https://oktelugu.com/

Viral video : భార్య లంచగొండి.. భర్తేమో భారతీయుడు టైప్.. చివరికి ఆమె బండారం ఎలా బయటపెట్టాడంటే.. వీడియో వైరల్

ఠాగూర్ సినిమా చూశారా.. అందులో లంచం వల్ల మన దేశ ప్రజలు పడుతున్న బాధలను చిరంజీవి కోర్టు సీన్ లో ఎంతో ఉద్వేగంగా చెబుతాడు.. ఆ సీన్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒకచోట లంచం ఇవ్వడం వల్ల తాము పడిన ఇబ్బందులు గుర్తుకు వస్తాయి. అలాంటి సినిమాలు చాలా వచ్చినా మనదేశంలో మార్పు రాలేదు. మార్పు వచ్చే అవకాశం లేదు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 9, 2024 4:44 pm
    Manikonda DE Divya Jyothi

    Manikonda DE Divya Jyothi

    Follow us on

    Viral video :  వాస్తవానికి మన దేశంలో లంచావతారులైన అధికారులను శిక్షించడానికి అనేక వ్యవస్థలు ఉన్నాయి. ఇన్ని వ్యవస్థలు పనిచేస్తున్నప్పటికీ లంచం అనే జాడ్యాన్ని అధికారులు వదులుకోవడం లేదు. పైగా కొత్త కొత్త రూపాల్లో లంచాల వసూలు చేస్తున్నారు. ఆ మధ్య తెలంగాణలో భూమికి సంబంధించిన వివాదంలో ఓ తహసీల్దార్ అనవసరంగా తల దూర్చింది. దీంతో కడుపుమండిన ఓ రైతు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఆ ఘటనలో ఆమె చనిపోయింది. అప్పట్లో ఆ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లంచం తీసుకొని కూడా పనిచేయకపోతే రైతుల్లో ఎంత కడుపు మంట ఉంటుందో బయట ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు బంజారా హిల్స్ లో ఓ ఇంటికి సంబంధించి వివాదంలో షేక్ పేట రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగార్జున 15 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. అయితే ఈ వ్యవహారంలో షేక్ పేట తహసీల్దార్ కు కూడా ప్రమేయం ఉందని ఏసీబీ అనుమానించింది. చిక్కడపల్లి లో ఉన్న తహసీల్దార్ సుజాత ఇంట్లో సోదాలు చేసింది. 30 లక్షల నగదు, 15 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత సుజాతను ఏసీబీ అరెస్టు చేసి.. కోర్టులో హాజరపరిచింది. అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించింది. సుజాత భర్త అజయ్ కూడా ఏసీబీ అధికారుల విచారణకు హాజరు కావలసి ఉండగా.. అంతకంటే ఒకరోజు ముందు అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు సుజాత కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. లంచం వల్ల కుటుంబాలు ఎలాంటి దుస్థితిని ఎదుర్కొంటాయో సుజాత కుటుంబం ఉదంతం ఒక ఉదాహరణగా నిలిచింది. అయినప్పటికీ ప్రభుత్వాధికారులు మారడం లేదు.

    భార్య లంచావతారాన్ని బయటపెట్టాడు

    రంగారెడ్డి జిల్లా మణికొండ లోని పురపాలక శాఖలో డీఈఈ గా దివ్య జ్యోతి అనే అధికారి పనిచేస్తున్నారు. ఆమె ప్రతి పనికి లంచాలు వసూలు చేయడం.. లంచాల ద్వారా వచ్చిన డబ్బును తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం పరిపాటిగా మారింది. దీంతో ఇంట్లో గుట్టలు గుట్టలుగా నగదు పోగుపడి ఉంది. ఇది పద్ధతి కాదని ఆమె భర్త ఆమెను హెచ్చరించగా.. దివ్య జ్యోతి పట్టించుకోలేదు. దీంతో ఆమె ఇంట్లో దాచిన డబ్బు కట్టలను.. ఆ ప్రదేశాలను చూపిస్తూ ఆయన ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ” దివ్య జ్యోతి నిత్యం లక్షల్లో లంచం తీసుకుంటుంది. గత ఏడు సంవత్సరాల లో ఆమె లంచం తీసుకొని రోజంటూ లేదు. భారీగా డబ్బు తీసుకోవడం నన్ను మనోవేదనకు గురిచేస్తోంది. లంచం మంచిది కాదని నేను వార్నింగ్ ఇచ్చాను. అయినప్పటికీ ఆమె మానుకోవడం లేదని” ఆమె భర్త పేర్కొన్నారు. దాదాపు 80 లక్షల విలువైన నగదు కట్టలు ఇంట్లో ఎక్కడపడితే అక్కడే ఉన్నాయని.. దివ్య జ్యోతి భర్త ఆ వీడియోలో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలను కూడా చూపించాడు. నా భార్య తీసుకున్న లంచానికి ఈ దృశ్యాలే నిదర్శనం అని పేర్కొన్నాడు. మణికొండ ప్రాంతంలో కాంట్రాక్టర్ల నుంచి భారీగా కమిషన్లను తీసుకుంటూ.. ఇంటికి కట్టలకట్టలకు నగదు తీసుకొస్తోందని దివ్య జ్యోతి భర్త ఆ వీడియోలో పేర్కొన్నాడు.. ఇదే విషయంలో తాను జ్యోతితో గొడవపడ్డానని.. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదని అతడు వాపోయాడు. తాను నిలదీస్తే పై అధికారులు లంచం తీసుకోమని ప్రోత్సహిస్తున్నారని చెబుతోందని అతడు వివరించాడు. తన భార్య చేస్తున్న తప్పుడు పనులను చూసి తట్టుకోలేక తాను ఈ వీడియో తీస్తున్నట్టు అతడు వెల్లడించాడు. అయితే జ్యోతి పై ఇటీవల అవినీతి ఆరోపణలు రావడంతో.. రెండు రోజుల క్రితం ఆమెను ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు బదిలీ చేసింది.