HYDRA Commissioner Ranganath : హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంగరక్షకుడు సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇది కాస్త తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. అతడు సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే దగ్గర్లో ఉన్న కామినేని ఆసుపత్రికి తరలించారు. బుల్లెట్లు అతడి శరీరం నుంచి దూసుకుపోవడంతో అంతర్గత గాయాలయ్యాయి. రక్త స్రావం కూడా జరిగింది. అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో ఆస్పత్రి వైద్యులు శస్త్ర చికిత్సలు జరుపుతున్నారు.
ఈ ఘటన తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్, కృష్ణ చైతన్య కుటుంబ సభ్యులు ప్రకటనలు చేశారు. అయితే ఇవి భిన్నంగా ఉన్నాయి. దీంతో ఈ ఘటన వెనుక ఏదో జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణ చైతన్య కుటుంబ సభ్యులను హైడ్రా రంగనాథ్ ఆసుపత్రిలో పరామర్శించారు.. కృష్ణ చైతన్య ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని రంగనాథ్ వెల్లడించారు. బెట్టింగ్ యాప్స్ కు అలవాటు పడ్డారని.. అందులో భారీగా డబ్బు పోగొట్టుకున్నారని.. ఆర్థిక ఒత్తిడి తట్టుకోలేక కొన్ని రోజుల క్రితం ఆయన ఇంటి నుంచి కూడా వెళ్లిపోయారని.. ఈ విషయాన్ని వేరే కోణంలో చూడకూడదని మీడియాకు రంగనాథ్ విజ్ఞప్తి చేశారు.
కృష్ణ చైతన్య తండ్రి మరో విధంగా మాట్లాడారు. తన కుమారుడికి ఎటువంటి బెట్టింగ్ యాప్స్ , గేమింగ్ యాప్స్ ఆడే అలవాటు లేదని.. ఆర్థిక సమస్యలు కూడా పెద్దగా లేవని.. విధుల్లో చేరడానికి అతడు తుపాకీ తెచ్చుకున్నాడని.. కానీ ఇలా చేస్తాడని అనుకోలేదని కృష్ణ చైతన్య తండ్రి చెప్పాడు. ఈ వ్యవహారంలో ఏం జరిగిందో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలని అతడు విజ్ఞప్తి చేశాడు. హైడ్రాలో పనిచేస్తున్నందున ఒత్తిడి ఉందని.. అందువల్లే అతడు ఈ దారుణానికి పాల్పడ్డాడని గులాబీ అనుకూల మీడియా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. అయితే దీనిని కృష్ణ చైతన్య తండ్రి ఖండించాడు. తన కుమారుడి మీద ఎటువంటి పని ఒత్తిడి లేదని.. అతడికి విధి నిర్వహణలో హైడ్రాధికారులు సహకరిస్తున్నమని చెప్పాడు.. రంగనాథ్ అంగరక్షకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నేపథ్యంలో.. మీడియా రకరకాల వార్తలను ప్రసారం చేసింది. దీంతో రంగనాథ్ కాస్త కంగారు పడినట్టు తెలుస్తోంది. అందువల్లే ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా.. మీడియా ముందు నేరుగా మాట్లాడారు. అందువల్లే కృష్ణ చైతన్య తండ్రి మాట్లాడిన మాటలు, రంగనాథ్ మాట్లాడిన మాటలు వేరువేరుగా ఉన్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కృష్ణ చైతన్య వ్యవహారంపై గులాబీ అనుకూల మీడియా ఒక విధంగా.. మిగతా మీడియా సంస్థలు మరొక విధంగా వార్తలను ప్రసారం చేశాయి.