HomeతెలంగాణKCR - Telangana Geyam : అందెశ్రీ పాట కేసీఆర్ కు ఎదురుదెబ్బెనా?

KCR – Telangana Geyam : అందెశ్రీ పాట కేసీఆర్ కు ఎదురుదెబ్బెనా?

KCR – Telangana Geyam : జయ జయహే తెలంగాణ.. జనని జయకేతనం.. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన జనచేతనం.. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరిని ఏకం చేసిన పాట ఇది. జనాలలో తెలంగాణ ఉద్యమకాంక్షను జ్వలింప చేసిన పాట ఇది. అంతటి ఉద్యమ సమయంలో తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ పాటను వినిపించేవారు. ఉద్యమం జరుగుతున్నప్పుడు పలు వేదికలలో కేసీఆర్ ఈ పాటను ఆలపించేవారు. కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు.. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఈ గేయం రాష్ట్ర గేయం అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అలాంటిది జరగలేదు. పైగా రాష్ట్రానికి ఒక గేయం అంటూ ఏదీ లేదని 2021 సంవత్సరం నిండు అసెంబ్లీలో అప్పటి మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అడిగిన ప్రశ్నకు కేసిఆర్ ఒక సమాధానంగా చెప్పారు.

ఎప్పుడైతే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ఒక గేయం అంటూ లేదని చెప్పారో.. అప్పుడే రేవంత్ రెడ్డి స్పందించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి గేయం అంటూ లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ అమరవీరులకు పూర్తిగా న్యాయం చేయలేదని, తెలంగాణ అమరవీరుల లెక్క ప్రభుత్వం వద్ద లేదని, కనీసం తెలంగాణ రాష్ట్రానికి ఒక అధికారిక గేయమంటూ కూడా లేదని ఆయన అప్పట్లో ప్రశ్నించారు. ఇదే విషయాలను ప్రస్తావిస్తూ పలు సందర్భాలలో వివిధ వేదికల వద్ద ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నిలదీశారు.. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన సమాధానం రాలేదు. దీంతో అప్పటి అధికార భారత రాష్ట్ర సమితి డిఫెన్స్ లో పడిపోయింది. ఇదే కాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో అందెశ్రీని పలు సందర్భాల్లో పొగిడిన కేసీఆర్.. ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు పట్టించుకోలేదు. ఒకానొక దశలో తెలంగాణ సాహిత్య అకాడమీకి అందెశ్రీని అధ్యక్షుడిని చేస్తారని వ్యాఖ్యలు వినిపించాయి. కానీ అలాంటివి జరగకపోగా.. 10 సంవత్సరాలుగా కెసిఆర్ ఆయనను పట్టించుకోలేదు. పైగా తనకు భజన చేసే వారికి మాత్రమే పదవులు ఇచ్చారనే అపవాదు కూడా కెసిఆర్ మూట కట్టుకున్నారు. ఇలా 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎన్నికలు రానే వచ్చాయి. ఎన్నికల సమయంలో తెలంగాణకు రాష్ట్ర గేయాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి అందెశ్రీతో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా అందెశ్రీ తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవం ఉద్దేశాన్ని రేవంత్ ముందు ఉంచారు. అంతేకాదు పాలకుడికి ఎటువంటి సోయి ఉండాలి? కళాకారులపై ఎలాంటి గౌరవం ఉండాలి? కళాకారులను గుర్తించకపోతే వచ్చే నష్టమేంటి? వ్యక్తిగత ప్రతిష్టకు పోతే జరిగే పరిణామాలు ఏంటి? ఇలా అన్ని విషయాలపై రేవంత్ రెడ్డితో అందెశ్రీ మాట్లాడారు. అందె శ్రీ మాటలు రేవంత్ రెడ్డిని కదిలించినట్లు ఉన్నాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం విజయం సాధించింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరగానే ఎన్నికల సమయంలో ఇచ్చిన నిర్ణయాన్ని ఆదివారం రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి అమల్లో పెట్టారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి అధికారిక గేయాన్ని అమల్లోకి తెచ్చారు. అందెశ్రీకి ఇచ్చిన మాట నిలుపుకున్నారు. కెసిఆర్ చేసిన తప్పును రేవంత్ గుర్తుచేసి మరీ సరిదిద్దారు.. ఒక రకంగా కేసీఆర్ ను రేవంత్ తెలంగాణ సెంటిమెంటుతో కొట్టారు. సెంటిమెంట్ కాపీరైట్ భారత రాష్ట్ర సమితికి మాత్రమే సొంతం కాదని నిరూపించారు. మరి ఈ పరిణామాలతో భారత రాష్ట్ర సమితి ఎలాంటి కౌంటర్ ఇస్తుందో వేచి చూడాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version