Private Medical Colleges : బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో అనేక అవినీతి, అక్రమాలు జరిగాయని కేంద్ర దర్యాప్తు సంస్థలకు రాజకీయపార్టీతోపాటు పలువురు ఫిర్యాదులు చేశారు. దీంతో సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలు దాడులు మొదలు పెట్టాయి. చివరకు అప్పటి సీఎం కేసీఆర్ ఇంటికి కూడా సీబీఐ, ఈడీ అధికారులు వచ్చారు. దీంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను రాష్ట్రంలోకి అనుమతి నిరాకరిస్తూ రహస్యంగా జీవో జారీ చేసింది. అయితే ఐటీ దాడులు మాత్రం ఆగలేదు. ఎన్నికల సమయంలో ఐటీ పలువురు బీఆర్‌ఎస్ నేతలతోపాటు, కాంగ్రెస్ నేతల ఇళ్లపై దాడిచేసింది. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో ఈడీ, సీబీఐ కూడా రాష్ట్రంలోకి వస్తున్నాయి. తాజాగా మెడికల్ సీట్ల స్కామ్‌లో అవకతవకలపై ఇప్పటికే రాష్ట్రంలోని పలు కళాశాలలను సీబీఐ, ఈడీ అధికారులు తనిఖీ చేశారు. తాజాగా ఈడీ చర్యలకు దిగింది. మూడు మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఆస్తులను సీజ్ చేసింది.
రూ.9.71 కోట్ల ఆస్తులు అటాచ్..
మెడికల్ సీట్లలో అక్రమాలకు పాల్పడిన మూడు మెడికల్ కాలేజీలకు చెందిన రూ.9.71 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇందులో మల్లారెడ్డి కళాశాలకు చెందిన రూ.2.89 కోట్లు, ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజీకి చెందిన రూ.2.01 కోట్లు, కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీకి చెందిన రూ.3.33 కుట్లు ఆస్తులను అటాచ్ చేసింది.
మనీ లాండరింగ్ ఆరోపణలు..
మెడికల్ సీట్లను బ్లాక్ చేసి పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలకు పాల్పడినట్లు ఆరోపణలపై ఈడీ అధికారులు గతంలో రంగంలోకి దిగారు. కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్ వరంగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు కూడా నమోదు చేశారు. దీని ఆధారంగా మెడికల్ కాలేజీలపై మెరుపు దాడులు చేసిన ఈడీ.. కీలక సమాచారం సేకరించింది. నీట్ పీజీ మెరిట్ ఆధారంగా కన్వీనర్ కోటా లేదాంటే ఫ్రీ సీట్ల కింద చాలా వరకు ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థుల పేర్లతో బ్లాక్ చేసినట్లు గుర్తించింది.
ఆరేళ్లు అవకతవకలు..
గతేడాది జూన్‌లో మల్లారెడ్డి నివాసంతోపాటు మెడికల్ కాలేజీ, ఆఫీసులపై ఈడీ దాడిచేసింది. కీలక పత్రాలు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకుంది. వేర్వేరు మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో 2016 నుంచి 2022 వరకు అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. ఎంఎన్‌ఆర్, చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీల్లో చేపట్టిన తనిఖీల్లోనూ కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. తాజాగా ఆస్తులను ఆటాచ్ చేసింది.