Sunil Narine: నరైన్.. నీకు దయా దాక్షిణ్యం లేదా?

నరైన్ బ్యాటింగ్ వల్ల కోల్ కతా జట్టు పవర్ ప్లే లో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 88 పరుగులు చేసింది. నరైన్ 85 పరుగుల వద్ద అవుట్ అయినప్పటికీ కోల్ కతా జట్టు జోరు ఆగలేదు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 4, 2024 8:36 am

Sunil Narine

Follow us on

Sunil Narine: ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కోల్ కతా జట్టు 106 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కోల్ కతా ఓపెనర్ సునీల్ నరైన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌలర్ ఎవరనేది చూడకుండా ఫోర్లు, సిక్సర్లు బాదాడు. 38 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 85 పరుగులు చేశాడు. నరైన్ తో పాటు రఘు వంశీ 54, రస్సెల్ 41, రింకు సింగ్ 26 పరుగులు చేయడంతో కోల్ కతా జట్టు స్కోర్ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్లో నరైన్ బ్యాట్ తో మైదానంలో తాండవం చేశాడని చెప్పొచ్చు.. ముఖ్యంగా అతడు ఇశాంత్ శర్మ బౌలింగ్ లో ఆకాశమేహద్దుగా చెలరేగాడు. 21 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ వైపు కదిలినప్పటికీ 85 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. వాస్తవానికి అతడు అదే జోరు కొనసాగిస్తే ఈ సీజన్లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్ గా రికార్డు సృష్టించేవాడు. ముఖ్యంగా ఇశాంత్ శర్మ వేసిన నాలుగో ఓవర్లో నరైన్ మైదానంలో పెను విధ్వంసం సృష్టించాడు. వరుసగా 6, 6, 4, 0, 6, 4 కొట్టి ఏకంగా 26 పరుగులు రాబట్టాడు. ఈ ఓవర్లో తొలి బంతిని ఓవర్ మిడ్ ఆఫ్ మీదుగా నరైన్ సిక్స్ కొట్టాడు.. అనంతరం మరుసటి బంతిని ఇషాంత్ లో- ఫుల్ టాస్ గా వేశాడు. దానిని కూడా నరైన్ సిక్స్ కొట్టాడు. మూడో బంతిని డ్రైవ్ షాట్ రూపంలో బౌండరీకి తరలించాడు. నాలుగో బంతిని డాట్ గా వేసిన ఇషాంత్.. ఐదో బంతిని మళ్లీ నరైన్ ఓవర్ మిడ్ ఆఫ్ దిశగా సిక్స్ కొట్టాడు. ఇక చివరి బంతిని బ్యాట్ ఎడ్జ్ తో టచ్ చేయడంతో అది నేరుగా బౌండరీను తాకింది.. ఇలా చూస్తుండగానే నరైన్ మైదానంలో తన బ్యాట్ తో అలజడి సృష్టించాడు. ఢిల్లీ జట్టుకు చేయాల్సిన నష్టం చేసి వెళ్లిపోయాడు.

నరైన్ బ్యాటింగ్ వల్ల కోల్ కతా జట్టు పవర్ ప్లే లో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 88 పరుగులు చేసింది. నరైన్ 85 పరుగుల వద్ద అవుట్ అయినప్పటికీ కోల్ కతా జట్టు జోరు ఆగలేదు. 10 ఓవర్లలో క్రికెట్ నష్టానికి 135 పరుగులు చేసిన కోల్ కతా.. ఆ తర్వాత మరింత రెచ్చిపోయింది. మిగతా 10 ఓవర్లలో 137 పరుగులు చేసింది. మొత్తంగా 272 పరుగుల స్కోరు సాధించి.. ఢిల్లీ ఎదుట 273 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు 17.2 ఓవర్లలో 166 పరుగులకే ఆల్ అవుట్ అయింది. కాగా, నరైన్ బ్యాటింగ్ నేపథ్యంలో సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.. ” నరైన్ కు దయాదాక్షిణ్యం లేదు. అలా విరుచుకుపడి ఢిల్లీ బౌలర్ ఇశాంత్ శర్మకు ఆవేదన మిగిలించాడంటూ” వ్యాఖ్యలు చేస్తున్నారు.