Nizam Police Station: 1948 వరకు దేశవ్యాప్తంగా బ్రిటిష్ పాలన ఉంటే తెలంగాణలో మాత్రం ప్రత్యేకంగా నైజాంల పాలన ఉండేది. తెలంగాణలో నైజాముల నిరంకుశల పాలనతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారన్న విషయం చరిత్ర తెలుపుతుంది. అయితే అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన వారిని పోలీసులు బంధించేవారు. వారిని దారుణంగా చిత్రహింసలు పెట్టేవారు. ఇందులో భాగంగా ఈ రాజ్యంలో ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి అందులో చిత్రవధలు చేసేవారు. వీటిలో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ పోలీస్ స్టేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీని వివరాల్లోకి వెళ్తే..
రాయికల్ గ్రామంలో వెళ్ళగానే ఓ పాడు పడ్డ భవనం కనిపిస్తుంది. దీనిని గ్రామస్తులు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలకు ఉపయోగించుకుంటున్నారు. అలాగే ఇక్కడ కొందరు ఉల్లాసంగా గడుపుతారు. అయితే ఇది ఇప్పుడు చూడడానికి బాగున్నా ఒకప్పుడు ప్రజలను హింసించే ప్రదేశంగా ఎంచుకున్నారు. నైజాములో తమకు వ్యతిరేకంగా ఉండే వారిని ఇందులో బంధించి ఉంచేవారు. ఇందులో ఒకసారి బంధిస్తే కొన్ని రోజులపాటు తీవ్రంగా చిత్రహింసలు చేసేవారు. మరోసారి వారికి ఎదురు తిరగకుండా ఉండేందుకు దారుణంగా కొట్టేవారు. వారు చేసే బాధలు తట్టుకోలేక కొందరు మరణించారు కూడా.
ఈ భవనంలో కొన్ని బంధించే గదులు ఉన్నాయి. అలాగే ఇక్కడ వంట చేసిన ఆనవాళ్లు కూడా కనిపిస్తాయి. ఆ కాలంలో బట్టీలో వంట చేశారని కొన్ని ప్రదేశాలను చూస్తే తెలుస్తుంది. అప్పట్లో ఏర్పాటు చేసిన బట్టి ఇప్పటికీ కూడా కనిపించడం విశేషం. అప్పట్లో ఇందులో ఓ పోరాట యోధుడిని చిత్రహింసలు పెట్టే భాగంలో చేతిని నరికి కెమికల్ లో ఉంచారు. దానిని ప్రభుత్వం ఆధీనం చేసుకుంది. ఇందులో పని చేసే పోలీసులు ఎడ్ల బండి పై నే ప్రయాణించేవారు. తెలంగాణలోని ఉన్న ప్రత్యేక పోలీస్ స్టేషన్లో రాయికల్ పోలీస్ స్టేషన్ ఒకటిగా పేరు తెచ్చుకుంది.
ఈ ఠాణా పేరు చెబితే భయపడని వారు ఉండరని ఇప్పటి గ్రామస్తులు కొందరు అంటున్నారు. అప్పట్లో ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి దారులు ఏర్పాటు చేశారు. కానీ ఇవి ప్రస్తుతం కనిపించకుండా పోయాయి. ఇక ఈ ఠాణా లో ఎవరినైనా బంధించి చిత్రహింసలు పెట్టినప్పుడు వారు పెట్టే కేకలు కొన్ని ప్రాంతాల వరకు వినిపించాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఇలా ప్రత్యేకంగా నిలిచిన ఈ పోలీస్ స్టేషన్ నిర్మాణం ప్రస్తుతం చెక్కుచెదరకుండా అలాగే ఉంది
నిజాం రాజ్యంలో ప్రజలు చిత్రహింసలు కు గురయ్యారు.. కానీ వీరి హయాంలో ఎన్నో కట్టడాలను నిర్మించారు. ముఖ్యంగా వారికి వ్యతిరేకంగా ఉన్నవారిని బంధించేందుకు అనేక రకాల పోలీస్ స్టేషన్లను నిర్మించుకున్నారు. తెలంగాణలోని పలుచోట్ల ఇప్పటికీ నిజాం రాజులు నిర్మించిన పోలీస్ స్టేషన్లోనే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం ప్రాంతాలు మారడంతో కొన్ని గ్రామాల్లోని పోలీస్ స్టేషన్లు మరుగున పడిపోయాయి. ఇందులో భాగంగా రాయికల్ పోలీస్ స్టేషన్ కూడా అలాగే చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. కానీ దీని గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నాను.