Telangana Sayudha Poratam: సాయుధ పల్లె.. గాలిపల్లి.. బద్దం ఎల్లారెడ్డి పోరాడిన పోరుపల్లె కథ

తెలంగాణ సాయుధ పోరాటానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. దేశం మొత్తానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే తెలంగాణకు మాత్రం 1948, సెప్టెంబర్‌ 17న స్వాతత్రం వచ్చింది. సైనిక చర్యతో నిజాం తెలంగాణను స్వాతంత్య్ర భారతంలో విలీనం చేశారు. అంతకుముందు తెలంగాణ విముక్తి కోసం పెద్ద పోరాటం సాగింది.

Written By: Raj Shekar, Updated On : September 17, 2024 11:41 am

Telangana Sayudha Poratam

Follow us on

Telangana Sayudha Poratam: తెలంగాణ సాయుధ పోరాటానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణను పాలించిన నిజాం సైనికులు సాగించిన అరాచకాలపై తెలంగాణ తిరగబడింది. రజాకర్లు అకృత్యాలకు ఎదురు తిరిగింది. ప్రతీ పల్లెల్లో ప్రజలు సాయుధులై తిరుగుబాటు చేశారు. రజాకార్లు హిందువులపై దాడులు చేయడం, మహిళలపైఅఘాయిత్యాలకు ఒడిగట్టడంతో తెలంగాణ విముక్తి పోరాటం సాగించారు. 1946 నుంచి 1951 వరకు కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏడో నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌కు వ్యతిరేకంగా ఈ పోరాటం జరిగింది. ఇందులో తెలంగాణ సాయుధ పోరాట యోధులు సుమారు 4,500 మంది అమరులయ్యారు. అంతకు ముందు హైదరాబాద్‌ సంస్థానంలో భాగంగా ఉన్న హైదరాబాద్‌ బ్రిటిష్‌ పాలతో సంబంధం లేకుండా ఉంది. అసఫ్‌ జాహీల పాలనలో ఉంది. నిజాం హలీ సిక్కా, ఇండియా రూపాయి వేర్వేరుగా ఉండేవి. 1948లో కలకత్తాలో అఖిలభారత కమ్యూ నిస్టు పార్టీ మహాసభ ‘సంస్థానాలను చేర్చుకోవడానికి ఒత్తిడి చేసే అధికారం యూనియన్‌ ప్రభుత్వానికి లేదు’ అని తీర్మానించింది. ముఖ్దుం మోయినుద్దీన్‌తోపాటు మరో ఐదుగురు కమ్యూనిస్టు నాయకులపై ఉన్న వారెంట్లను నిజాం ప్రభుత్వం ఎత్తివేసింది. కమ్యూనిస్టులపై నిషేధాన్ని కూడా ఎత్తివేసింది. అయితే హైదరాబాద్‌ స్వతంత్రంగా ఉండాలని, అదే కమ్యూనిస్టు విధానమని ఆ పార్టీ నేత రాజబహదుర్‌ గౌర్‌ ప్రకటించారు. అయితే ఖాసీ రజ్వీ నేతృత్వంలో రజాకార్లు, దేశ్‌ముఖ్‌లు, జమీందారులు, దొరలు గ్రామాలపై పడి నానా అరాచకాలు సృష్టించారు. దీంతో నాటి కమ్యూనిస్టుల వైఖరి మారింది. కమ్యూనిస్టుల సారథ్యంలోనే తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది.

4,500 మంది అమరులు..
తెలంగాణలో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాగించిన పోరాటంలో నిజాం సైన్యం ఖాసీ రజ్వీ ఆధ్వర్యంలో జరిపిన దాడితో 4,500 మంది తెలంగాణ సాయుధ పోరాట యోధులు నేలకొరిగారు. ఇందులో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా.. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంత కుంట మండలం గాలిపెల్లికి చెందిన 11 మంది ఒకేరోజు నేలకొరిగారు. తెలంగాణ సాయుధ పోరాటంలో గాలిపెల్లికి ప్రత్యేక చరిత్ర ఉంది. గ్రామానికి చెందిన కమ్యూనిస్టు యోధుడు బద్దం ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో నిజాం వ్యతిరేక పోరాటం చేపట్టారు. వెట్టిచాకిరీ, బానిసత్వానికి నిరసనగా నిజాం పోలీసులు, రజాకార్లపై తిరగబడింది గాలిపెల్లి. భీకర పోరు సాగించింది. ఈ పోరులో గాలిపెల్లి సమీప గ్రామాలకు చెందిన 11 మంది ఒకేరోజు అమరులయ్యారు. సాయుధ పోరాటంతో సంబంధం లేని గాలిపెల్లికి చెందిన వృద్ధ దంపతులు పెరంబుదూరి అనంతయ్య–రంగమ్మ బలయ్యారు.

స్ఫూర్తి ప్రదాత ఎల్లారెడ్డి..
గాలిపెల్లికి చెందిన బద్దం హన్మంతరెడ్డి–లచ్చవ్వ రెండో సంతానంగా 1906లో జన్మించారు బద్దం ఎల్లారెడ్డి. వెట్టిచాకిరీ విముక్తి కోసం సాయుధ పోరాటాన్ని ఎంచుకున్నారు. 1948 మార్చి 12న ఇల్లంతకుంట పోలీసు క్యాంపుపై దాడిచేసి ఎస్సైతోపాటు ఆరుగురు పోలీసులను హతమార్చారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా మద్రాసులో అరెస్ట్‌ అయి.. మూడు నెలలు జైలు శిక్ష అనుభవించారు. 1951లో జరిగిన తొలి ఎన్నికల్లో పీడీఎఫ్‌ తరఫునపోటీ చేసి కరీంనగర్‌ లోక్‌సభ సభ్యుడిగా విజయం సాధించారు. 1958లో బుగ్గారం నుంచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1972లో ఇందుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1979లో ఎల్లారెడ్డి కన్నుమూశారు.