Telangana hydra: వదల బొమ్మాళీ.. రాజకీయ పార్టీ నాయకులు.. అధికారులు.. సీఎం తమ్ముడిని.. ఎవరినీ ‘హైడ్రా’ వదలడం లేదే?

 తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నప్పటికీ లెక్కపెట్టడం లేదు. మరింత ముందుకు వెళుతోంది. ఇప్పటికే రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల భవనాలను పడగొట్టిన హైడ్రా.. తాజాగా అధికారుల దాకా వెళ్ళింది. నిబంధనలకు నీళ్లు వదిలి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవడానికి హైడ్రా వెనకాడటం లేదు.

Written By: Anabothula Bhaskar, Updated On : August 29, 2024 2:32 pm

Telangana hydra

Follow us on

Telangana hydra: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా) తెలంగాణలో రోజురోజుకు సంచలనాన్ని సృష్టిస్తోంది. కూల్చివేతలు చేపడుతున్న ప్రాంతాలలో నాడు విధులు నిర్వహించిన అధికారుల వివరాలను సేకరించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు హైదరాబాదులోని 18 ప్రాంతాల్లో వివిధ భవనాలను కలిపి దాదాపు 200కు పైగా నిర్మాణాలను హైడ్రా పడగొట్టింది. 50 ఎకరాల వరకు ప్రభుత్వ చెరువులు, ఇతర భూములను స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందించింది.. నాడు ఆక్రమణదారులకు ఎర్ర తివాచీ పరిచిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ, రెవెన్యూ అధికారుల వివరాలను కూడా సేకరించాలని హైడ్రా భావిస్తోంది. వీరిపై తీసుకోవాల్సిన న్యాయ చర్యలపై నిపుణులతో హైడ్రా సిబ్బంది చర్చిస్తున్నారు. డిటిసిపి అధికారులను కూడా హైడ్రా సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్టు తెలుస్తోంది. న్యాయపరంగా ఏవైనా చిక్కులు ఎదురవుతాయా అనే విషయాలపై కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.

అధికారుల ఇష్టారాజ్యం

హైదరాబాద్ నగరంలో పలువురు చెరువులను దర్జాగా ఆక్రమించుకున్నారు. భారీగా భవనాలు నిర్మించారు. కొందరైతే స్థలాలను ప్లాట్లుగా విభజించి విక్రయించారు. అయితే వీరందరిపై హైడ్రా అధికారులు కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. వాస్తవానికి ఈ పని కనుక నాటి అధికారులు చేసి ఉంటే హైదరాబాదులో పరిస్థితి ఇంత అద్వానంగా మారి ఉండేది కాదు. అక్రమ నిర్మాణాలపై ఒక కన్నేసి ఉంచితే ఇంత విధ్వంసం జరిగి ఉండేది కాదు. వాస్తవానికి చాలా చోట్ల ముందుగానే ఇంటి నెంబర్లు కేటాయించి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది భారీగా దండుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే నిర్మాణపరమైన అనుమతులు జారీ చేశారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిబంధనల మేరకు నిర్మాణాలు చేపట్టినా.. పెద్దలకు, ఇతర అధికారులకు డబ్బులు చెల్లించాల్సిందే. అంతస్తుకో రేటు ప్రకారం అధికారులు డబ్బులు వసూలు చేయడంతో అక్రమాలు దర్జాగా సాగిపోయాయి. “.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పెద్దపెద్ద అవినీతి తిమింగలాలు ఉన్నాయి. వారికి రాజకీయ పలుకుబడి దండిగా ఉంది. అలాంటి వారు ఏం చేసినా చెల్లుబాటు అయింది. అలాంటప్పుడు ఎలాంటి ప్రక్షాళన చేసిన పెద్దగా ఉపయోగ ఉంటుందని నేను అనుకోనని” పేరు రాసేందుకు ఇష్టపడని ఓ టౌన్ ప్లానింగ్ అధికారి పేర్కొన్నారు. అంటే దీనిని బట్టి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆక్రమణలు ఎలా సాగిపోయాయో అర్థం చేసుకోవచ్చు.