HomeతెలంగాణNew Ration Cards: కొత్త రేషన్‌ కార్డుల జారీకి ముహూర్తం ఫిక్స్‌.. అర్హులు వీరే..

New Ration Cards: కొత్త రేషన్‌ కార్డుల జారీకి ముహూర్తం ఫిక్స్‌.. అర్హులు వీరే..

New Ration Cards: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా ఆంధ్రప్రదేశ్‌లో జారీ చేసిన రేషన్‌ కార్డులనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయలేదు. తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్‌ ప్రభుత్వం కూడా ఉప ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో ఓట్ల కోసం రేషన్‌ కార్డులు జారీ చేశారు. రాష్ట్రమంతా అర్హులు ఉన్నా రేషన్‌ కార్డులు జారీ చేయలేదు. ఇది కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమికి కారణం. కాంగ్రెస్‌ తాము అధికారంలోకి వస్తే కొత్త రేషన్‌ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చింది. పది నెలల క్రితం కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. రేవంత్‌రెడ్డి సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ వస్తోంది. ఇందులో భాగంగా కొత్త రేషన్‌ కార్డుల జారీకి కూడా కేబినెట్‌ సబ్‌ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇదివరకు సమావేశమై ఎవరెవరికి రేషన్‌కార్డులు ఇవ్వాలన్న అంశంపై చర్చించింది. తాజాగా సోమవారం(సెప్టెంబర్‌ 16న) మరోమారు సమావేశమైన కమిటీ రేషన్‌ కార్డుల జారీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు అక్టోబర్‌ నుంచి కొత్త రేషన్‌ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. రేషన్‌ కార్డులను విభజించి స్మార్ట్‌ రేషన్‌ కార్డులు, స్మార్ట్‌ హెల్త్‌ కార్డులు వేర్వేరుగా జారీ చేస్తామని ప్రకటించారు. రేషన్‌ బియ్యం అవసరం లేకున్నా ఆరోగ్యశ్రీ ప్రయోజనాలు పొందేలా స్మార్ట్‌ హెల్త్‌ కార్డులు ఇస్తామని ప్రకటించారు.

అర్హతలపై ఈనెల 21న తుది నిర్ణయం..
తెల్ల రేషన్‌ కార్డుకు ఎవరు అర్హులు అనే అంశంపై ఇప్పటికే చర్చించామని ఈనెల 21న మరోమారు కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశమై విధి విధానాలను ఖరారు చేస్తామని వెల్లడించారు. తాజా సమావేశంలో దరఖాస్తుదారుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతంలో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతంలో రూ.2 లక్షలుగా నిర్ణయించామన్నారు. 3.5 ఎకరాల తరి, 7.5 ఎకరాల మెట్ట భూమి ఉన్నవారు కూడా అర్హులే అని పేర్కొన్నారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటకలో అర్హతలు పరిశీలించామని, అర్హతల్లో మార్పులపై ఈనెల 21న తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

ప్రస్తుతం 91.68 లక్షల కార్డులు..
ఇదిలా ఉంటే.. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 91,68,231 రేషన్‌ కార్డులు ఉన్నాయి. గత ప్రభుత్వం కొత్తగా వాటిని రద్దు చేసి కొత్తగా 89,21,907 కార్డులు జారీ చేసింది. దీంతో 2,879,36,50 మంది లబ్ది పొందుతున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. వార్షికాదాయం పాతదే నిర్ణయించారు. పరిమితి పెంచితే కొత్తగా అర్హులు పెరుగుతారు. పెంచాలనే డిమాండ్‌ ఉంది. మరి కేబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయం ఎలా ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది.

జనవరి నుంచి సన్న బియ్యం..
ఇదిలా ఉంటే.. 2025, జనవరి నుంచి తెల్ల రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పేదలు బియ్యం విక్రయించకుండా, అందరూ తినేలా బియ్యం అందిస్తామన్నారు. దొడ్డు బియ్యం పంపిణీతో రీసైక్లింగ్‌ అవుతుందని పేర్కొన్నారు. సన్న బియ్యంతో రీసైక్లింగ్, బ్లాక్‌ మార్కెట్‌ దందా ఆగిపోతుందని తెలిపారు. వానాకాలంలో పండించే సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్‌ కూడా ఇస్తామని వెల్లడించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version