Homeటాప్ స్టోరీస్Hyderabad Water Crisis: వేసవికి ముందే హైదరాబాదులో "పానీ" పాట్లు.. నీళ్లు లేవా.. అసలు సమస్య...

Hyderabad Water Crisis: వేసవికి ముందే హైదరాబాదులో “పానీ” పాట్లు.. నీళ్లు లేవా.. అసలు సమస్య ఏంటి?

Hyderabad Water Crisis: సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో లాతూరు ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చింది. చివరికి తాగడానికి కూడా నీళ్లు లేవు. ఆ సమయంలో ప్రత్యేకమైన రైళ్లలో నీళ్లను పంపించారు. అక్కడి ప్రజలకు మిల్ట్రీ పర్యవేక్షణలో నీటిని సరఫరా చేశారు. వాస్తవానికి పీల్చే గాలి తర్వాత.. మనిషికి అత్యంత ముఖ్యమైనది నీరు. అటువంటి జలాన్ని మిలిటరీ పర్యవేక్షణలో సరఫరా చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడో లాతూరు ప్రాంతంలో జరిగిన […]

Hyderabad Water Crisis: సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో లాతూరు ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చింది. చివరికి తాగడానికి కూడా నీళ్లు లేవు. ఆ సమయంలో ప్రత్యేకమైన రైళ్లలో నీళ్లను పంపించారు. అక్కడి ప్రజలకు మిల్ట్రీ పర్యవేక్షణలో నీటిని సరఫరా చేశారు. వాస్తవానికి పీల్చే గాలి తర్వాత.. మనిషికి అత్యంత ముఖ్యమైనది నీరు. అటువంటి జలాన్ని మిలిటరీ పర్యవేక్షణలో సరఫరా చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఎక్కడో లాతూరు ప్రాంతంలో జరిగిన ఘటన గురించి మనం భయం భయంగా చెప్పుకున్నాం. మీడియాలో కూడా ఆ వార్త గురించి ఒక హెచ్చరికగానే చెప్పారు. మరి అటువంటి పరిస్థితి మనదాకా వస్తే.. మన రాజధానిలో అటువంటి భయానక అనుభవం ఎదురైతే.. ఎలా ఉంటుంది.. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో దాదాపు పరిస్థితి అలానే ఉంది. వినడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ.. చెబుతుంటే భయంగా అనిపిస్తున్నప్పటికీ ఇది నిష్ఠూరమైన సత్యం.

ఇటీవల సీఎం రేవంత్ అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత జలమండలి సిబ్బందికి కీలకమైన సూచనలు చేశారు. ఒక రకంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. వాటర్ ట్యాంకర్ల ద్వారా కమర్షియల్ వ్యాపారం చేయకూడదు. ఒక్క నీటి బొట్టును కూడా వృధా చేయకూడదు. మూతలు పకడ్బందీగా ఉండాలి. నీటిని రవాణా చేస్తున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. అంతేకాదు, ట్యాంకర్ల కేటాయింపులో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.

ఇవన్నీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి అధికారులు తీసుకున్న నిర్ణయాలు అనుకుందాం. ఇవి మంచివే.. ఎందుకంటే నీటిని ఎంతగా కాపాడుకుంటే మన భవిష్యత్తు అంత గొప్పగా ఉంటుంది. ఈ ఏడాది అంటే అనుకూలమైన వర్షాలు లేవు కాబట్టి నీళ్లకు కరువు ఉంది అనుకుందాం. కానీ కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో నిండు వానా కాలంలో కూడా ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిపోతుంది. అసలు దీనికి కారణం ఏంటి.. హైదరాబాద్ నగరంలో నీళ్లు లేవా.. అసలు సమస్య ఏంటి.. నగరాన్ని వెంటాడుతున్న వాటర్ క్రైసిస్ వెనుక అసలు కారణాలేంటి..

ఒకప్పుడు హైదరాబాదులో బోర్ వేస్తే నీళ్లు పడతాయి అనే నమ్మకం ఉండేది. ఇప్పుడు వందల అడుగుల లోతు తవ్వినా నీరు వస్తుందో రాదో తెలియని పరిస్థితి. అపార్ట్మెంట్లలో ట్యాంకర్లు కనిపించడం.. నీటి కోసం ముందుగానే బుకింగ్ లు చేసుకోవడం.. కొన్ని ప్రాంతాలలో బోర్లు ఎండిపోవడం.. ఇవన్నీ నగరంలో నీటి భద్రతపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అసలు హైదరాబాద్ కు నీటి కొరత ఎందుకు ఏర్పడుతోంది.. వర్షాలు తక్కువగా కురవడమా.. నగర అభివృద్ధి పేరుతో జరుగుతున్న మార్పులు కూడా ఈ పరిస్థితికి కారణమవుతున్నాయా..

