TV5: మిగతా ఉద్యోగాల కంటే మీడియాలో ఉద్యోగాలకు గ్యారెంటీ ఉండదు. ఎప్పుడు బయటికి వెళ్ళమంటారో తెలియదు. జీతాలు సక్రమంగా వస్తాయో, రావో తెలియదు. అందువల్లే పాత్రికేయ ఉద్యోగం అనేది దినదిన గండం లాంటిది. కోవిడ్ సమయంలో ఎన్నో సంస్థలు పాత్రికేయులను అడ్డంగా ఉద్యోగాలలోంచి తొలగించాయి. ఫలితంగా చాలామంది రోడ్డున పడ్డారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇలాంటి సమయంలో ఆయా యాజమాన్యాలు వారికి అండగా నిలిచింది దాదాపు శూన్యం. అలా చనిపోయిన కుటుంబాలకు కాస్తలో కాస్త ఆర్థిక భరోసా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మాత్రమే. బయట ప్రపంచానికి ఎన్నో నీతులు చెబుతుంటారు కానీ.. మీడియాను నడిపే సంస్థలు మాత్రం ఆవేవీ పాటించవు. ముఖ్యంగా ఉద్యోగుల విషయంలో కార్మిక చట్టాలను ఏమాత్రం అమలు చేయవు. అందుకే ప్రస్తుత కాలంలో నాణ్యమైన జర్నలిస్టులు పూర్తిగా తగ్గిపోయారు.
కోవిడ్ సమయంలో..
కోవిడ్ సమయంలో ఎన్నో సంస్థలు పాత్రికేయులను అడ్డగోలుగా తొలగించాయి. కొన్ని సంస్థలు అయితే వెల్ఫేర్ ఫండ్ లో ఒక్క రూపాయి కూడా చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఇవ్వలేదు. పైగా ఆ సమయంలో సగం వేతనాలు మాత్రమే మిగిలిన ఉద్యోగులకు ఇచ్చాయి. ఇక ఇంక్రిమెంట్లు అనేవి దేవుడెరుగు. వెబ్ జర్నలిజం దూసుకు వచ్చిన తర్వాత.. ఆ సమయంలో వారిని కాస్తో కూస్తో అదే కాపాడింది. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పాత్రికేయులకు అండగా నిలిచిన సంస్థలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అయితే ఈ జాబితాలో టీవీ5 ఛానల్ ముందు వరుసలో ఉంటుంది.. ఎందుకంటే ఆ ఛానల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం అలాంటిది.
అండగా నిలిచింది
టీవీ5 ఛానల్ ను బి ఆర్ నాయుడు నిర్వహిస్తున్నారు. ఈ ఛానల్ తెలుగు, కన్నడ భాషల్లో ప్రసారాలు సాగిస్తోంది. ఈ ఛానల్ లో ఎక్కువగా తెలుగుదేశం పార్టీ అనుకూల వార్తలే ప్రసరమవుతుంటాయి. ఇక ఇటీవల ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. టీవీ5 ఛానల్ ఆఫీసులో ఏకంగా కేక్ కట్ చేశారంటే ఏ స్థాయిలో పసుపు భజన చేస్తోందో అర్థం చేసుకోవచ్చు.. అయితే ఆ ఛానల్ లో పనిచేసే వీడియో జర్నలిస్టు ఇటీవల కన్నుమూశాడు. అయితే ఆ విషయం బీఆర్ నాయుడు దృష్టికి వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఆయన వెంటనే స్పందించారు. ఆ వీడియో జర్నలిస్టు మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి అండగా నిలిచారు. సంస్థ తరఫున ఐదు లక్షలను ఎక్స్ గ్రేషియా కింద చెల్లిస్తామని ప్రకటించారు. ఆయన కుటుంబానికి భవిష్యత్ కాలంలోనూ అండగా ఉంటామని పేర్కొన్నారు. టీవీ 5 చంద్రబాబు భజన చేస్తూ ఉండవచ్చు.. ఛానల్ నిండా పసుపు రంగును పులుము కోవచ్చు. ఆ ఛానల్ యజమాని బిఆర్ నాయుడు పై ఎన్నో ఆరోపణలు ఉండొచ్చు. కానీ సంస్థలో పనిచేసే ఉద్యోగం కోసం ఆయన అండగా నిలిచిన తీరును మాత్రం కచ్చితంగా అభినందించాల్సిందే. ఇక మిగతా యాజమాన్యాలు అంటారా.. ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇటీవల ఎన్నికల్లో ఓ ఛానల్ ఫోటోగ్రాఫర్ తీవ్రంగా గాయపడితే రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు.. చివరికి వైద్యం చేయించి యాజమాన్యం చేతులు దులుపుకుంది.