Ind Vs Aus 4th Test: మెల్ బోర్న్ మైదానంలో హాఫ్ సెంచరీ చేసిన తర్వాత పుష్ప రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చాడు. బ్యాట్ తో నీ యవ్వ తగ్గేదేలే అన్నట్టుగా మేనరిజం ప్రదర్శించాడు. అది చూడ్డానికి ఎంత బాగుందంటే.. ఆస్ట్రేలియా మైదానంపై మూడోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచినంత బాగుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో విజయం సాధించినంత సమ్మగా ఉంది.. ఎందుకంటే ఈ టోర్నీలో నితీష్ కుమార్ రెడ్డి అదరగొడుతున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడుతున్నాడు. భారీగా పరుగులు చేయకున్నా.. తన వంతు బాధ్యతకు మించి నిర్వర్తిస్తున్నాడు. గొప్ప గొప్ప ఆటగాళ్లు విఫలమైన చోట తాను మాత్రం దృఢంగా ఉండగలుగుతున్నాడు..
ఇవీ అతడు ఆడిన ఇన్నింగ్స్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్ట్ పెర్త్ లో జరిగింది. పెర్త్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ 180 పరుగులకు ఆల్ అవుట్ అయింది. యశస్వి జైస్వాల్ 0, పడిక్కల్ 0, కోహ్లీ 5, వాషింగ్టన్ సుందర్ 4 విఫలమైన చోట నితీష్ కుమార్ రెడ్డి నిలబడ్డాడు. 41 రన్స్ చేసి.. జట్టుకు ఆపద్బాంధవుడిగా నిలిచాడు.. అతడు చేసిన పరుగులు టీమిండియా విజయానికి దోహదం చేశాయి. ఇదే టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో 27 బంతుల్లో 38 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. పెర్త్ టెస్ట్ అనంతరం ఆస్ట్రేలియా పీఎం -11 జట్టుతో జరిగిన మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి 42 రన్స్ చేశాడు.
కొండంత బలాన్ని ఇచ్చాడు
అడిలైడ్ టెస్ట్ లోనూ సహచర ఆటగాళ్లు విఫలమైనచోట.. 42 పరుగులు చేసి.. జట్టు పరువును నితీష్ కుమార్ రెడ్డి కాపాడాడు. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు తరఫున టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇదే టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లోనూ నితీష్ కుమార్ రెడ్డి 42 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అంతేకాదు టీమ్ ఇండియాకు ఇన్నింగ్స్ ఓటమిని తప్పించాడు. బ్రిస్ బేన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 16 పరుగులు చేసినప్పటికీ.. అవి కూడా జట్టుకు ఎంతో ఉపకరించాయి.. ఇక ప్రస్తుతం మెల్ బోర్న్ మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి 71*పరుగులు చేశాడు. మరో ఆటగాడు వాషింగ్టన్ సుందర్ 35* పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. వీరిద్దరూ కలిసి ఎనిమిదో వికెట్ కు ఇప్పటివరకు 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇది టీమిండియా కొండంత బలాన్ని ఇచ్చింది. ఇక ప్రస్తుతం టీమిండియా 167 పరుగులు వెనుకబడి ఉంది.. నితీష్ కుమార్ రెడ్డి దూకుడు వల్ల మెల్ బోర్న్ మైదానంలో టీమిండియా ఫాలో ఆన్ గండాన్ని తప్పించుకుంది.
Nitish Kumar reddy PUSHPA mannerism with bat #Pushpa2TheRule pic.twitter.com/15MhTJF39A
— Musugu Donga (@MusuguDhonga) December 28, 2024