Chiranjeevi: మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చిరంజీవి, మోహన్ బాబు బంధం ఎంతో విచిత్రమైనది. ఒకరిని ఒకరు పరోక్షంగా విమర్శించుకున్న సందర్భాలు, నేరుగా విమర్శించుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మళ్ళీ వీళ్లిద్దరు స్నేహం గా, ఆప్యాయంగా పలు సందర్భాలలో కనిపిస్తూ అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. అసలు వీళ్ళు నిజంగా స్నేహితులా?, స్నేహితులైతే ఎందుకు అలా తిట్టుకుంటున్నారు?, పోనీ శత్రువులా?, ఒకవేళ అదే నిజమైతే ఎందుకు మనకి ఎన్నో సందర్భాలలో ఆప్యాయంగా కనిపించారు?, అసలు వీళ్లిద్దరి మధ్య ఉన్న బంధం పేరేంటి అనేది అభిమానులకు ఇప్పటికీ మిస్టరీనే. అయితే గతం లో వీళ్లిద్దరు కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. చిరంజీవి హీరో అయితే, మోహన్ బాబు విలన్ గా కనిపించేవాడు. అలా వీళ్లిద్దరి కాంబినేషన్ లో పదుల సంఖ్యలో సినిమాలు వచ్చాయి.
అయితే చిరంజీవి కి నచ్చని ఒక కథని తీసుకొని, మోహన్ బాబు అప్పట్లో ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాశాడు అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా?..వరుసగా విలన్ క్యారెక్టర్స్ తో ఇండస్ట్రీ లోకి దూసుకెళ్తున్న మోహన్ బాబు ని హీరో గా నిలబెట్టిన చిత్రం ‘అల్లుడు గారు’. కె రాఘవేంద్ర రావు దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఆరోజుల్లో ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాసింది. అయితే ఈ చిత్రాన్ని రాఘవేంద్ర రావు ముందుగా మెగాస్టార్ చిరంజీవి తో చేయాలనీ అనుకున్నాడు. అంతకుముందే వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘జగదేక వీరుడు..అతిలోక సుందరి’ అనే చిత్రం వచ్చింది. ఈ సినిమా ఆరోజుల్లో ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో మన అందరికీ తెలిసిందే. వర్షాలు, వరదలను లెక్క చేయకుండా ఈ సినిమా ఆరోజుల్లో ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఈ సినిమా తర్వాత వెంటనే ‘అల్లుడు గారు’ చిత్రాన్ని చిరంజీవి తో చేయాలనీ రాఘవేంద్ర రావు తపన పడ్డాడు. వెంటనే చిరంజీవి ని కలిసి స్టోరీ ని వినిపించాడు. చిరంజీవి కి కథ బాగా నచ్చింది. దీంతో రాఘవేంద్ర రావు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని ప్రారంభించాడు. ఆ సమయంలో చిరంజీవి నుండి ఆయనకు ఫోన్ వచ్చింది.
ఇంటికి రమ్మని రాఘవేంద్ర రావు ని పిలిచి, ఈ సినిమా మన కాంబినేషన్ లో వర్కౌట్ అవ్వదేమో, ఎందుకంటే క్లైమాక్స్ లో హీరోకి ఉరి శిక్ష పడుతుంది. మన ఆడియన్స్ అలాంటి సన్నివేశాలను తీసుకోలేరు అని రాఘవేంద్ర రావు తో అన్నాడట. అయితే క్లైమాక్స్ మార్చేద్దాం అని రాఘవేంద్ర రావు అన్నాడట. క్లైమాక్స్ మార్చేందుకు ఆయన చాలా ఆలోచించాడు కానీ, కథ రీత్యా హీరో కి ఉరి శిక్ష కచ్చితంగా పడాల్సిందే, దీనిని మార్చలేం అని అనుకోని చిరంజీవి కి ఇదే విషయాన్నీ చెప్పాడట. వర్కౌట్ అవ్వదు అని చిరంజీవి ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత రాఘవేంద్ర రావు మోహన్ బాబు తో ఈ చిత్రాన్ని చేసి భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు.