Telangana Cold Wave: తెలంగాణలో చలి రోజురోజుకు తీవ్రమవుతోంది. చలికాలం ప్రారంభమై చాలా రోజులు అవుతున్నా.. ఇప్పటివరకు తీవ్రమైన చలి అనిపించలేదు. ఇటీవల దిత్వా తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చల్లటి వాతావరణం ఏర్పడింది. అలాగే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షం పడడంతో చలి మరింత పెరిగినట్లు తెలుస్తోంది. అయితే డిసెంబర్ 7 నుంచి 17వ తేదీ వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈ పది రోజులపాటు సింగిల్ డిజిట్ లో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణలోని మారుమూల గ్రామాలతో పాటు పట్టణ, నగరాల్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోవడం ఆందోళనకు గురిచేస్తుంది. దీంతో అధికారులు హై కాలర్టు ప్రకటించారు.
గతంలో ఎక్కువగా ఉత్తర తెలంగాణలోని తల్లి తీవ్రత ఉండేది. కానీ ఇప్పుడు దక్షిణ తెలంగాణలోనూ చలి ప్రభావం పెరుగుతోంది. హైదరాబాదులోనూ తాజాగా 5 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో వణుకుతున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, మొహీనాబాద్, రాజేంద్రనగర్, శంషాబాద్ వంటి ప్రాంతాల్లో కూడా 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం. అయితే ఈ ప్రాంతాల్లో రాత్రి సమయంలోనే ఈ ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. అటు ఉత్తర తెలంగాణలోని కొమరం భీం ఆసిఫాబాద్ లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కరీంనగర్, పెద్దపల్లి ప్రాంతాల్లో 13 నుంచి 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే పది రోజుల పాటు తీవ్రమైన చలి ఉండి.. ఆ తర్వాత పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
చలి తీవ్రత కారణంగా చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. మీరు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అంటున్నారు. ఒకవేళ అత్యవసరం అయితే రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకోవాలని అంటున్నారు. మిగతావారు సైతం చలి నుంచి కాపాడుకునేందుకు రక్షణ కవచాలు ఏర్పాటు చేసుకోవాలని అంటున్నారు. ఇప్పటికే చలి కారణంగా గ్రామాల్లో రాత్రి సమయంలో ఎవరు బయటకు రావడం లేదు. అయితే పట్టణ ప్రాంతాల్లో మాత్రం కాస్త ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండడంతో ఉపశమనం కలుగుతుంది. కానీ ఇక్కడ కూడా రాత్రి సమయంలో గజగజ వణికే చలి ఉంటుంది. ఉదయం సమయంలో పనులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు ఇప్పటికే తల్లి తీవ్రతతో అనారోగ్యాల బారిన పడ్డారు. మరికొందరికి ఫ్లూ, జలుబు వంటి సమస్యలతో సతమతమవుతున్నారు.