హైదరాబాద్ నగరంలో నీటి సమస్యపై వెలువడిన తాజా నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్ నగరానికి రోజుకు సుమారు 735 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం. సరఫరా మాత్రం 585 మిలియన్ గ్యాలన్ల స్థాయిలో ఉంది. అంటే రోజుకు దాదాపు 150 మిలియన్ గ్యాలన్ల నీటి కొరత ఉంది. ఇది నగరానికి నీటి సరఫరా.. వినియోగం మధ్య ఉన్న అంతరాన్ని సూచిస్తుంది.

మరోవైపు నగరం విస్తీర్ణం పెరుగుతోంది. జనాభా పెరుగుతున్న కొద్దీ నీటి అవసరాలు కూడా పెరుగుతాయి. అయితే ఇదే వేగంతో నీటి వనరులు.. నిల్వ సామర్థ్యం.. పంపిణీ వ్యవస్థలు అభివృద్ధి చెందడం లేదు.

హైదరాబాద్ నగరంలో నీటి సమస్యకు మరో ప్రధాన కారణం లోటు వర్షపాతం.. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 27% లోటు వర్షపాతం నమోదయింది. సాధారణంగా వర్షం కురిసినప్పుడు నీటిలో కొంత భాగం చెరువులు లేదా కుంటలకు చేరుతుంది. మరికొంత భూమిలోకి ఇంకి భూగర్భ జలాలను పెంచుతుంది. కానీ నగరంలో కాంక్రీట్ రోడ్లు.. భవనాలు.. పార్కింగ్ స్థలాల పెరగడంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోవడం తగ్గిపోతుంది. దీనికి తోడు బోర్ల ద్వారా నిరంతరం నీటిని తోడుతున్న నేపథ్యంలో భూగర్భ జిల్లాల మీద మరింత ఒత్తిడి పెరుగుతోంది. హైదరాబాద్ కోర్ అర్బన్ ప్రాంతంలో భూగర్భ జలాల మట్టం గత ఏడాది సెప్టెంబర్ నెలతో పోలిస్తే 6.85 మీటర్లు తగ్గినట్టు తెలుస్తోంది.

గచ్చిబౌలి.. మాదాపూర్.. కొండాపూర్ 20 ఐటి కారిడార్ ప్రాంతాలలో భారీ అపార్ట్మెంట్లు.. గేటెడ్ కమ్యూనిటీలు పెరిగిపోయాయి. వీటిలో వేలాది కుటుంబాలు నివాసం సాగిస్తున్నాయి. జనాభా పెరుగుదలకు అనుగుణంగా నీటి అవసరాలు కూడా ఇక్కడ పెరిగిపోయాయి. ఇక హైదరాబాద్ నగరంలో నీటి ట్యాంకర్ ల బుకింగ్లు రోజుకు సుమారు 5000 నుంచి 8 వేల వరకు ఉంటున్నాయి. సాధారణంగా వర్షాకాలం ముగిసే సమయంలో ఇంతటి డిమాండ్ కనిపించకపోవడం విశేషం. గత ఏడాది అక్టోబర్ నెలతో పోల్చితే ఈ నెలలో ట్యాంకర్ బుకింగ్లు విపరీతంగా పెరిగిపోయాయి.

హైదరాబాద్ నగరానికి నీటిని అందించే ప్రధాన వనరులలో కృష్ణ, గోదావరి నది జలాల ప్రాజెక్టులతో పాటు సింగూరు, మంజీరా, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఉన్నాయి. అయితే వీటిలో నీటి నిలువ అంతగా లేదు. ఇందులో ఉన్న నీటిని శుద్ధి చేసి.. సరైన స్థాయిలో.. అవసరమైన ప్రాంతాలకు సమయానికి అందించడం అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. పైపులైన్ సామర్థ్యం.. పంపింగ్ వ్యవస్థ.. పంపిణీలో అసమానతలు.. అన్ని అత్యంత కీలకంగా ఉండాలి.

హైదరాబాద్ నగరానికి ఇప్పుడు కావాల్సింది నీటి కొరత వచ్చినప్పుడు స్పందించిన విధానం మాత్రమే కాదు. కొరత అనేది రాకుండా ముందుగానే సిద్ధమయ్యే సమగ్ర వాటర్ సెక్యూరిటీ ప్లాన్. నగరం భవిష్యత్తు అభివృద్ధి ఎంత ముఖ్యమో.. ఆ నగరంలో నివసించే ప్రతి ఒక్కరికి సురక్షితమైన తాగునీరు అందించడం కూడా అంతే ముఖ్యం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper