Karimnagar: రాజకీయమంటే దోపిడీ కాదు.. ముమ్మాటికీ సేవ.. కావాలంటే ఈ కథనం చదవండి

కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం శాలపల్లి ఇందిరానగర్ గ్రామానికి చెందిన కోడిగుటి శారద ప్రవీణ్ మొన్నటిదాకా ఆ గ్రామానికి సర్పంచ్ గా పని చేశారు. ఇటీవల పదవి కాలం పూర్తి కావడంతో తాజా మాజీ సర్పంచ్ అయ్యారు.

Written By: Suresh, Updated On : February 16, 2024 4:18 pm

Karimnagar

Follow us on

Karimnagar: రాజకీయమంటే దోపిడీకి రాజ మార్గం. తరతరాలకు సరిపడా దాచుకునే దుర్మార్గం. ఒక్కసారి పదవి దక్కితే వ్యవస్థలను అనుకూలంగా మార్చుకోవచ్చు. నచ్చని వ్యక్తులను తొక్కేయవచ్చు. అంతకంతకు ఎదగొచ్చు . ఇలా చేస్తున్నారు కాబట్టే రాజకీయ నాయకులు అంటే సమాజం లెక్కపెట్టడం లేదు. రాజకీయాలంటే నానాటికి సమాజంలో చులకన భావం ఏర్పడుతోంది. ఇలాంటి సమయంలో కొంతమంది రాజకీయ నాయకులు విలువలను పాదుకొల్పేందుకు కృషి చేస్తున్నారు. అలాంటి వారిలో ఈ మాజీ సర్పంచ్ కూడా ఉంటాడు. అందులోనూ ముందు వరుసలో ఉంటాడు. ఇంతకీ ఈయన ఏం చేశాడంటే..

కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం శాలపల్లి ఇందిరానగర్ గ్రామానికి చెందిన కోడిగుటి శారద ప్రవీణ్ మొన్నటిదాకా ఆ గ్రామానికి సర్పంచ్ గా పని చేశారు. ఇటీవల పదవి కాలం పూర్తి కావడంతో తాజా మాజీ సర్పంచ్ అయ్యారు. సర్పంచ్ గా ఉన్నప్పుడు తనవంతుగా గ్రామ అభివృద్ధికి కృషి చేశారు. సిసి రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, మొక్కల పెంపకం, తాగు నీటి సరఫరా వంటి వాటిని సక్రమంగా అమలు చేశారు. ప్రభుత్వ పథకాల అమలులోనూ తన వంతు పాత్ర పోషించారు. తన పదవి కాలం అయిపోయినప్పటికీ గ్రామస్తుల సమస్యల విషయంలో శారద ప్రవీణ్ వెనుకడుగు వేయలేదు. పదవి పోయింది కదా ఎవరు ఎటు పోతే నాకేంటి అని అనుకోలేదు. అయితే తాజాగా ఆయన చేసిన ఒక పని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

చల్లపల్లి ఇందిరానగర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో ఆరు నుంచి పదవ తరగతి వరకు సుమారు 30 మంది నిరుపేద బాలికలు చదువుకుంటున్నారు. వారి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని శారదా ప్రవీణ్ ఒక్కొక్కరికి 5,500 చొప్పున తన సొంత ఖర్చులతో ఎల్ఐసి పాలసీలు చేయించారు. ఇది న్యూ ఎండోమెంట్ పాలసీ. ఒక్కో విద్యార్థికి 5,500 చొప్పున 17 సంవత్సరాలు చెల్లిస్తే 18వ సంవత్సరం మూడు లక్షల వరకు వస్తాయి. కనీసం రెండు సంవత్సరాలు బీమా చెల్లించిన విద్యార్థులకు ఉన్నత విద్య కోసం మూడు లక్షల వరకు రుణ సదుపాయాన్ని ఎల్ఐసి కల్పిస్తుంది. ఇప్పుడు మాత్రమే కాదు ప్రతి సంవత్సరం ప్రీమియం చెల్లిస్తామని శారదా ప్రవీణ్ ప్రకటించారు. ఆ విద్యార్థులకు ఎల్ఐసి బాండ్స్ అందజేశారు. మిగతా వారికి కూడా మార్చి ఐదులోగా బాండ్స్ అందిస్తామని ఆయన ప్రకటించారు. ప్రతి ఆడపిల్ల చదువుకోవాలి అనేదే తమ లక్ష్యమని.. ఈ కార్యక్రమాన్ని చేపట్టామని శారద ప్రవీణ్ ప్రకటించారు. కాగా మాజీ సర్పంచ్ చేసిన ఈ పని సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది. మాజీ సర్పంచ్ పై నెటిజన్ల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది.