https://oktelugu.com/

Telangana hydra : అబద్ధం నిజమైంది.. రేవంతుడి హైడ్రా సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది..

 నిజం గడప దాటేలోపు.. అబద్ధం ఊరు మొత్తం చుట్టి వస్తుంది.. ఈ సామెత తెలంగాణ హైడ్రా విషయంలో నిజమైంది. ఫలితంగా రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 27, 2024 / 08:23 PM IST

    Telangana HYDRA (1)

    Follow us on

    Telangana hydra : హైదరాబాదులో హైడ్రా సాగిస్తున్న దూకుడు మామూలుగా లేవు. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు అని తేడా లేకుండా ఫిర్యాదు రావడం ఆలస్యం.. దస్త్రాలను పరిశీలించడం.. పడగొట్టడం.. ఆ తర్వాత నివేదిక ప్రభుత్వానికి సమర్పించడం.. ఇలా సాగిపోతుంది హైడ్రా పనితీరు. హైదరాబాద్ దూకుడు వల్ల హైదరాబాద్ నిర్మాణరంగం లో హడల్ ఏర్పడుతోంది. గతంలో స్థిరాస్తి వ్యాపారులు ప్రదర్శించిన నిర్లక్ష్యం ఇప్పుడు భయంగా పరిణమిస్తుంది. ఏమవుతుందిలే అనే స్థాయి నుంచి.. రిస్క్ ఎందుకు తీసుకోవాలి అనే ఆలోచన స్థిరాస్తి వ్యాపారులలో కనిపిస్తోంది. హైడ్రా దూకుడు వల్ల బుల్డోజర్ తో కూల్చివేతలు దర్జాగా సాగిపోతున్నాయి. సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ పడగొట్టిన తర్వాత హైడ్రా పేరు మరింతగా మార్మోగిపోతోంది. దీంతో హైదరాబాదులో ఎలాంటి కూల్చివేత జరిగినా హైడ్రా పని అని అందరూ అనుకుంటున్నారు. తెర వెనుక ఏం జరుగుతుందో అంచనా వేయకుండానే.. ప్రధాన మీడియా నుంచి న్యూస్ వెబ్ సైట్ ల వరకు హైడ్రా పని తేల్చేస్తున్నాయి.

    సోమవారం హైదరాబాదులోని రాయదుర్గంలో కూల్చివేతలు జరిగాయి. ఇదంతా హైదరాబాద్ అని మీడియా రిపోర్ట్ చేసింది. ముఖ్యంగా నమస్తే తెలంగాణ అయితే పేదలపై బుల్డోజర్లు అని తాటికాయంత అక్షరాలతో బ్యానర్ వార్తను పరి చేసింది. రాయదుర్గంలో కూల్చివేతల కు సంబంధించిన ఫోటోలతోపాటు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ కూల్చే దమ్ము రేవంత్ ప్రభుత్వానికి ఉందా? అంటూ ఒక కథనాన్ని ప్రచురించింది.. అయితే హైడ్రా వివరణ లేకుండానే నమస్తే తెలంగాణ ఆ కథనాన్ని ప్రచురించడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో ఆ కూల్చివేతలకు అసలు కారణం హైడ్రానే అని అందరూ భావించారు. అయితే రాయదుర్గం కూల్చివేతలకు తమకు ఎటువంటి సంబంధం లేదని హైడ్రా స్పందించడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది.

    హైడ్రా ఆ కూల్చివేతలు చేపట్టకపోతే.. ఎవరు ఆ పని చేశారనేది సందిగ్ధంగా మారింది. అయితే ఆ కూల్చివేతలకు పాల్పడింది జీహెచ్ఎంసీ. ఎందుకంటే రాయదుర్గంలో స్టేట్ లెదర్ ఇండస్ట్రీ ప్రమోషన్స్ కు అప్పట్లో భూమి కేటాయించారు. ఆ భూమిలో పాత క్వార్టర్లతో పాటు అక్రమంగా నిర్మించిన ఐదు నిర్మాణాలు ఉన్నాయి. కోర్టులో కేసులు వేస్తే..విచారణ నిర్వహించిన న్యాయస్థానాలు అది ప్రభుత్వ భూమి అని స్పష్టం చేశాయి. ఆయనప్పటికీ ఆక్రమించిన వారు దానిని ఖాళీ చేయలేదు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూల్చివేతలకు పాల్పడింది. ఈ భూమిలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా యూనిటీ మాల్ నిర్మించాలని భావిస్తున్నాయి. ఇందులో చేనేత కళాకారుల ఉత్పత్తులు, చేతి వృత్తుల వారి ఉత్పత్తులను సందర్శనకు పెట్టాలని భావిస్తోంది. వాటిని అక్కడ విక్రయించి ఉపాధి కల్పించాలని యోచిస్తున్నాయి. తెలంగాణలో హైడ్రా దూకుడు వల్ల ప్రభుత్వానికి మైలేజీ పెరిగింది. ఇదే సమయంలో మీడియా చేసిన అతి వల్ల హైడ్రా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నగరంలో ఎటువంటి కూల్చివేతలకు పాల్పడినా.. ఇతర సంఘటనలు జరిగినా తాము అధికారికంగా సమాచారం ఇచ్చేవరకు ఎటువంటి వార్తలు తమ పేరుతో ప్రచురించకూడదని హైడ్రా మీడియాకు స్పష్టం చేసింది