Telangana BJP: “అందరివి నలుపు మరకలే. ప్రతి ఒక్కడూ ఆ తానులో ముక్కలే” వెనకటికి ఓ సినిమాలో బహుళ ప్రాచుర్యం పొందిన డైలాగ్ అది. అది నేటి రాజకీయాలకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కమలం పార్టీలో చోటు చేసుకున్న మార్పులకు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఉదయం లేస్తే కమలం పార్టీ నాయకులు ఇతర పార్టీ నాయకులను తిడుతుంటారు. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని.. కుటుంబ సభ్యులకే పదవులు ఇస్తున్నారని మండిపడుతుంటారు. ఇన్నాళ్ళ వరకు బిజెపి ని ఈ విషయంలో కార్నర్ చేసే అవకాశం మిగతా పార్టీలకు లభించలేదు. అయితే ఇప్పుడు బీజేపీ నే అవకాశాన్ని మిగతా పార్టీలకు దర్జాగా ఇచ్చేసింది.
Also Read: కిష్కింధపురి vs మిరాయి: ఏ సినిమా హిట్? ఏది ఫ్లాప్?
తెలంగాణలో అధికారంలోకి రావాలని.. కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని బలమైన నిర్ణయంతో ఉంది బిజెపి. ఇప్పటికే గులాబీ పార్టీని మట్టి కరిపించామని.. త్వరలో కాంగ్రెస్ పార్టీని కూడా గద్దె దింపుతామని బిజెపి నాయకులు బలమైన నమ్మకంతో ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని బలంగా కోరుకుంటున్నారు. వారి కోరికలు నెరవేరుతాయా.. వారు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారా.. అనే విషయాలను పక్కన పెడితే తెలంగాణ బిజెపిలో ఇటీవల కొంతమందికి పదవులు ఇచ్చారు. అవి పార్టీకి సంబంధించిన పదవులు. అయితే ఆ పదవులు పొందిన వారిలో కొంతమంది పేర్లను పరిశీలిస్తే ఆశ్చర్యం అనిపించింది. అద్భుతం కూడా అనిపించింది. వారసత్వ రాజకీయాలకు బిజెపి దూరమని. బిజెపి అటువంటి వాటిని ప్రోత్సహించదని పదేపదే కమల నేతలు చెబుతుంటారు. కానీ వాస్తవానికి కమలం పార్టీ కూడా మిగతా వాటి మాదిరిగానేనని.. పైగా వారసత్వాన్ని పెంపొందించే విషయంలో బిజెపి పీహెచ్డీ చేసిందని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి.
పార్టీకి సంబంధించిన పదవుల విషయంలో మీడియాకు ఓ జాబితా అందింది. అందులో మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కొడుకు తుళ్ల వీరేంద్ర గౌడ్ కు పార్టీ స్టేట్ జనరల్ సెక్రెటరీ పదవి ఇచ్చారు. మాజీమంత్రి పోతుగంటి రాములు కొడుకు భరత్ ప్రసాద్ కు కూడా స్టేట్ సెక్రటరీ పదవి ఇచ్చారు. పోతుగంటి రాములు గతంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యుడిగా పని చేశాడు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి కి సెక్రెటరీగా ప్రమోషన్ ఇచ్చారు. మాజీ మంత్రి రామచంద్ర రావు కోడలు కరణం ప్రణీతకు కు సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు. బద్దం మహిపాల్ రెడ్డి కొడుకు బద్దం బాల్రెడ్డికి మంచి పోస్ట్ ఇచ్చారు. పీవీ నరసింహారావు మనవడు, గులాబీ పార్టీ ఎమ్మెల్సీ వాణిదేవి అక్క కొడుకు ఎన్వి సుభాష్ కు చీఫ్ స్పోక్స్ పర్సన్ పదవి ఇచ్చారు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కు చెందిన కాంగ్రెస్ నాయకుడు బొమ్మ వెంకన్న బిడ్డ జయశ్రీకి కీలకమైన పోస్ట్ కట్టబెట్టారు. 22 పోస్టులకు నాయకుల పేర్లు విడుదల చేస్తే.. అందులో ఆరుగురు వారసత్వ నాయకులే. అంటే మూడో వంతు పోస్టులు వారసత్వంగా వచ్చిన వారికే బిజెపి ఇచ్చింది అనుకోవాలి.