KTR: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అనేక కంపెనీలను తీసుకువచ్చింది. ఇది ఎవరూ కాదనలేని నిజం. ఈ కారణంగానే 2023లో రాష్ట్రమతా బీఆర్‌ఎస్ ఓడిపోయినా జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రం ఓడిపోలేదు. అయితే గత ప్రభుత్వం హయాంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ రేసు వ్యవహారం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏమేరకు పెంచిందో ఎవరికీ తెలియదు. కానీ, ప్రభుత్వ అనుమతి లేకుండా ఓ విదేశీ కంపెనీకి రూ.56 కోట్లు కేటాయించడం మాత్రం ఇప్పుడు బీఆర్‌ఎస్ పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చింది. నాటి మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చుట్టూ ఈ ఫార్ములా ఉచ్చు బిగుస్తోంది. గవర్నర్ విచారణకు అనుమతి ఇవ్వడం.. ఆ వెంటనే ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం చకచకా జరిగిపోయాయి. అయితే ఆ వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. వివచాలు ఇవ్వాలని ఏసీబీకి లేఖ రాసింది.
తాజాగ నోటీసులు..
ఏసీబీ ఎఫ్‌ఐఆర్ కాపీతోపాటు కేసు వివరాలు తెలుసుకున్న ఈడీ తాజాగా దూకుడు పెంచింది. ఏసీబీ కన్నా ముందే విచారణ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. 2025, జనవరి 7న విచారణకు రావాలని పిలిచింది. సీనియన్ ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్.రెడ్డికి సైతం ఈడీ నోటీసులు జారీ చేసింది. వారిని జనవరి 2, తేదీల్లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.
పీఎంఎల్‌ఏ కింద విచారణ..
ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. ఈ కేసులో ఉన్న ముగ్గురినీ ఈడీ పీఎంఎల్‌ఏ కింద ఈడీ విచారణ చేసే అవకాశం ఉంది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంతో వీరంతా ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈడీ గుర్తించింది. ఎఫ్‌ఈవోకు నగదు వబిలీతోపాటు ఆర్థిక అవకతవకలు జరిగినట్లు అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
విచారణకు కోర్టు ఓకే..
ఇదిలా ఉంటే కేటీఆర్ ఎఫ్‌ఐఆర్ కొట్టేయాలని కోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టు విచారణకు అనుమతి ఇచ్చింది. అరెస్టే చేయకుండా మాత్రమే ఆదేశాలు ఇచ్చింది. డిసెంబర్ 31 వరకు అరెస్ట నుంచి కేటీఆర్ ఊరట పొందారు. తాజాగా ఈడీ రంగంలోకి దిగిన నేపథ్యంలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతుంది.. అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా.. ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఇంకా ఏమైనా ఇతర అంశాలు వెలుగులోకి వస్తాయా అన్నది జనవరి 7వ తేదీ వరకు వేచి చూడాలి.