MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న తెలంగాణ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు పొడిగించింది. జూన్ 3వ తేదీ వరకు కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గడువు ముగియడంతో..
ఈడీ, సీబీఐ కేసుల్లో గతంలో కోర్టు విధించిన జ్యుడీషియల్ కస్టడీ సోమవారం(మే 20)తో ముగిసింది. దీంతో తిహార్ జైలు సిబ్బంది ట్రయల్ కోర్టులోని స్పెషల్ జడ్జి కావేరి బవేజా ఎదుట హాజరు పర్చాలని నిర్ణయించారు. అయితే భౌతికంగా కాకుండా వర్చువల్‌గా కవితను మధ్యాహ్నం హాజరు పర్చారు. విచారణ చేసిన జడ్జి కస్టడీని జూన్ 3 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు.
మార్చి 15న అరెస్ట్..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈ ఏడాది మార్చి 15న ఈడీ కవితను అరెస్టు చేసింది. ముందుగా హైదరాబాద్‌లోని ఆమె ఇంట్లో సోదాలు చేసిన అధికారులు సాయంత్రం అరెస్టు చేసినట్లు ప్రకటించారు. మాచ్చి 16న ట్రయల్ కోర్టులో హాజరు పర్చారు. స్కాంలో కవితను కింగ్ పిన్‌గా ఈడీ కోర్టుకు తెలిపింది. కవిత నేతృత్వంలోనే సౌత్ 6గూపు నుంచి రూ.100 కోట్లు ఆప్ కీలక నేతలకు చేరాయని ఆరోపించింది. ఈ సమాచారం రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరింది. దీంతో రెండు దఫాలుగా 10 రోజులు కవితను ఈడీ కస్టడీలోకి తీసుకుంది. తర్వాత మార్చి 26న కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్..
ఇక తిహార్ జైల్లో ఉన్న కవితను ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. మూడు రోజుల కస్టడీ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా సీబీఐ కేసులోనూ జ్యుడీషియల్ కస్టడీ విధించింది. తాజాగా రెండు కేసుల్లోనూ కవిత కస్టడీని కోర్టు మరో 14 రోజులు పొడిగించింది.