Koneru Konappa: పార్లమెంట్ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ వాది పార్టీతో కలిసి పోటీ చేస్తామని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో.. భారత రాష్ట్ర సమితిలో కలకలం భారత రాష్ట్ర సమితిలో కలకలం నెలకొంది. కెసిఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కుమురం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేశారు. బీఎస్పీతో కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని కెసిఆర్ నిర్ణయించడాన్ని ఆయన తప్పుపట్టారు. కెసిఆర్ నిర్ణయం తనను బాధించిందని.. అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కోనప్ప ప్రకటించారు. కోనేరు కోనప్ప 2014 ఎన్నికల్లో బహుజన సమాజ్ వాది పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి.. తన సమీప తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కావేటి సమ్మయ్య పై ఎనిమిదివేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.. ఆ తర్వాత ఆయన భారత రాష్ట్ర సమితిలో చేరారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు పై 24 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోనప్ప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి హరీష్ బాబు చేతిలో మూడు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. వాస్తవానికి సిర్పూర్ స్థానంలో కోనప్పకు, బహుజన్ సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మధ్య పోటీ ఉంటుందని అందరూ భావించారు. కానీ అనుహ్యంగా హరీష్ బాబు విజయం సాధించారు. ఈ క్రమంలో మంగళవారం కెసిఆర్, ప్రవీణ్ కుమార్ భేటీ అయి.. పార్లమెంట్ ఎన్నికల్లో సంయుక్తంగా పోటీ చేస్తామని ప్రకటించడం.. అతి తన రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది కలిగిస్తుందని భావించి కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే సచివాలయానికి వచ్చి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు. త్వరలో ఆయన రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలుస్తోంది.
పార్టీ మార్పుకు సంబంధించి సెక్రటేరియట్ వద్ద విలేఖరులు కోనప్పను ప్రశ్నించగా… కార్యకర్తలతో సమావేశమైన తర్వాత ప్రకటిస్తానని వెల్లడించారు. కాగా ఇప్పటికే సిర్పూర్ ప్రాంతంలో కోనప్ప కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఫ్లెక్సీలు వెలిశాయి. కార్యకర్తలు కూడా సమావేశమై కాంగ్రెస్ పార్టీలోనే చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. శివరాత్రి తరువాత కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఆయన అనుచరులు అంటున్నారు.