Hyderabad Banjara Hills Hospital: హైదరాబాదులో కార్పొరేట్ ఆసుపత్రుల దందా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు అక్కడ ఠాగూర్ సినిమా తరహాలోనే సంఘటనలు జరుగుతుంటాయి. పెద్ద స్థాయి వ్యక్తులు నిర్వహించే ఆసుపత్రులు కాబట్టి ప్రభుత్వాలు కూడా పెద్దగా ఏమీ అనవు. ఇటీవల గచ్చిబౌలి ప్రాంతంలో ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ఓ వ్యక్తి చనిపోయినప్పటికీ.. ఆ విషయం చెప్పకుండా ఆస్పత్రి యాజమాన్యం ముందుగా డబ్బులు వసూలు చేసి.. ఆ తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించింది.. ఆస్పత్రి ఎదుట మృతుడి బంధువులు ఆందోళన నిర్వహించినప్పటికీ.. పోలీసులు వచ్చి చెదరగొట్టారు తప్ప.. కనీసం న్యాయం చేయలేదు. మనుషుల ప్రాణాలతో వ్యాపారం చేసే కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్న హైదరాబాద్ నగరంలో.. ఓ ఆసుపత్రి యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది.
హైదరాబాద్ నగరంలోని అత్యంత ఖరీదైన బంజారాహిల్స్ ప్రాంతంలో మూడు అక్షరాల పేరుతో ఓ ఆసుపత్రి ఉంది. ఈ ఆస్పత్రి యజమాని ఆ మధ్య పార్లమెంటు ఎన్నికల్లో ఓ జాతీయ పార్టీలో చేరారు. హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఆ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేశారు. ఊహించని విధంగా ఓటమి పాలయ్యారు. అంతకుముందు వినూత్నమైన ప్రచారంతో సోషల్ మీడియాలో కనిపించారు. ప్రధాన మీడియాలో కూడా తెగ దర్శనమిచ్చారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం విజయం సాధించలేకపోయారు.. ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఆమె ప్రయత్నాలు మొదలుపెట్టారు.
తన ఆస్పత్రిలో ఫీజులు తగ్గించినట్టు ఆమె పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వీడియో రూపంలో బయటపెట్టారు. రోగులకు వివిధ పరీక్షలు, చికిత్సకు సంబంధించి ఫీజులు తగ్గించినట్టు ఆమె వివరించారు. ఉన్నట్టుండి ఫీజులు తగ్గించడం వెనుక తమ పై అపారమైన ప్రేమను ఆమె ప్రదర్శిస్తున్నారని రోగులు అనుకుంటున్నారు. తగ్గించిన ఫీజులను కూడా ఆమె ప్రచారం చేసుకుంటున్నారు. దీని వెనుక బలమైన కారణం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఆ ఆసుపత్రి మాత్రమే కాకుండా, ఓ ఫౌండేషన్ ను ఆమె నిర్వహిస్తున్నారు..ఈ ఫౌండేషన్ కింద రోగులకు సేవలు కూడా అందిస్తున్నట్టు ఆమె చెబుతున్నారు. ఇలా సామాజిక సేవ చేస్తూ.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దీనిని ప్రధానంగా ప్రచారం చేసుకుంటూ హైదరాబాద్ నుంచి ఎంపీ గా గెలవాలని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందువల్లే ఈ స్థాయిలో ప్రచారం చేసుకుంటున్నట్టు సమాచారం.