Lok Sabha Election 2024: ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాకా.. ఎన్నికల సంఘానికి సర్వాధికారాలు ఉంటాయని రాజ్యాంగం చెబుతోంది. అధికారంలో ఉన్నవారు, అధికారులు అందరూ ఈసీ నిబంధనల మేరకు పని చేయాలి. కానీ, మారుతున్న పరిణామాలతో ఈసీ కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విపక్షాలు కూడా ఈసీఐ ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన పరిణామాలపై ఈసీ మౌనం వహించడం విపక్షాల ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
ప్రార్థన మందిరంపైకి బాణం..
హైదరాబాద్‌లో ఈసారి రాజకీయం గతంలో ఎన్నడూ లేనంతగా హీటెక్కుతోంది. పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎంఐఎకు కంచుకోటగా ఉన్న హైదరాబాద్‌లో పాగా వేయాలని కమలం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇదిలా ఉంటే.. శ్రీరామ నవమి సందర్భంగా పాతబస్తీలో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో ఆమె రాముడిలా బాణం వదిలినట్లు యాక్షన్ చేశారు. అయితే ఈ బాణం అక్కడ ఉన్న ఓ ప్రార్థన మందిరంపైకి వదిలినట్లు ఉందని ఎంఐఎం ఆరోపిస్తోంది. ఈమేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది. దీనిపై మాధవీలత కూడా మండిపడ్డారు. ఎంఐఎం తీరును తప్పుపట్టారు. తాను ఏ మతాన్ని కించపర్చలేదని స్పష్టం చేశారు. గాలిలోకి బాణం వదిలానని చెప్పారు.
ఈసీ మౌనం..
మాధవీలత తీరుపై ఎంఐఎం ఈసీకి ఫిర్యాదు కూడా చేసింది. సుమోటోగా కేసు నమోదు చేయాల్సిన ఈసీ ఫిర్యాదు చేసిన తర్వాత కూడా స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. వీడియోపై అందిన ఫిర్యాదులతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 295/A కింద కేసు నమోదు చేశారు. ఎన్నికల సంఘం మాత్రం దీనిపై ఇంతవరకు స్పందించలేదు.
మాధవీలతపై చర్యకు డిమాండ్..
ఇదిలా ఉంటే.. మాధవీలత తీరును ప్రత్యర్థి పార్టీలన్నీ తప్పుపడుతున్నాయి. ప్రశాంతంగా ఉన్న పాతబస్తీలో గొడవలు సృష్టించేలా మాధవీలత ప్రయత్నిస్తున్నారని, ఆమెను పోటీకి అనర్హురాలుగా ప్రకటించాలని ఈసీని కోరుతున్నారు. ఈసీ మాత్రం చర్యల దిశగా ఎలాంటి ప్రయత్నం చేయలేదు. దీంతో ఈసీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.