Telugu Family: సాధారణంగా సంక్రాంతి సందర్భంగా కొత్త అల్లుళ్లకు అత్తవారింట్లో ఘన స్వాగతం లభిస్తుంది. అంతకుమించిన ప్రేమ దక్కుతుంది. కానుకలతో కొత్త అల్లుడిని అత్తామామలు ఆనంద పరుస్తుంటారు. అంతేకాదు పొట్ట పగిలే విధంగా వంటకాలు పెట్టి తమ ప్రేమను మరింత గొప్పగా వ్యక్తం చేస్తుంటారు. అయితే ఇప్పుడు సంక్రాంతి కాదు.. సంక్రాంతి రావడానికి ఇంకా చాలా సమయమే ఉంది.. అయినప్పటికీ ఓ కొత్త అల్లుడికి సంక్రాంతి రాకముందే పంట పండింది. పొట్ట పగిలేలా తిండి దొరికింది.
మర్యాదలకు పెట్టింది పేరైన పశ్చిమగోదావరి జిల్లాలో దీపావళి పండుగకు వచ్చిన కొత్త అల్లుడికి అత్తింటి వారు అద్భుతమైన విందు ఇచ్చారు.. రకరకాల వంటకాలతో అతని ఆశ్చర్యపరిచారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం అనే ప్రాంతానికి చెందిన తులసి, రాంబాబు దంపతులకు ఓ కుమార్తె ఉంది. ఇటీవల ఆమెకు వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో దీపావళికి అల్లుడుని, కూతుర్ని తమ ఇంటికి ఆహ్వానించారు. ఇందులో భాగంగానే అల్లుడికి అద్భుతమైన విందు ఇచ్చారు. వంద రకాల నాన్ వెజ్, వంద రకాల వెజ్ ఐటమ్స్, పిండి వంటకాలు సర్వ్ చేశారు.. బంధువులు పోటీపడి అల్లుడికి, కూతురికి వంటకాలు తినిపించారు.. చికెన్ నుంచి చేపల దాకా, గులాబ్జామ్ నుంచి మొదలుపెడితే కజ్జికాయ వరకు, పులిహోర నుంచి మొదలుపెడితే ఉసిరి పచ్చడి వరకు.. ఇలా అన్ని రకాల వంటకాలను అందుబాటులో ఉంచి కొత్త అల్లుడిని సర్ప్రైజ్ చేశారు.
సాధారణంగా ఆంధ్ర ప్రాంతంలో సంక్రాంతి సందర్భంగా కొత్త అల్లుళ్లకు కానుకలు పెడుతుంటారు. అద్భుతమైన విందు ఇచ్చి ఆశ్చర్యపరుస్తుంటారు. కానీ తులసి, రాంబాబు దంపతులు తమ అల్లుడికి ముందుగానే సంక్రాంతి పండుగను తీసుకొచ్చారు. దీపావళిని సంక్రాంతి మాదిరిగా జరుపుకున్నారు. వంటకాలతో పాటు అతనికి ఖరీదైన కానుకలు కూడా ఇచ్చారు. ఇద్దరు దంపతుల్ని పక్కపక్కన కూర్చోబెట్టి.. వంటకాలను మొత్తం ఓ టేబుల్ మీద పెట్టి సర్వ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. వాస్తవానికి ఆంధ్ర ప్రాంతంలో సంక్రాంతి సందర్భంగా కొత్త అల్లుళ్లకు ఇటువంటి రాచ మర్యాదలు దక్కుతాయి. కానీ ఇతడికి దీపావళి సందర్భంగా నే ఆ స్థాయిలో గౌరవం దక్కడం విశేషం.