Two Children Rule: తెలంగాణలో పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగిసి ఏడాది కావస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచుల పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. అయితే సర్పంచులు లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటు పడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. ఇక ఎన్నికలకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేసింది. కానీ, రిజర్వేషన్లు సవరించాలని, బీసీ రిజర్వేషన్లు పెంచాలని ఒత్తిడి రావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ప్రస్తుతం కుల గణన కూడా 70 శాతంపైగా పూర్తయింది. మరో వారం రోజుల్లో కుల గణన పూర్తయ్యే అవకాశం ఉంది. ఆన్‌లైన్ అయిన తర్వాత కులాల వారీగా లెక్కలు తేలే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల సవరణతోపాటు.. రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ముగ్గురు పిల్లలున్నా పోటీ..
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉన్నవారు కూడా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలని భావిస్తున్నట్లు తెలిసింది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతోపాటు మున్సిపల్ ఎన్నికల్లోనూ పోటీ చేసేవారికి ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధన ప్రస్తుతం అమలులో ఉంది. దీంతో రాజకీయంగా ఆసక్తి ఉన్నవారు చాలా మంది పోటీకి దూరమవుతున్నారు. ఇద్దరు పిల్లల నిబంధన వారికి ఆటంకంగా మారింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉన్నవారికీ అవకాశం ఇవ్వాలని రేవంత్‌రెడ్డి సర్కార్ ఆలోచన చేస్తోంది. ఈ డిమాండ్ కూడా ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలో త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
చట్ట సవరణ
ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేలా ప్రభుత్వం వెసులు బాటు కల్పించనుంది. ఈమేరకు ప్రస్తుత పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలని భావిస్తోంది. ప్రస్తుత చట్టంలో 1995, జూన్ 1 తర్వాత మూడో సంతానం కలిగిన వ్యక్తులు పోటీ చేసేందుకు అనర్హులు. ఈ నిబంధనను తొలగించేందకు సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనే పంచాయతీరాజ్ చట్ట సవరణ చేసే అవకాశం ఉంది.
సర్వే తర్వాత కీలక నిర్ణయాలు..
తెలంగాణలో ప్రస్తుతం సమగ్ర కుటుం సర్వే జరుగుతోంది. ఇది మరో వారం రోజుల్లో పూర్తవుతుంది. ఆ తర్వాత నెల రోజుల్లో ఆన్‌లైన్ చేస్తారు. గణన పూర్తయిన తర్వాత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రిజర్వేషన్లను సవరించడంతోపాటు ప్రస్తుతం ఉన్న పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలను కూడా సవరించాలనే అలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత చట్టం ప్రకారం సర్పంచులపై వేటు వేసే అధికాకం క లెక్టర్లకు ఉంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో దీనిని తొలగించాలనే ఆలోచనలో కూడా రేవంత్ సర్కార్ ఉందని సమాచారం.