Hydra: ఏకంగా బాంబులను పెట్టి లేపేస్తున్నారంటే..మీది మామూలు దూకుడు కాదు స్వామీ

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో హైడ్రా ఆక్రమణలను నిర్ధాక్షిణ్యంగా నేలమట్టం చేస్తోంది. అక్రమ నిర్మాణాలపై రేవంత్‌రెడ్డి సర్కార్‌ ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా సంగారెడ్డి జిల్లాలో చెరువులో కట్టిన భవనాన్ని బాంబులు పెట్టి కూల్చేశారు.

Written By: Raj Shekar, Updated On : September 26, 2024 5:14 pm

Hydra

Follow us on

Hydra: హైదరాబాద్‌లో హైడ్రా అక్రమ నిర్మాణదారుల గుండెళ్లో బుల్డోజర్లు పరిగెత్తిస్తోంది. ఎఫ్‌టీఎల్, బఫర్‌ పరిధిలో నిర్మించిన కట్టడాలను నిర్దాక్షిణ్యంగా నేల మట్టం చేస్తోంది. ఇప్పటికే హైడ్రా 100 ఎకరాల్లో నిర్మించిన వందలాది కట్టడాలనే కూల్చివేసింది. హైడ్రా దూకుడు ఇంకా కొనసాగుతోంది. హైడ్రా బుల్డోజర్లు ఎప్పుడు ఎక్కడికి వస్తాయో తెలియని పరిస్థితి. దీంతో ఆక్రమణదారుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు హైడ్రా చర్యలను రాష్ట్ర వ్యాప్తంగా స్వాగతిస్తున్నారు. అన్ని జిల్లాల్లో హైడ్రా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. జిల్లాలకు హైడ్రా రాక ముందే.. కొన్ని అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. వారం క్రితం మంచిర్యాల జిల్లాలో రెవెన్యూ స్థలంలో కార్మిక సంఘం నేత నిర్మించిన రూ.10 కోట్ల విలువైన భవనాన్ని నేలమట్టం చేశారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో చెరువులో నిర్మించిన భారీ భవనాన్ని అధికారులు ఏకంగా బాంబులు పెట్టి నేలమట్టం చేశారు.

మల్కాపూర్‌లో అక్రమ నిర్మాణం..
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌ పంచాయతీ పరిధిలోని కుతుబ్‌శాయిపేట చెరువులో భారీ భవనం నిర్మించారు. దీనిపై గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు నిర్మాణం అక్రమమని నిర్ధారించారు. వెంటనే కూల్చివేతకు చర్యలు చేపట్టారు. నిర్మాణం పూర్తిగా చెరువులో ఉండడంతో పిల్లర్లకు బాంబులు అమర్చి కూల్చివేశారు. ఈ క్రమంలో ఇద్దరు గాయపడ్డారు.

12 ఏళ్ల క్రితం నిర్మాణం..
ఇదిలా ఉంటే.. సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి మల్కాపూర్‌ పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో 12 ఏళ్ల క్రితమే ఈ భవనం నిర్మించాడు. నీటిలో అడుగు పెట్టకుండా భవనంలోకి చేరుకునేలా కొంతదూరం మెట్లు కూడా కట్టాడు. ఈ బహుళ అంతస్తుల భవనం యజమాని, కుటుంబ సభ్యులు వీకెండ్‌లో ఇక్కడికి వచ్చి సేదతీరేవారు. గ్రామస్తుల ఫిర్యాదు తర్వాత అధికారులు విచారణ చేసి అక్రమ నిర్మాణం అని గుర్తించారు. యజమానికి నోటీసులు ఇవ్వడమే కాకుండా కూల్చివేతకు గడువు ఇచ్చారు. అయినా యజమాని స్పందించకపోవడంతో గురువారం(సెప్టెంబర్‌ 26న) బాంబులతో కూల్చివేశారు. శిథిలాలు ఎగిరిపడి గాయపడిన ఇద్దరి ఆస్పత్రికి తరలించారు.

గత కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుమతి..
ఇదిలా ఉంటే భవన కూల్చివేతపై యజమాని నరసింహులు స్పందించారు. భవన నిర్మాణానికి 12 ఏళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని తెలిపాడు. తాము పట్టా కింద అనుమతులు తీసుకుని 250 గజాల్లో భవనం నిర్మించామని పేర్కొన్నాడు. అక్రమంగా తమ భవనం కూల్చారని ఆవేదన వ్యక్తం చేశాడు. భవనం నిర్మిస్తున్న సమయంలో ఎవరూ అడ్డుకోలేదని, ఇప్పుడు కూల్చడం ఏంటని ప్రశ్నించాడు.