https://oktelugu.com/

Rahmanullah Gurbaz: అన్ని మ్యాచ్లలో ఇరగదీసి.. సెమీఫైనల్ లో సున్నా చుట్టి వచ్చావేంటి బ్రో?

ఒకవేళ గుర్బాజ్ కనుక కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే.. మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది. అతడు వెంటనే అవుట్ కావడంతో.. మిగతా బ్యాటర్లలో ఆత్మస్థైర్యం తగ్గిపోయింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 27, 2024 / 01:15 PM IST

    Rahmanullah Gurbaz

    Follow us on

    Rahmanullah Gurbaz: “తరగతి గదిలో పాఠం చెబుతున్నప్పుడు.. క్లాస్ టీచర్ అడిగే ప్రశ్నకు ఎవడైనా సమాధానం చెబుతాడు. అదే పరీక్షలో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసిన వాడే టాపర్ అవుతాడు.” దీనిని క్రికెట్ భాషకు అన్వయించుకుంటే..లీగ్, సూపర్ -8 మ్యాచ్లలో ఎవరైనా ఆడతారు.. కీలకమైన సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లో గట్టిగా ఆడితేనే విజేతలుగా నిలుస్తారు.. కానీ ఈ ఆఫ్గనిస్తాన్ క్రికెటర్ కు లీగ్ , సూపర్ -8 దశల్లో రేకెత్తిన ఉత్సాహం, పొంగుకొచ్చిన ఆనందం సెమీఫైనల్ లో నీరుగారిపోయింది.. ఆకాశమే హద్దుగా చెలరేగాల్సిన స్థితిలో.. సున్నా చుట్టి రావడంతో.. ఆ జట్టు ఓడిపోయింది.. ఇంతకీ ఆటగాడు ఎవరంటే..

    గుర్బాజ్.. టి20 వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.. ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ గా గర్బాజ్ టి20 వరల్డ్ కప్ లో అద్భుతాలు చేశాడు.. ఉగాండతో జరిగిన మ్యాచ్లో 76, న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్లో 80, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 60, బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 43 పరుగులు చేసి.. లీడింగ్ రన్నర్ గా కొనసాగుతున్నాడు. సూపర్ ఫామ్ లో ఉన్న ఈ ఆటగాడు.. సెమీ ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా బౌలర్లకు దాసోహం అయ్యాడు. కనీసం ఒక పరుగు కూడా చేయకుండా.. సున్నా చుట్టి వచ్చి పరువు తీసుకున్నాడు. వాస్తవానికి గుర్బాజ్ అద్భుతంగా ఆడతాడని ఆఫ్ఘనిస్తాన్ జట్టు యాజమాన్యం భావించింది. పైగా అతడు సూపర్ ఫామ్ లో ఉండడంతో భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ వారందరి అంచనాలను గుర్బాజ్ తలకిందులు చేశాడు.. గోల్డెన్ డక్ గా అవుట్ అయ్యి ఆఫ్ఘనిస్తాన్ జట్టును గంగలో ముంచాడు.

    ఒకవేళ గుర్బాజ్ కనుక కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే.. మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది. అతడు వెంటనే అవుట్ కావడంతో.. మిగతా బ్యాటర్లలో ఆత్మస్థైర్యం తగ్గిపోయింది.. పైగా మైదానంపై తేమ ఉండడంతో దక్షిణాఫ్రికా బౌలర్లు రెచ్చిపోయారు. వారిని కాచుకోవడంలో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు తేలిపోయారు.. గుర్బాజ్ సెమి ఫైనల్ మ్యాచ్లో 0 పరుగులకే అవుట్ కావడంతో.. సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి..”అన్ని మ్యాచ్లలో ఇరగదీశావు.. కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో సున్నా చుట్టి వచ్చావేంటి బ్రో” అంటూ గుర్బాజ్ ను ఉద్దేశించి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.