తీసుకెళ్లడమేంటీ?’ అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఆటవిక పరిస్థితిని మార్చాలని మానవహక్కుల సంఘాలు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నాయి. ఇప్పటి వరకూ ఎన్నో ప్రభుత్వాలు మారినా.. ఈ పరిస్థితి మాత్రం మారలేదు.
ఈ చట్టాన్ని మార్చాలని కిడ్నాప్ కు గురైన వారి కుటుంబ సభ్యులు ఎంతో కాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ సమస్యపై ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ మాట్లాడుతూ.. త్వరలో పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కానీ.. జవాబుదారీ తనమే లేకుండా తీసుకెళ్లే హక్కు ఉన్నప్పుడు.. చట్టమే ఇందుకు అనుమతిస్తున్నప్పుడు.. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారన్నదే అంతుచిక్కని ప్రశ్న. అయితే.. ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ మేరకు చట్టం చస్తామని హామీ ఇచ్చారు. అది సాధ్యం అవుతుందా? అన్నదే అంతుచిక్కని అసలైన ప్రశ్న.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు