Kalvakuntla Kanna Rao: కేసీఆర్ అన్న కుమారుడు అంత పని చేశాడా? రేవంత్ తదుపరి స్టెప్ ఏంటి?

కన్నారావు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మన్నెగూడలో రెండు ఎకరాల భూమి కబ్జా చేశారనే అభియోగంతో పోలీసులు అరెస్టు చేశారు. ఓఎస్ఆర్ ప్రాజెక్టు అనే సంస్థ ఎల్ఎల్పీ అనే వెంచర్ లో మన్నెగూడ లో సర్వేనెంబర్ "32/రు" లో సుమారు రెండు ఎకరాల స్థలం ఉంది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 4, 2024 8:21 am

Kalvakuntla Kanna Rao

Follow us on

Kalvakuntla Kanna Rao: భారత రాష్ట్ర సమితికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీని టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలమైన అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కవితను ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో మున్ముందు రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు గానీ.. ప్రస్తుతానికైతే కవిత బయటకు వచ్చే పరిస్థితులు లేవని అంటున్నారు. ఇది ఇలా ఉండగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని మన్నెగూడలో భూ వివాదానికి సంబంధించి కల్వకుంట్ల కన్నారావును రాష్ట్ర పోలీసులు ఏ -1 గా పేర్కొంటూ అరెస్టు చేశారు. కోర్టులో పోలీసులు హాజరు పరిస్తే.. న్యాయస్థానం అతడికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.. ప్రస్తుతం అతడు చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

కన్నారావు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మన్నెగూడలో రెండు ఎకరాల భూమి కబ్జా చేశారనే అభియోగంతో పోలీసులు అరెస్టు చేశారు. ఓఎస్ఆర్ ప్రాజెక్టు అనే సంస్థ ఎల్ఎల్పీ అనే వెంచర్ లో మన్నెగూడ లో సర్వేనెంబర్ “32/రు” లో సుమారు రెండు ఎకరాల స్థలం ఉంది. గత నెలలో తమకు చెందిన ఈ భూమిని కన్నరావు కబ్జా చేసేందుకు యత్నించారని.. అడ్డు వస్తే చంపేస్తామని బెదిరించారని బండోజు శ్రీనివాస్ అనే వ్యక్తి ఆదిభట్ల పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ కూడా.. మళ్లీ ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు ఏర్పించాడని గత నెల మూడున మరోసారి అదే పోలీసులకు కంప్లైంట్ చేశాడు.

పోలీసులు విచారణ నిర్వహించగా ఓఎస్ఆర్ ప్రాజెక్టు సంస్థకు చెందిన ప్రతినిధులు.. ఆ భూమిలోని కంటైనర్ లో నివసిస్తుండగా… కల్వకుంట్ల కన్నారావు, జక్కిడి సురేందర్, జక్కిడి హరినాథ్, శివ డానియల్, మరికొందరు వారిని బెదిరించినట్టు తెలుస్తోంది..ఎక్స్ క వేటర్ ద్వారా భూమిని కబ్జా చేసేందుకు యత్నించారని బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులకు ఈ స్థలం విషయంలో ఫిర్యాదుల మీద ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగారు. మొత్తం 25 మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో కన్నారావు పాత్ర కీలకమని పోలీసుల విచారణలో తేలింది.

కన్నారావు పై 147, 148, 447, 427, 307, 436, 506 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.. ఇప్పటివరకు ఈ భూ వివాదం కేసులో 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే మొన్నటిదాకా కన్నారావు విదేశాల్లో ఉండడంతో ఆయనపై లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. ఈ కేసులో కన్నారావు ముందస్తు బెయిల్ కోసం రెండు సార్లు ప్రయత్నించగా కోర్టు తోసి పుచ్చింది. దీంతో బుధవారం పోలీసులు కన్నారావును అరెస్టు చేశారు.. రిమాండ్ కు తరలించారు. “బండోజు శ్రీనివాస్ తన భూమిని కన్నారావు కబ్జా చేసేందుకు యత్నించాడని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదైనప్పటికీ మళ్లీ కబ్జాకు యత్నించాడని… గత నెల 3న మరో ఫిర్యాదు చేశాడు. ఇందులో కల్వకుంట్ల కన్నారావు, సురేందర్, హరినాథ్, శివ, డానియల్ తో పాటు కొంతమంది నిందితులుగా ఉన్నట్టు మా విచారణలో తేలింది. ఈ కేసులో ఇప్పటివరకు 9 మందిని అరెస్టు చేశాం. కన్నారావు పై పలు సెక్షన్ల కింద కేసులో నమోదు చేశామని” ఆదిభట్ల సీఐ రాఘవేందర్ రెడ్డి తెలిపారు. కాగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవకతవకలపై సీరియస్ గా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్ ను ఆ కోణంలోనే చూడాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కన్నారావు అరెస్టుతోనే ఈ వ్యవహారం ఆగదని.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూకబ్జాలపై మరింత లోతుగా దర్యాప్తు జరుగుతుందని వారు చెబుతున్నారు.