Ganesh Immirasion : దేశవ్యాప్తంగా వినాయకుడి నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వినాయకుడికి విశేష పూజలు చేస్తూ కొలుస్తున్నారు. ఇటు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనూ వేలాది సంఖ్యలో వినాయకులు కొలువుదీరారు. ఇక.. వినాయక నిమజ్జనానికి హైదరాబాద్ మహానగరం సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో నిమజ్జనం కోసం అధికారుల ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ట్యాంక్ బండ్‌లో నిమజ్జనంపై హైకోర్టు క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో నిఘా పెంచారు.
నిమజ్జనంలో ఎలాంటి అపశ్రుతులు జరగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం గణపయ్య నిమజ్జనం వేళ ట్రాఫిక్ మళ్లింపుపై కీలక ప్రకటన చేశారు. ట్యాంక్ బండ్ పరిధిలో 18వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తుండగా.. కీలక నిబంధనలు సైతం అమలు చేయబోతున్నారు. ఇప్పటికే భాగ్యనగర ఉత్సవ కమిటీకి సైతం పలు సూచనలు చేశారు. ప్రశాంత వాతావరణం వేడుక ముగిసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఇక.. పోలీసు శాఖ ప్రకటించిన నిబంధనలు ఒకసారి పరిశీలిస్తే ఇలా ఉన్నాయి. విగ్రహాలను తరలించే ముందు పోలీస్ శాఖ నుంచి నంబర్లు జారీ చేస్తారు. సౌత్ జోన్ పరిధిలోని విగ్రహాలను ముందుగానే తరలించాలని.. వాహనానికి ఏసీపీ కేటాయించిన నంబర్‌ను తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు. ఒక గణేశుడి విగ్రహానికి ఒక్క వాహనానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంపై లౌడ్ స్పీకర్‌ను అమర్చకూడదని స్పష్టం చేశారు. డీజేతో కూడిన మ్యూజికల్ సిస్టమ్‌ను కూడా వినియోగించరాదని పేర్కొన్నారు. రంగులు చల్లుకునేందుకు కాన్ఫెట్టి తుపాకులను వాడరాదని, వాహనంలో మద్యం, ఇతర ఏదైనా మత్తు పదార్థాలు ఉండరాదని, వాటిని సేవించరాదని సూచించారు.
అలాగే.. ఊరేగింపులో కర్రలు, కత్తులు, ఆయుధాలు నిషేధం అని పోలీసులు సూచించారు. ఎలాంటి రాజకీయ ప్రసంగాలకు కూడా తావులేదని, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని, అలాంటి బ్యానర్లను కూడా ప్రదర్శించవద్దని పేర్కొన్నారు. ఒకరి మనభావాలు దెబ్బతినేలా వ్యవహరించవద్దని హెచ్చరించారు. పోలీసు అధికారులు, ట్రాఫిక్ అధికారులు ఇస్తున్న సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే 100కి డయల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.