Lok Sabha Elections: జాతీయస్థాయిలో మరోసారి బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి రావడం ఖాయం. దాదాపు సర్వేల్లో ఇదే తేలుతోంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే బిజెపి స్వీప్ చేస్తుందని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. ఇండియా టీవీ సి ఎన్ ఎక్స్ ఒపీనియన్ పోల్ నివేదిక ప్రకారం ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమి 378 సీట్లలో విజయం సాధిస్తుందని స్పష్టమైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కేవలం 98 స్థానాలకే పరిమితం కానుందని తేల్చింది. ఇప్పటివరకు ఏ కూటమిలో చేరని ప్రాంతీయ పార్టీలు 67 స్థానాల్లో గెలుపొందుతాయని సర్వే వెల్లడించింది.
ఎన్నికలు సమీపిస్తుండడంతో సర్వే సంస్థలు ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా ఇండియా కూటమి గత నెల 5 నుంచి 23 మధ్య మొత్తం 543 నియోజకవర్గాల్లో సర్వే చేపట్టింది. దేశవ్యాప్తంగా 1,62,900 మంది అభిప్రాయాలను సేకరించారు. వీరిలో 84,350 మంది పురుషులు, 78,550 మంది మహిళలు ఉన్నారు. ఎన్డీఏ కూటమికి భారీ విజయం దక్కినా, ప్రధాని అనుకున్నన్ని సీట్లు రావని తేలింది. ఎన్డీఏ కూటమిపరంగా 400 స్థానాల్లో గెలుచుకోవాలని బిజెపి లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఒక్క బీజేపీయే 370 స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే తాజా సర్వేలో బిజెపి 335, ఎన్డీఏ కూటమి పరంగా 378 స్థానాల్లో గెలుచుకునే అవకాశం ఉందని తేలడం విశేషం.
ఎన్డీఏ కూటమి ఏడు రాష్ట్రాల్లో స్వీప్ చేస్తుందని ఈ సర్వే తేల్చింది. గుజరాత్ లో 26, మధ్యప్రదేశ్ లో 29, రాజస్థాన్ లో 25, హర్యానాలో 10, ఢిల్లీలో 7, ఉత్తరాఖండ్ లో ఐదు, హిమాచల్ ప్రదేశ్ లో నాలుగు ఎంపీ స్థానాలను ఎన్డీఏ కైవసం చేసుకోనుందని ఈ సర్వే తేల్చి చెప్పడం విశేషం. మిగతా ప్రాంతీయ పార్టీలకు సంబంధించి పశ్చిమ బెంగాల్లో 42 స్థానాలకు గాను టీఎంసీ 21చోట్ల, తమిళనాడులో 39 స్థానాలకు గాను డిఎంకె 20 చోట్ల, ఏపీలో 25 స్థానాలకు గాను వైసీపీ 15, టిడిపి 10 చోట్ల, ఒడిస్సా లోని 21 స్థానాలకు గాను బిజెడి పది చోట్ల విజయం సాధించే అవకాశం ఉంది. తెలంగాణలో మొత్తం 17 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ 9 చోట్ల, బిజెపి ఐదుచోట్ల, బిఆర్ఎస్ రెండు చోట్ల, ఎంఐఎం ఒక్కచోట గెలిచే ఛాన్స్ ఉన్నట్లు ఇండియా టీవీ సర్వే తేల్చి చెప్పింది.