Cabinet Sub-Committee : అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో కూటమి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సానుకూల నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తోంది. అటు కేంద్రం సైతం తన వంతు సహకారం అందిస్తోంది. ఏకంగా బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయల సాయం ప్రకటించింది.రవాణా, రైలు ప్రాజెక్టులను సైతం కేటాయించింది. అందుకే కూటమి సర్కార్ రెట్టింపు ఉత్సాహంతో జనవరి నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించాలని భావిస్తోంది. ఈ తరుణంలో అమరావతిలో భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉప సంఘం సమావేశం అయింది. పలు సంస్థలకు కేటాయింపుల పైన ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి అమరావతి రాజధాని నిర్మాణానికి పూనుకుంది. ఆ సమయంలో పలు సంస్థలకు అమరావతిలో భూములు కేటాయించింది. కానీ వైసీపీ ప్రభుత్వం పూర్తిగా అమరావతిని నిర్వీర్యం చేసింది. ఇప్పుడు తాజాగా దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం అదే సంస్థలకు భూ కేటాయింపులు చేయాల్సి వస్తోంది.
* బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి భూ కేటాయింపు
ప్రధానంగా రాజధాని ప్రాంతంలో పలు కేంద్ర రంగ సంస్థలతో పాటు వివిధ శాఖలకు భూ కేటాయింపులు చేయాల్సి ఉంది. తాజాగా సమావేశమైన మంత్రివర్గ ఉప సంఘం రాజధాని ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రి తో పాటు మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం 20 ఎకరాల భూమి కేటాయింపునకు ఆమోదం తెలిపింది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి 15 ఎకరాలు కేటాయించింది. బ్రహ్మకుమారి ఎడ్యుకేషనల్ సొసైటీ కి 10 ఎకరాలు కేటాయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. మరోవైపు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్ కు ఐదు ఎకరాలు, ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి 8 ఎకరాలు కేటాయించారు. అలాగే ఎల్ అండ్ టి స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి ఐదు ఎకరాలు కేటాయించారు. టీటీడీకి గతంలోనే 25 ఎకరాలను కేటాయించారు.ఇప్పుడు మంత్రివర్గ ఉప సంఘం దానికి అంగీకారం తెలిపింది.గతంలో 131 మందికి భూములు కేటాయించారు. ఇప్పుడు వారిని కొనసాగిస్తూనే కొత్త వారికి భూములు కేటాయించేందుకు నిర్ణయించారు.గతంలో ఇచ్చిన వారికి అప్పటి ధరలకు పరిమితం చేస్తామని..ఇప్పుడు ఇచ్చిన వారికి కొత్త ధరలు అమలు చేస్తామని.. ఒక పాలసీని తయారు చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు.
* వచ్చే నెలాఖరులోగా కేటాయింపులు
మంత్రివర్గ ఉప సంఘం ఆమోదించిన విధంగా సంస్థలకు వచ్చే నెలాఖరులోగా భూ కేటాయింపులు పూర్తవ్వాలని అధికారులు సూచించారు. మరోవైపు రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి మౌలిక వసతుల పైన కూడా మంత్రివర్గ ఉప సంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. డిసెంబర్ నెల చివరి నాటికి 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, మిగతా టవర్ల నిర్మాణాలకు టెండర్లు పూర్తవుతాయని మంత్రి నారాయణ వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో జనవరిలో పూర్తిస్థాయిలో అమరావతి రాజధాని నిర్మాణ పనులను ప్రారంభిస్తామని ప్రకటించారు. ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలకు భూ కేటాయింపులు, అదే సమయంలో రాజధానిలో మౌలిక వసతులకు సంబంధించి పనులు చేపట్టనున్నారు