BRS MLAs will join the Congress
BRS MLAs: పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణలో అత్యంత గడ్డు పరిస్థితి ఎదుర్కుంటున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్‌ఎస్సే. అధికారం కోల్పోయిన వెంటనే ఇన్నాళ్లూ ఆ పార్టీలో పదవులు అనుభవించిన నేతలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. అధికారం ఎక్కడ ఉంటే.. తాము అక్కడ అన్నట్లు చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీ మారుతున్నారు. ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు జంప్ అయ్యారు. ఇక కీలక, సీనియర్ నాయకులు సైతం సెలవంటూ వెళ్లిపోతున్నారు. ఇంకా అనేక మంది అధికార పార్టీతో టచ్‌లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్‌పార్టీ ఏప్రిల్ 6న నిర్వహించే జన జాతర సభ గులాబీ పార్టీని కలవరపెడుతోంది. ఈ సభలో బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారని జరుగుతున్న ప్రచారమే కారణం. ఉండేవారెవరో.. పోయేవారెవరో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
అంతా గోప్యంగా..
ఇక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల చేరిక విషయంలో అధికార కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గోప్యత పాటిస్తోంది. తుక్కుకూడ సభలో చేరేవారి పేర్లు వెల్లడించడంలేదు. ఇటు గులాబీ భవన్, అటు గాంధీ భవన్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. నలుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు పది మంది వరకు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈమేరకు ఇప్పటికే చర్చలు, సంప్రదింపులు పూర్తయినట్లు గాంధీ భవన్ నుంచి సమాచారం అందుతోంది.
గులాబీ పార్టీ నేతకే బాధ్యతలు..
గతంలో కాంగ్రెస్‌లో పనిచేసి పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించి పదేళ్ల క్రితం బీఆర్‌ఎస్‌లోచేరిన నేత కే.కేశవరావు. ఇటీవలే మళ్లీ సొంతగూటికి వచ్చారు. ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి.. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరే నేతలు, ఎమ్మెల్యేలను చూసుకోవాల్సిన బాధ్యతలను కేకేకు అప్పటించినట్లు తెలుస్తోంది. ఆ పార్టీతో పదేళ్లు తనకు ఉన్న పరిచయాలతో వీలైనంత ఎక్కువ మందిని కాంగ్రెస్‌లోకి తీసుకురావాలని యత్నిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు కేకే మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. టీడీపీ నేతలను కూడా కాంగ్రెస్‌లో చేరుందకు కేకేతో చర్చలు జరుతున్నట్లు సమాచారం.