Malla Reddy: మరో భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డి.. పోలీసుల ఎంట్రీ..ఒక్కసారిగా మారిన సీన్

హైదరాబాదులోని సుచిత్ర పరిధిలో సర్వేనెంబర్ 82 లో తనకున్న భూమిని కొంతమంది కబ్జా చేశారని మల్లారెడ్డి ఆరోపించారు. శనివారం ఆ ప్రాంతానికి చేరుకొని.. ఆ భూమి చుట్టూ నిర్మించిన కంచెను తొలగించడం మొదలుపెట్టారు.

Written By: Anabothula Bhaskar, Updated On : May 18, 2024 5:24 pm

Malla Reddy

Follow us on

Malla Reddy: పాలమ్మిన, పూలమ్మిన, కష్టపడ్డ, పైకొచ్చిన.. అంటూ ఒక్కసారిగా సోషల్ మీడియాలో స్టార్ అయిపోయిన చామకూర మల్లారెడ్డి అలియాస్ మాజీ మంత్రి మల్లారెడ్డి మరో భూ వివాదంలో చిక్కుకున్నారు. గతంలో మల్లా రెడ్డి మీద అనేక భూ వివాదాలు ఉన్నాయి. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి.. గతంలో మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్నప్పుడు మల్లా రెడ్డి మీద అనేక ఆరోపణలు చేశారు. కొన్నింటికి రుజువులు కూడా చూపించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మల్లారెడ్డి ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చేయించారు. ఇప్పటికీ ఆ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. వాటిని మర్చిపోకముందే మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

హైదరాబాదులోని సుచిత్ర పరిధిలో సర్వేనెంబర్ 82 లో తనకున్న భూమిని కొంతమంది కబ్జా చేశారని మల్లారెడ్డి ఆరోపించారు. శనివారం ఆ ప్రాంతానికి చేరుకొని.. ఆ భూమి చుట్టూ నిర్మించిన కంచెను తొలగించడం మొదలుపెట్టారు. అక్రమంగా వేసిన ఫెన్సింగ్ మొత్తాన్ని కూల్చాలని తన అనుచరులకు చెప్పి.. మొత్తం పడగొట్టించారు. దీంతో ఈ విషయం పోలీసులకు తెలిసింది. వారు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మల్లారెడ్డి ఊరుకోలేదు. పోలీసుల సమక్షంలోనే ఆయన అనుచరులు ఫెన్సింగ్ మొత్తం పడగొట్టారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారితో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. తన భూమిలో అక్రమంగా ఫెన్సింగ్ వేస్తే ఎలా ఊరుకుంటానని మల్లారెడ్డి పోలీసులను ఎదురు ప్రశ్నించారు. “నా మీద కేసు పెడితే పెట్టుకోండి.. నా భూమిని నేను కాపాడుకుంటానంటూ” మల్లారెడ్డి అన్నారు. దీంతో పోలీసులు ఆయనను, ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వివాదం పోలీస్ స్టేషన్ లో నడుస్తోంది.

అయితే సుచిత్ర పరిధిలోని భూమి తమది అంటూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన వారు బయటికి వచ్చారు. వారంతా దాదాపు 15 మంది దాకా ఉన్నారు. గతంలో తాము ఒక్కొక్కరం 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమి కొన్నామన్నారు. కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీని కూడా వారు పోలీసులకు చూపించారు. ఆ స్థలంపై కోర్టు ఆర్డర్ ఉన్నందున సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని పోలీసులు వారికి సూచించారు. ప్రస్తుతం మల్లారెడ్డి బషీర్ బాద్ పోలీసుల అదుపులో ఉన్నారు. భూ వివాదానికి సంబంధించి ఇరు వర్గాల వారు పోలీస్ స్టేషన్లో చర్చలు జరుపుతున్నారు. కాగా, మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది.. ఆయనను పోలీసులు అరెస్టు చేశారని మీడియా హోరెత్తించింది.