https://oktelugu.com/

BRS : బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. 100 కోట్ల పార్టీ కార్యాలయం కూల్చాలని హైకోర్టు ఆదేశం.. 15 రోజుల డెడ్ లైన్

దేశంలో బుల్డోజర్‌ కూల్చివేతలు ఆపాలని మంగళవారం(సెప్టెంబర్‌ 17న) దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అక్టోబర్‌ 1 వరకు ఎలాంటి కూల్చివేతలు చేయొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మరుసటి రోజే తెలంగాణ హైకోర్టు రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్‌ ఇచ్చింది.

Written By:
  • NARESH
  • , Updated On : September 18, 2024 / 10:55 PM IST
    Follow us on

    BRS : తెలంగాణను పదేళ్లు పాలించి.. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్‌ఎస్‌ అలియాస్‌ టీఆర్‌ఎస్‌ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి గత ప్రభుత్వంలో విద్యుత్‌ కొనుగోళ్లపై విచారణ కమిషన్‌ నియమించారు. తర్వాత కాళేశ్వరంలో అక్రమాలపై మరో కమిషన్‌ ఏర్పాటు చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై విచారణ జరుగుతోంది. మరోవైపు 10 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. ఇలా వరుస షాక్‌లతో ఇబ్బంది పడుతున్న బీఆర్‌ఎస్‌కు.. తాజాగా హైకోర్టు షాక్‌ ఇచ్చింది. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం కూల్చివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

    అధికారంలో ఉన్నామని..
    తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పదేళ్లుగా అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నామని, తమను ఎవరు ప్రశ్నిస్తారన్న.. ఉద్దేశంలో హైదరాబాద్‌ – నల్గొండ ప్రధాన రహదారి వెంట నల్గొండ పట్టణ శివారులో రెండెకరాల స్థలంలో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం నిర్మించింది. భవన నిర్మాణానికి మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. మొన్నటి ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోయిన తర్వాత మున్సిపల్‌ అధికారులు పార్టీకి నోటీసులు జారీ చేశారు. 99 ఏళ్లు భూమిని లీజుకు తీసుకుని గజానికి రూ100 చొప్పున అద్దె చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంది.

    మంత్రి ఆదేశాలతో..
    మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భవనానికి ఎలాంటి అనుమతులు లేవని, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో మున్సిపల్‌ అధికారులు వెంటనే నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాల్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ హైకోర్టును ఆశ్రయించింది. ఆఫీస్‌ను క్రమబద్ధీకరించేలా ఆదేశించాలని కోరింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. బీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇచ్చేలా బుధవారం(సెప్టెంబర్‌ 18న) ఆదేశాలు జారీ చేసింది.

    15 రోజులు గడువు..
    ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన నల్గొండ బీఆర్‌ఎస్‌ కార్యాలయ భవనాన్ని కూల్చివేయాలని హైకోర్టు మున్సిపల్‌ అధికారులను ఆదేశించింది. అంతేకాకుండా మున్సిపాలిటీకి రూ.లక్ష పరిహారం చెల్లించాలని సూచించింది. 15 రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఐదేళ్ల క్రితం భవనం నిర్మించి ఇన్నేళ్లూ కార్యక్రమాలు నిర్వహించి ఇప్పుడు క్రమబద్ధీకరించాలని కోరడం ఏంటని ప్రశ్నించింది. ఇదిలా ఉంటే బీఆర్‌ఎస్‌ భవనం నిర్మించిన స్థలం విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.100 కోట్లు ఉంటుందని ఆంచనా.