https://oktelugu.com/

Hydra Effect : రియల్ ఎస్టేట్ ఢమాల్.. రేవంత్ సర్కార్ ఎలా ముందుకెళుతుంది?

ప్రస్తుతం హైదరాబాద్ నగర ప్రజల్ని హైడ్రా నిద్రపోనివ్వడం లేదు. అక్రమార్కులు చేసిన పనికి చాలా మంది పేదలు బలవుతున్నారు. కొనే ముందు అన్నివిధాలా చూసుకోకపోవడంతో ఇప్పుడు కోట్లాది రూపాయల ఆస్తులను నష్టపోతున్నారు. రియల్ వ్యాపారులను నమ్మి కొని మోసపోయి ఇప్పుడు లబోదిబోమంటున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : September 24, 2024 / 01:31 PM IST

    Hydra Effect

    Follow us on

    Hydra Effect : ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులు ఒకటి రియల్ ఎస్టేట్ రంగం.. ఇంకొకటి మద్యం వ్యాపారం. అందుకే.. ఆ రెండింటిని ప్రోత్సహించి ఏ ప్రభుత్వం అయినా ఆదాయం పెంచుకోవాలని చూస్తుంటుంది. అయితే.. ‘గతమెంతో ఘనం.. ఇప్పుడంతా శూన్యం’ అన్నట్లుగా తయారైంది హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి. గత కొద్ది రోజులుగా ఇక్కడి అమ్మకాలు, కొనుగోళ్లు చూస్తుంటే ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా ఢమాల్ అని పడిపోయింది.

    ప్రస్తుతం హైదరాబాద్ నగర ప్రజల్ని హైడ్రా నిద్రపోనివ్వడం లేదు. అక్రమార్కులు చేసిన పనికి చాలా మంది పేదలు బలవుతున్నారు. కొనే ముందు అన్నివిధాలా చూసుకోకపోవడంతో ఇప్పుడు కోట్లాది రూపాయల ఆస్తులను నష్టపోతున్నారు. రియల్ వ్యాపారులను నమ్మి కొని మోసపోయి ఇప్పుడు లబోదిబోమంటున్నారు. దాంతో ఇప్పుడు హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయింది. ఆస్తులు కొనాలంటే ప్రతిఒక్కరూ భయపడిపోతున్నారు. దాంతో నిర్మాణ రంగం పూర్తిగా మందగమనంలోకి పడిపోయింది. చాలా వరకు సర్వేలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నారు. అక్రమ లే అవుట్లతో ప్రజలు ఆగం కాగా.. ఇప్పుడు కొనేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తే ఎప్పుడు ఎలాంటి నోటీసులు అందుకోవాల్సి వస్తుందోనని ఆందోళనలతో ఉన్నారు.

    ఫలితంగా హైదరాబాద్ పరిధిలో జూన్ – సెప్టెంబర్ త్రైమాసికంలో అమ్మకాలను పరిశీలిస్తే ఈ అంశాలన్నీ ఇట్టే అర్థం అవుతున్నాయి. మహానగరంలో ఏకంగా 42 శాతం అమ్మకాలు పడిపోయాయి. దాంతో రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు గగ్గోలు పెడుతోంది. దీనికి ప్రధాన కారణం హైడ్రా అని అందరికీ తెలిసిందే. అవును హైడ్రా.. గత కొన్ని రోజులుగా అక్రమ కట్టాలను కూల్చివేస్తోంది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఉన్న కట్టడాలను గుర్తించి వాటి భరతం పడుతోంది. పేద, ధనికుల ఇళ్లు అని చూడకుండా.. లోన్లు, ఈఎంఐలు అని చూడకుండా అన్నింటినీ నేలమట్టం చేస్తోంది.

    అయితే.. రాష్ట్రంలో హైదరాబాద్‌లోనే రియల్ వ్యాపారంతో ఆదాయం ఎక్కువ. రిజిస్ట్రేషన్లు ఎన్ని జరిగితే ప్రభుత్వానికి అంతలా ఆదాయం పెరుగుతుంది. కానీ.. హైడ్రా ఎఫెక్ట్‌తో రిజిస్ట్రేషన్లు చాలా వరకు తగ్గిపోయాయి. దాంతో ప్రభుత్వ ఆదాయం కూడా కాస్త మందగించినట్లుగానే తెలుస్తోంది. నిజానికి ఏటా దసరా, దీపావళి వేళ హైదరాబాద్‌లో ఇళ్లు సేల్స్ ఎక్కువగా కనిపిస్తాయి. చాలా మంది ఇళ్లు కొనాలనుకునే వారు ఈ రెండు పండుగలను బేస్ చేసుకొని కొంటుంటారు. కానీ.. ప్రస్తుత పరిస్థితులు అలా కనిపించడం లేదు. కొత్త ఇల్లు కొనేందుకు ఎవరూ సాహసించడం లేదు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే కరోనా సమయంలోని పరిస్థితులనే చూడాల్సి వస్తుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    మరోవైపు.. రేవంత్ రెడ్డి సర్కార్ ముందు కూడా ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి. ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాల్సి ఉంది. అటు.. గత ప్రభుత్వం చేసిన అప్పులనూ మోయాల్సి ఉంది. కానీ.. ఈ సమయంలో ఆయన హైడ్రాను తీసుకురావడం కూడా సంచలనంగా మారింది. హైదరాబాద్ నగరంలో 42 శాతానికి ఇళ్ల అమ్మకాలు పడిపోయాయంటే ముందుముందు మరిన్ని భయంకర పరిస్థితులు తప్పవేమో అన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. వీటన్నింటిని కాదని రేవంత్ సర్కార్ కూడా ఎలా ముందుకు వెళ్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.