Heavy Rrains : భారీ వర్షాలు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

రుతుపవనాల వల్ల గోదావరి క్యాచ్ మెంట్ ఏరియాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా శబరి, సీలేరు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.. ఈ నదుల వరద రావడంతో గోదావరి ఉరకలు వేస్తోంది. భద్రాచలం ప్రాంతంలో 35 అడుగులకు ప్రవాహం చేరుకుంది. గోదావరి వరద ప్రవాహం వల్ల స్నాన ఘట్టాలు నీటమునిగాయి.

Written By: Bhaskar, Updated On : July 20, 2023 2:02 pm
Follow us on

Heavy Rrains : బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటిదాకా లోటు వర్షపాతంతో విలవిలాడిన పలు జిల్లాల్లో సమృద్ధిగా వర్షపాతం నమోదవుతున్నది. పలు జిల్లాల్లో చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. కుంటలు మత్తలు పోస్తున్నాయి. పలు చోట్ల రాకపోకలు స్తంభించాయి. హైదరాబాద్ మహానగరంలో లోతట్టు ప్రాంతాల మొత్తం జలమయమయ్యాయి. గోదావరి నుంచి వరద ఉదృతంగా వస్తుండడంతో కాలేశ్వరం, ఇతర ఎత్తిపోతల పథకాలు నిండుకుండల్లాగా మారాయి. వర్షాలు విస్తృతంగా కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండడం, బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడటం వల్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు గురు, శుక్రవారాలు  సెలవులు ప్రకటించింది. అంతేకాదు ప్రభుత్వాధికారులకు సెలవులు రద్దు చేసింది. జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించింది. హైదరాబాద్, వరంగల్, నల్లగొండ, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన అధికారులు జిల్లా కేంద్రాల్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. గోదావరి ముంపు ప్రాంతాల్లో బఫర్ స్టాక్ సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచనలు చేసింది. గత ఏడాది వరదలు ముంచెత్తిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.
చురుకుగా రుతుపవనాలు
మొన్నటిదాకా చురుకుగా కదలని రుతుపవనాలు.. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడటం వల్ల చురుకుగా కదులుతున్నాయి. ఫలితంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో పనిచేసే అధికారులు జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. చేపల వేటకు వెళ్లే జాలర్లు జలాశయాలకు వెళ్ళొద్దని ప్రభుత్వం సూచనలు చేసింది. కాగా ఆ విస్తారంగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లోఈ జలాశయాలు నిండుకుండల్లాగా మారాయి. తెరిపినియ్యని వర్షాల వల్ల రోడ్లు ధ్వంసం అయ్యాయి.
గోదావరి క్యాచ్ మెంట్ ఏరియాలో..
రుతుపవనాల వల్ల గోదావరి క్యాచ్ మెంట్ ఏరియాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా శబరి, సీలేరు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.. ఈ నదుల వరద రావడంతో గోదావరి ఉరకలు వేస్తోంది. భద్రాచలం ప్రాంతంలో 35 అడుగులకు ప్రవాహం చేరుకుంది. గోదావరి వరద ప్రవాహం వల్ల స్నాన ఘట్టాలు నీటమునిగాయి. దుమ్ముగూడెం మండలం పర్ణశాల లోని నార చీరల ప్రాంతం నీట మునిగింది. వర్షానికి గాలి దుమారం కూడా తోడు కావడంతో ఆ ప్రాంతంలో భారీ వృక్షాలు నేలకూలాయి. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలను నిలిపివేశారు. ఇక ఆయా జిల్లాల్లో పరిస్థితిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.