Sunil Gavaskar: ప్రస్తుతం బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జై షా త్వరలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లె పదవి కాలం ముగిసింది. ఆయన గత రెండు పర్యాయాల నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే ఈసారి అధ్యక్షుడుయ్యే సానుకూల పవనాలు ఆయన వైపు లేవు. గతకాలపు శక్తులు కూడా ఆయన నాయకత్వాన్ని సమర్థించడం లేదు.. అయితే ఇదే సమయంలో జై షా తాను ఐసీసీ అధ్యక్షుడయ్యేందుకు ఇతర దేశాల ప్రతినిధులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని సీనియర్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఖండించాడు. ప్రముఖ స్పోర్ట్స్ మ్యాగజైన్ “స్పోర్ట్స్ స్టార్ “లో ఒక ప్రత్యేక కాలమ్ రాశారు. ఇంతకీ అందులో సునీల్ గవాస్కర్ ఏం ప్రస్తావించారంటే..
“గతకాలపు శక్తులను జై షా ప్రభావితం చేయలేదు.. బార్క్లె ను మూడవసారి అధ్యక్షుడిగా ఎన్నుకోకూడదని జై షా ఎవరిపై ఒత్తిడి తీసుకురాలేదు. ఇవన్నీ ఊహగానాలు మాత్రమే. జై షా భారత క్రికెట్ కోసం అపారమైన సేవలు అందిస్తున్నారు. భారత్ లోని పురుషులు, మహిళల జట్టుకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కేందుకు ఆయన కృషి చేశారు. అందువల్లే ఆ రెండు జట్లు అత్యంత ప్రభావ వంతంగా మారాయి.. ఐసీసీలో క్రియాశీలకంగా ఉన్నవారు ఏవేవో విమర్శలు చేస్తున్నారు. కాకపోతే వాటికి ఆధారం ఉండదు. అనవసరంగా ఎందులోనూ వేరు పెట్టకూడదు. దానిని వైద్య పరిభాషలో టాల్ పాపి సిండ్రోమ్ అని పిలుస్తారు. అలా విమర్శలు చేస్తున్న వారికి అంతర్జాతీయ క్రికెట్ పై అవగాహన లేదు.. జై షా భారత క్రికెట్ నియంత్రణ మండలి లో ఆటగాళ్లు, నిర్వాహకుల మధ్య బలమైన సంబంధాన్ని ఏర్పాటు చేశాడు. అందువల్లే అతడు అత్యంత క్రియాశీలమైన వ్యక్తిగా పేరుపొందాడు. అటువంటి వ్యక్తి ఐసీసీ అధ్యక్షుడయితే కచ్చితంగా క్రికెట్ స్వరూపం మారిపోతుంది. అది మరింత విశ్వవ్యాప్తం అవుతుంది. వర్తమాన ఆటగాళ్లకు అవకాశాలు లభిస్తాయి. కొత్త జట్లు కూడా పుట్టుకొస్తాయి. ఆట విస్తృతమైతే వ్యాపార అభివృద్ధి కూడా బలంగా సాగుతుందని” సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.
సునీల్ గవాస్కర్ రాసిన కాలమ్ క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారింది. సునీల్ గవాస్కర్ రాసిన వ్యాఖ్యలను చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఐసీసీలో ప్రతీప శక్తులుగా మారిన వ్యక్తులను ఉద్దేశించి విమర్శిస్తున్నారు..”క్రికెట్ కు మీరు గుర్తింపు తీసుకురండి. ఆ క్రీడను విశ్వవ్యాప్తం చేయండి. కొత్త కొత్త అవకాశాలను సృష్టించండి. యువతరానికి సరైన వేదికలను నిర్మించండి. అలాంటి పనితీరు ఉన్న వారిని గుర్తించండి.. అంతేగాని చవక బారు విమర్శలు చేయకండని” నెటిజన్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.