Etela Rajender: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేస్తున్నారు సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు ఈటల రాజేందర్. ఈమేరకు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్‌ను కూడా సమర్పించారు. ఇందులో తన ఆస్తులు రూ.54.01 కోట్లుగా పేర్కొన్నారు. రూ.20.43 కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారు. తనపై 54 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. తన భార్య జమున పేరిట 1.5 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్లు తెలిపారు. వివిధ కంపెనీల్లో పెట్టుబడులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఇక తన కుటుంబం పేరిట 72.25 ఎకరాల భూమి, పౌల్ట్రీ ఫాంలు, నివాస, వాణిజ్య భవనాలు ఉన్నట్లు వివరించారు.
ఐదు నెలల్లో రూ.7 లక్షల పెరుగుదల..
ఇక ఈటల రాజేందర్ ఆస్తులు గడిచిన ఐదు నెలల్లో రూ.7 లక్షలు పెరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అంటే 2023 నవంబర్‌లో హుజూరాబాద్, గజ్వేల్ నుంచి ఈటల నామినేషన్ వేశారు. ఆ సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తులను 53.94 కోట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఎంపీగా నామినేషన్‌తోపాటు సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తి రూ.54.01గా పేర్కొన్నారు. అంటే ఐదు నెలల్లో రూ.7 లక్షల ఆదాయం పెరిగింది. ఇక కేసుల విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల సమయంలో 40 కేసులు ఉన్నట్లు తెలుపగా, తాజాగా వాటి సంఖ్య 54కు పెరిగింది. స్థిరాస్తులు రూ.12.50 కోట్లు, చరాస్తులు రూ.16.74 లక్షలు ఉండగా, అప్పులు రూ.3.48 కోట్లుగా చూపించారు. తన భార్య పేరిట రూ.14.78 కోట్ల స్థిరాస్తులు, రూ.26.48 కోట్ల చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. తన భార్య పేరిట రూ.15.51 కోట్ల అప్పులు ఉన్నట్లు వివరించారు.