Real Estate
Real Estate: ఇల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరి కల. ఇందుకోసం కనీసం గుంట, గుంటనరైనా కావాలి. గత ప్రభుత్వ కాలంలో తెలంగాణలో రియల్ ఎస్టేట్ అమాంతం పెరిగింది. ఇందుకు కారణాలు అనేకం ఉన్నాయనుకోండి. జిల్లాలు, మండలాల పునర్విభజన ఒకటైతే.. రైతు బంధు పుణ్యమా అని సాగు భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. గ్రామాల్లో రూ. 5లక్షల నుంచి 10 లక్షల వరకు ఎకరం పలికే చోట ఒక్కసారిగా రూ.25 లక్షల నుంచి 30 లక్షలకు చేరింది. రేట్లు పెరగడంతో రియల్టర్లు అమ్మకాలు, కొనుగోళ్ల జోరు పెంచారు. ఎక్కడ చూసినా వెంచర్లే దర్శనమిచ్చాయి. నగరాలు, పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామాల్లోనూ వెలిశాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జనం కూడా తమకు ఉన్నంతలో భవిష్యత్ అవసరాల కోసం గుంట, రెండు గుంటలు కొనుగోలు చేశారు. ఇదంతా ఎన్నికల ముందు పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రియల్ రంగం స్తబ్దుగా మారింది. ఇక హైదరాబాద్ లో చెరువుల పునరుద్ధరణ, మూసీ ప్రక్షాళన పేరిట హైడ్రా రంగంలోకి దిగటంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. చెరువు శిఖం, బఫర్ జోన్లలో ఉన్న కట్టడాల కూల్చివేతలో సామాన్యుల ఇళ్లే ఎక్కువగా ప్రభావితం అయ్యాయి. రూ. లక్షలుపెట్టి లోన్ల ద్వారా లోనుగోలు చేసిన సామాన్యులు రోడ్డున పడడంతో జనం ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. ఇది ఒక్క రాజధానికే పరిమితం కాలేదు. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి.
*ఉపాధి పై ప్రభావం*
రియల్ ఎస్టేట్ రంగంలో కమీషన్లు భారీగా ఉండటంతో చాలా మంది దీనినే ఉపాధిగా మలచుకున్నారు. ఒక్కో డీల్ కు ప్రాపర్టీ బట్టీ రూ. వేలు, లక్షల్లో తీసుకున్న వారు కూడా ఉన్నారు. కొందరు అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్ లేకపోవడంతో నెలకు 10 వరకు విక్రయించే వారు ప్రస్తుతం ఒకటి కూడా కావట్లేదని పేర్కొంటుండడం గమనార్హం.
*కక్కలేక మింగలేక అన్నట్లు..*
క్రయవిక్రయాలు ఒక్కసారిగా నిలిచిపోవడంతో గతంలో ప్లాట్లు, ఇళ్ళు కొనుగోలు చేసినవారు విక్రయించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. డిమాండ్ లేకపోవడంతో కనీసం కొన్న ధర కూడా రావట్లేదని పరిస్థితి కక్కలేక మిగలేక ఉందని అంటున్నారు.
*కొత్త సంవత్సరం పైనే ఆశలు*
రానున్న నూతన సంవత్సరం పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ మునుపటిలా కొంసాహలంటే ప్రధానంగా రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు రిజిస్ట్రేషన్ పకడ్బందీగా చేపట్టడం, ఎల్ ఆర్ ఎస్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయడం వంటి చర్యలతో త్వరగా ఊపందుకునే అవకాశాలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఏదేమైనా కొత్త సంవత్సరంలో రియల్ రంగం ఎలా ఉంటుందో చూడాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.