RTC MD Sajjanar: తలకెక్కిన వెర్రి ఇది.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆసక్తికరమైన ట్వీట్

చాలామంది ప్రయాణికులు రవాణా శాఖ నిబంధనలను పాటించరు. మద్యం తాగి వాహనాలు నడుపుతుంటారు. తీవ్రమైన ప్రమాదాలకు కారణమవుతుంటారు. ఇలాంటి వారి వల్ల ఆస్తి నష్టం సంభవిస్తుంది.

Written By: Bhaskar, Updated On : October 2, 2023 2:19 pm
Follow us on

RTC MD Sajjanar: “ప్రయాణం ప్రమోదం కావాలి. ప్రమాదం కాకూడదు. అందుకే మనం రోడ్డుమీద బండి నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించాలి. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. రవాణా శాఖ సూచించిన ధ్రువ పత్రాలను కచ్చితంగా కలిగి ఉండాలి. ఇక కారు నడుపుతున్నప్పుడు సీట్ బెల్ట్ ధరించాలి. రోడ్డు విశాలంగా ఉన్నంత మాత్రాన ఇష్టానుసారంగా దూసుకెల్లకూడదు. ఒకవేళ ఆ నిబంధనను వ్యతిరేకిస్తే ఖచ్చితంగా ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. మద్యం తాగి వాహనాలను నడిపితే జరిగే అనర్ధాలు అన్ని ఇన్ని కావు. మన ప్రాణమే పోవచ్చు. లేకుంటే ఎదుటివారి ప్రాణాలు పోయేందుకు మనమే కారణం కావచ్చు. ఒకవేళ అవి ఏవీ జరగకుంటే గాయాలు కావచ్చు. ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే కచ్చితంగా మనం నిబంధనలు పాటించాలి.” ఇవి రోజు మనం ఎక్కడో ఒకచోట చూస్తూనే ఉంటాం. కానీ మనలో చాలామందికి నిబంధనలు పాటించడం అంటే చాలా చిరాకు.

చాలామంది ప్రయాణికులు రవాణా శాఖ నిబంధనలను పాటించరు. మద్యం తాగి వాహనాలు నడుపుతుంటారు. తీవ్రమైన ప్రమాదాలకు కారణమవుతుంటారు. ఇలాంటి వారి వల్ల ఆస్తి నష్టం సంభవిస్తుంది. ప్రాణ నష్టం కలుగుతుంది. కొందరైతే వాహనాల మీద రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. బైకును గాల్లో లేపుతుంటారు. బైక్ మీదకెక్కి దాన్ని 360 డిగ్రీల్లో వంచుతారు. అలా చేస్తుంటే వారికి ఉత్సాహం వస్తుందేమో కానీ.. వారి వెనుక ప్రయాణించే వారికి వెన్నులో వణుకు పుడుతుంది. ఇలాంటి చర్యలను నియంత్రించేందుకు పోలీస్ శాఖ ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కొంతమంది వాహనదారులు మారడం లేదు. పైగా వారి వికృతి వల్ల ఎదుటివారిని ఇబ్బంది పెడుతున్నారు.

ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి వినూత్నమైన వీడియోలు పెడుతుంటారు. వాహనాలు ఎలా నడపాలో, ఎలా నడపకూడదు సోదాహరణగా వివరిస్తుంటారు. ఇటువంటి నీతి బోధను ఆయన అవకాశం ఉన్నప్పుడల్లా సామాజిక మాధ్యమాల ద్వారా చేస్తుంటారు. అప్పుడప్పుడు ప్రముఖమైన వ్యక్తులతో రోడ్డు భద్రతా నియమాల గురించి వాహనదారులకు చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. అయితే సజ్జనార్ తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో ఒకతను తన బండి మీదకి ఎక్కి నిల్చున్నాడు. బండి వేగంగా వెళ్తోంది. ఆ బండి మీద నిలబడి అతడు కేరింతలు కొడుతున్నాడు. అయితే హఠాత్తుగా ఆ బండి అదుపు తప్పడంతో అతడు కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డాడు. ఆ బండి రోడ్డు పక్కన నిలుచున్న వారి మీదకి దూసుకెళ్లింది. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఈ వీడియోను ఉటంకిస్తూ సజ్జనార్ “తలకెక్కిన వెర్రి ఇది” అంటూ కామెంట్ చేశారు. రోడ్ సేఫ్టీ అనే యాష్ టాగ్ ను దానికి జోడించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు నేటి యువతరం ద్విచక్ర వాహనాలలో ఎంత ఇష్టానుసారంగా నడుపుతున్నారో చెప్పకనే చెప్పింది.